Connect with us

News

హాస్యాన్ని పంచిన ‘అచ్చ తెలుగు తిట్లు’ సాహితీ సమావేశం: TANA ప్రపంచ సాహిత్య వేదిక

Published

on

Dallas, Texas: తానా సంస్థ (TANA) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. “అచ్చ తెలుగు తిట్లు” అనే అంశం మీద ఆదివారం జరిగిన 93 వ అంతర్జాల సమావేశం చాలా ఉల్లాసంగా జరిగింది.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ “అనాదినుంచి తిట్లు తెలుగు భాషలో ఒక భాగంగానే ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలలో, స్నేహితులమధ్య వాడే కొన్ని పదాలు బయటివారికి కఠినంగా అనిపించినా, అవి అక్కడ వారి ఆప్యాయత లేదా సంబంధాలకు సంకేతాలుగా ఉంటాయన్నారు. కన్యాశుల్కం నాటకంలాంటి నాటకాలలోను, పాత సినిమాలలోను వాడిన సరదా తిట్లు సునిశితమైన హాస్యాన్ని పంచాయి.

వీధి భాష, గ్రామీణ సంభాషణలలో తిట్లు అలవోకగా చాలా సహజంగా జాలువారతాయి. అయితే అవి మోతాదు మించితే బూతులుగా పరిణమిస్తాయి, ప్రస్తుతం రాజకీయాలలో కొంతమంది రాజకీయనాయకులు “న బూతో న భవిష్యత్” గా మార్చుకుని, ఒకరిని మించి ఒకరు బూతులతో తిట్టుకోవడంతో సమాజంలో జుగుప్సాకర వాతావరణాన్ని సృష్టిస్తున్నది. కనుక వాడే భాష పట్ల జాగ్రత్త అవసరం” అన్నారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగువేదకవి, సినీ గీతరచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavithula Ramalingeswara Rao) మాట్లాడుతూ ”తానా ప్రపంచ సాహిత్య వేదిక ఇంతవరకూ నిర్వహించిన అంతర్జాల సమావేశాలన్నీ ఒక ఎత్తు, ఈ 93వ తిట్ల సమావేశం మరో ఎత్తు అంటూ నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మరియు ఇతర కార్యవర్గసభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

రామాయణ, భారత, భాగవతలాలోని అనేక సందర్భాలలో ప్రయోగించిన తిట్లతో సహా, ఆయన స్వయంగా వ్రాసిన తిట్ల దండకం, తిట్ల పద్యాలను, పాటలను, పేరడీలను గానంచేసి ఈ సమావేశానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిట్టేవాడికి బిపి తగ్గుతుందని, తిట్టించుకున్న వాడికి బీపి పెరుగుతుందని అన్నారు. తెలుగుభాష ఉన్నంతవరకు తిట్లు ఉంటాయని, తిట్లు భాషకు బలం అని, అయితే వాడే సమయం సందర్భం చూసుకోవడం అవసరం అన్నారు.”

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ళ భరణి (Tanikella Bharani) మాట్లాడుతూ – తిట్లు ప్రాంతాలను బట్టి మార్పు చెందుతూ వివిధ యాసలతో వాడే పదాలు వినోదం కల్గిస్తాయి, ప్రముఖ రచయిత జి.యస్ మోహన్ వ్రాసిన “జానపద తిట్లు” తనకు నచ్చిన గ్రంధం అని, ఆ గ్రంధాన్ని చూపుతూ దానిలోని కొన్ని తిట్లను తనదైన శైలిలో విన్పించి నవ్వులు కురిపించారు.

విశిష్టఅతిథిగా పాల్గొన్న బెంగళూరు విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షులు, కన్నడ, తెలుగు భాషలలో ఎన్నో గ్రంధాలను రచించిన ప్రముఖ రచయిత ఆచార్య జి. ఎస్ మోహన్ మాట్లాడుతూ ”అన్ని భాషలలోను తిట్లు ఉన్నాయని, వివిధ భాషలు, ప్రాంతాలలో వాడే తిట్లను ఎంతో శ్రమించి సేకరించానని, జానపదులు వాడిన తిట్లతో 1980 ల లోనే తాను వ్రాసిన గ్రంధం ఎంతోమంది ఆదరణ పొందడం సంతోషం అంటూ వివిధ ప్రాంతాలలో వాడే తిట్లను వినిపించారు.”

విశిష్టఅతిథిగా పాల్గొన్న హైదరాబాద్ (Hyderabad) కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డి. విజయలక్ష్మి మాట్లాడుతూ – “తిట్ల మీద ఒక డిప్లొమా పొందానని, ఎంతో పరిశీలనాత్మక దృష్టితో ఒక సిద్దాంత వ్యాసం వ్రాసే ఆలోచనతో విద్యార్ధులను ప్రోత్సహిస్తే, ఎవ్వరూ ముందుకు రాలేదని అంటూ తిట్లు దాని పుట్టు పూర్వోత్తరాలను ఎన్నో ఉదాహరణలతో విశదీకరించారు.

విశిష్టఅతిథిగా పాల్గొన్న విశిష్ట రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ తెలుగు సాహిత్యంలో వివిధ సందర్భాలలో వాడిన తిట్లను, వాటి మూలాలను, వ్యుత్పత్తి అర్ధాలను ఎంతో లోతైన విశ్లేషణతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అలనాటి తెనాలి రామకృష్ణ వాడిన తిట్లు మొదలుకుని, నేటి జన సామాన్యంలో ఉన్న తిట్లతో సహా ఎన్నో ఉదాహరణలతో వాడిన తిట్లు ఒక పరిశోధనాపత్రంలా సాగి సమావేశానికి సాధికారత చేకూర్చింది.

తానా (TANA) ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ (Srinivas Chigurumalla) మాట్లాడుతూ ”తిట్ల మీద ఇంత సుదీర్ఘంగా ఒక సమావేశం జరగడం బహుశా ఇదే మొదటిసారి అయిఉంటుందని, పాల్గొన్న వక్తలందరూ ఎన్నో అరుదైన, విలువైన అంశాలను స్పృశించి ఈ తెలుగు తిట్ల సమావేశానికి శోభను చేకూర్చారని అందరికీ కృతజ్ఞతలు అన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected