Connect with us

Cultural

Omaha, Nebraska: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాది సంబరాలు

Published

on

Omaha, Nebraska: ఒమాహా, నెబ్రాస్కాలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలు ఈ ఏడాది అంబరాన్నంటాయి. నెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో వెస్ట్‌సైడ్ మిడిల్ స్కూల్ (Westside Middle School) లో ఘనంగా నిర్వహించిన ఈ మహోత్సవం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది దాదాపు పన్నెండు వందల మంది తెలుగు ప్రజలు ఉగాది సంబరాలకు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచే అలంకరణలు, సాంప్రదాయ డెకరేషన్లు, రంగవల్లులు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కళా రూపాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు తల్లిని స్మరింపజేసేలా వేదికను ప్రత్యేకంగా అలంకరించడం వేడుకలకు మరింత శోభను తెచ్చింది.

ఈ సందర్భంగా దాదాపు నలభైకి పైగా సాంస్కృతిక ప్రదర్శనలు (Cultural Performances) ప్రేక్షకులను అలరించాయి. నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, స్కిట్స్, జానపద కళారూపాలు సభలో ఉత్సాహాన్ని నింపాయి. చిన్నారుల ప్రతిభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయనీ గాయకులు అంజనా సౌమ్య (Anjana Sowmya) మరియు తరుణ్ దోనిపాటి (Tarun Donipati) తమ మధుర గానాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వారి సంగీత ప్రదర్శనలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఉగాది (Ugadi) సందర్భంగా టీఎస్ఎన్ నిర్వహించిన బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, చెస్, పికిల్‌బాల్, క్యారమ్స్ తదితర క్రీడా పోటీల్లో పాల్గొన్న సుమారు 200 మంది క్రీడాకారుల్లో విజేతలకు ఈ వేడుకల్లో మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ ఉగాది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా టీఎస్ఎన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ (Lifetime Achievement Award) ప్రదానోత్సవం నిలిచింది.

కమ్యూనిటీకి విశిష్ట సేవలందించిన అమల దుగ్గిరాల గారికి “లీడర్‌షిప్ అండ్ కమ్యూనిటీ ఇంపాక్ట్” విభాగంలో టీఎస్ఎన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. అలాగే సంస్థకు అంకితభావంతో సేవలందించిన సుందర్ చొక్కర గారికి “డిస్టింగ్విష్డ్ సర్వీస్ అండ్ కమిట్‌మెంట్” విభాగంలో టీఎస్ఎన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. సభలో వీరిని ఘనంగా సన్మానించారు.

కమ్యూనిటీకి విశిష్ట సేవలందించిన అమల దుగ్గిరాల గారు ప్రత్యేకంగా ఈ ఉగాది సంబరాలకు హాజరై టీఎస్ఎన్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. టీఎస్ఎన్ (Telugu Samiti of Nebraska) మరింత పురోగతి సాధిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని సందేశం ఇచ్చారు.

అలాగే సంస్థకు అంకితభావంతో సేవలందించిన సుందర్ చొక్కర గారు కూడా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, ఎన్నో సంవత్సరాల సేవకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీఎస్ఎన్ మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన టీఎస్ఎన్ బృంద సభ్యులందరినీ అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ (Prasad Kolli) గారు పేరు పేరునా సభలో అభినందించి గౌరవించారు. అలాగే ఈ సంస్థ స్థాపనకు పునాది వేసిన పూర్వ అధ్యక్షులను ప్రత్యేకంగా ఆహ్వానించి, వారి సేవలను నవ యువతరానికి పరిచయం చేయడం సభలో హృద్యమైన ఘట్టంగా నిలిచింది.

ఈ వేడుకల్లో మరో విశేషం టీఎస్ఎన్ (Telugu Samiti of Nebraska) చరిత్రలో తొలిసారిగా డిజిటల్ మ్యాగజైన్ “టీఎస్ఎన్ తరంగిణి” విడుదల కావడం. తెలుగు భాష, సంస్కృతి, కమ్యూనిటీ సేవలను ప్రతిబింబించే ఈ మ్యాగజైన్‌ను సభలో ఆవిష్కరించగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన చుండ్రు శ్రీనివాస్ గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, విదేశాల్లో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించడంలో టీఎస్ఎన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. తెలుగు వారందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే టీఎస్ఎన్ నిర్వహిస్తున్న సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు (Service Activities) భవిష్యత్ తరాలకు ఎంతో ప్రేరణగా నిలుస్తాయని ఆయన అభినందించారు.

TSN (Telugu Samiti of Nebraska) యూత్ కమిటీ (Youth Committee) సభ్యులు భవిష్యత్ కార్యక్రమాలపై తమ ప్రణాళికలను సభలో వివరించారు. యువత మరియు చిన్నారుల అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే అవకాశాలు, సాంస్కృతిక మరియు విద్యా కార్యక్రమాల గురించి వివరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఈ వేడుకల్లో విందు భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ తెలుగు వంటకాలతో పాటు వివిధ రకాల రుచికరమైన వంటకాలు తెలుగు వారిని ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే జ్యూవెలరీ స్టాళ్లు, ఫుడ్ స్టాళ్లు, వ్యాపార ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. కుటుంబ సమేతంగా వచ్చిన వారందరూ స్టాళ్లను (Shopping Stalls) ఆస్వాదిస్తూ ఉత్సాహంగా గడిపారు.

అదేవిధంగా, ఈసారి ఉగాది (Ugadi) వేడుకల్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికపై ప్రదర్శితమైన ప్రతి పాట, నృత్యానికి అనుగుణంగా అందమైన బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంగీతం, నృత్యాలకు తగ్గట్లుగా మారుతూ వచ్చిన దృశ్యాలు కార్యక్రమాలకు మరింత వైభవాన్ని తీసుకువచ్చాయి.

ఈ కార్యక్రమానికి జగదీష్ అందే ఫోటోగ్రఫీ సేవలను అందించగా, జగదీష్ వల్లభనేని వీడియోగ్రఫీ నిర్వహించారు. ప్రతి ముఖ్యమైన క్షణాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఈ మహోత్సవాన్ని మరింత చిరస్మరణీయంగా తీర్చిదిద్దారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో టీఎస్ఎన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, టీఎస్ఎన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees) సభ్యులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా కృషి చేశారు.

నిర్వహణ, ఆతిథ్యం, అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఉగాది మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన స్పాన్సర్లు, దాతలు మరియు కమ్యూనిటీ సభ్యులకు టీఎస్ఎన్ (TSN) ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. వారి సహకారం వల్లే ఈ వేడుకలు మరింత వైభవంగా నిర్వహించగలిగామని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఉగాది సందర్భంగా సేకరించిన నిధులను కమ్యూనిటీ అవసరాల సమయంలో సహాయం అందించే అత్యవసర సహాయక కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. టీఎస్ఎన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (Executive Committee) మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి వాలంటీర్‌, దాతలు, స్పాన్సర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

వారి సహకారం లేకపోతే ఈ మహోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం సాధ్యమయ్యేది కాదని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించిన ఈ ఉగాది సంబరాలు ఒమాహా (Omaha, Nebraska) తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ (Prasad Kolli) గారు పేర్కొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected