Atlanta, Georgia: అమెరికాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (Greater Atlanta Telangana Society – GATeS) ఆధ్వర్యంలో మే 30, 2026న జార్జియా రాష్ట్రంలోని ఆల్ఫారెట్టా నగరంలో ఉన్న డెన్మార్క్ హై స్కూల్‌లో తెలంగాణ కల్చరల్ డే 2026 వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
వందలాదిమంది తెలంగాణ (Telangana) కుటుంబాలు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla), హిమజ (Himaja) పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి, జానపద కళల గొప్పతనాన్ని వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Performances), జానపద నృత్యాలు, బతుకమ్మ ప్రదర్శనలు, సంగీత విభావరి, యువత మరియు చిన్నారుల కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖ గాయనులు స్వాతి రెడ్డి, జనార్ధన్ పన్నెల (Janardhan Pannela), సృష్టి చెల్లా తమ గానామృతంతో ప్రేక్షకులను అలరించగా, అట్లాంటా (Atlanta) లైవ్ బ్యాండ్ ఉత్సాహభరితమైన సంగీత ప్రదర్శనతో సభను ఉర్రూతలూగించింది.
మధ్యాహ్నంప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగగా, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తెలంగాణ వంటకాలు, వ్యాపార ప్రదర్శనలు, కమ్యూనిటీ నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు కూడా సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి.
ఈ సందర్భంగా GATeS అధ్యక్షులు (Ramana Gandra), ఛైర్మన్ (Jyothsna Palakurthy) మరియు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. అమెరికాలోని తెలంగాణ (Telangana) ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సంస్కృతి, భాష, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కమ్యూనిటీ సభ్యుల విశేష సహకారం, వాలంటీర్ల అంకితభావం, స్పాన్సర్ల మద్దతుతో ఈ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్య అతిథులు, కళాకారులు, స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు హాజరైన ప్రతి కుటుంబానికి GATeS టీమ్ 2026 హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
“తెలంగాణ సంస్కృతి – ప్రపంచ వేదికపై” అనే నినాదాన్ని సార్థకం చేస్తూ GATeS (Greater Atlanta Telangana Society) టీమ్ 2026 నిర్వహించిన తెలంగాణ కల్చరల్ డే 2026, అట్లాంటా తెలుగు సమాజానికి చిరస్మరణీయమైన సాంస్కృతిక వేడుకగా నిలిచింది.