తెలుగు భాషా సాహిత్య వైభవానికి మరొక అంతర్జాతీయ వేదికగా షాంఘై (Shanghai) నిలిచింది. చైనా దేశంలోని షాంఘై నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్’, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, లోక్ నాయక్ ఫౌండేషన్ (Lok Nayak Foundation), వంశీ ఆర్ట్ థియేటర్స్, మలేసియా తెలుగు సంఘం సంస్థల సహకారంతో, ఈ అక్టోబర్ 24, 25 తేదీలలో నిర్వహించబడిన “10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా పేర్కొనవచ్చు.
భారతదేశం, అమెరికా, మలేసియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తదితర దేశాల నుంచి ప్రముఖ సాహితీవేత్తలు (Litterateurs), రచయితలు, కవులు, భాషాభిమానులు ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా పాల్గొని ఈ సదస్సును ఎంతో విజయవంతం చేశారు.
సదస్సు ముఖ్య ఆకర్షణల్లో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు పంపిన అభినందన సందేశం, ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధానోపన్యాసం, ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కీలకోపన్యాసం (Keynote speech) విశేష ఆదరణ పొందాయి. చైనాలో మొట్టమొదటిసారిగా ఇంత విస్తృత స్థాయిలో తెలుగు సాహితీ సదస్సు నిర్వహించడం విశేషమని ప్రధాన వక్తలు పేర్కొన్నారు.
రెండురోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ప్రముఖ సాహితీవేత్తలు, తమతమ రచనలను, పరిశోధనలను, వివిధ వేదికలపై ఇతర సాహితీవేత్తలతో, సాహితీ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక రచనా ధోరణులు, ప్రవాస తెలుగు సాహిత్యం వంటి విభిన్న అంశాలపై ముప్పైకి పైగా ప్రసంగాలు (Speeches) చేశారు.
వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ వంగూరి చిట్టెన్ రాజు (Vanguri Chitten Raju) మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా తెలుగు భాషాభివృద్ధి పట్ల ఆసక్తి, సాహిత్యాభిలాష పట్ల అభిరుచి పెంపొందించాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. షాంఘైతో పాటు చైనాలోని ఇతర నగరాల్లో నివసిస్తున్న తెలుగు వారిలో అలాంటి ప్రేరణ కలిగితే, ఈ కార్యక్రమం విజయవంతమైనట్లే కాకుండా, ఇందులో భాగస్వాములైన అందరి శ్రమకు సార్థకత చేకూరినట్లేనని వారు అన్నారు.
ఈ సందర్భంగా మలేషియా (Malaysia) ప్రముఖ తెలుగు భాషాభిమాని డా. మద్దెల అచ్చయ్య కుమార్ రావు గారికి “జీవన సాఫల్య పురస్కారం” ప్రదానం చేయడం సదస్సుకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది. అలాగే దివంగత సాహితీవేత్త డా. తెన్నేటి సుధాదేవి స్మృతికి సదస్సును అంకితం చేయడం ద్వారా నిర్వాహకులు తమ సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు.
శాయి రాచకొండ నిర్వహణలో, ఈ సదస్సులో మొత్తం పది నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో వెంకట్ నాగం రచించిన “రచ్చబండ చర్చలు”, “కలగూర గంప”, రాధిక మంగిపూడి రచించిన “గీత నుంచి గీతాల దాకా”, ఆర్. శర్మ దంతుర్తి రచించిన “విలువల వంతెన”, డా. నోముల నర్మద రెడ్డి రచించిన “చుక్ చుక్ రైలులో మా ప్రయాణం”, వంగూరి చిట్టెన్ రాజు రచించిన “అవేమైనా జ్ఞాపకాలా, మర్చిపోవడానికి?, న్యూజీలండ్ (New Zealand) రచయిత సతీష్ గొల్లపూడి రచించిన బాల సాహిత్యం “స్వర్గ కాలం”, చైనా (China) నుంచి వెలువడిన మొట్టమొదటి తెలుగు గ్రంధం సురేంద్ర నూకల, షాంఘై రచించిన – “భారతీయ హృదయం ప్రవాస జీవితం” వంటి గ్రంథాలు సాహితీప్రియుల ప్రశంసలు అందుకున్నాయి. రామా చంద్రమౌళి గారి బృహత్ గ్రంధం “కాల నాళిక” కి డా. దుర్గా శశికిరణ్ గారి స్వేచ్చానువాదం లో ఆంగ్ల గ్రంధ “KairoNexus” అంతర్జాతీయ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
షాంఘై నివాసులైన భవాని వాసిరెడ్డి (“శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు”), సరిపల్లి వర్ణిక (“చైనా- నా జీవితాన్ని మార్చిన ఎనిమిదేళ్ళు”, పద్మలత నూకల (“భాష యొక్క ప్రాముఖ్యత”), హరి బాబు రాయి (“20ఏళ్ళ చైనా అనుభవాలు”), గరిమ కొండా (“ముందు తరానికి తెలుగు భాష, సంప్రదాయం”), మోనిక సుంకర (“వలస పాలన నాటి షాంఘైలో భారతీయ సిక్కు పోలీసుల నివాసాలు (1920-1940)”, “విక్రమార్కుని కథలు- మంగోలు భాష, భారతీయ భాషల సమన్వయం: మీద బీజింగ్ వాసులు కీర్తి ఆజాద్ మండవ & సుమ కోదండరాం ల ప్రసంగం సభాసదులను ఆకట్టుకున్నాయి. డా. తనికెళ్ళ భరణి తో ముఖాముఖీ, డా. మాధవ రెడ్డి కొలన్ నిర్వహణలో జరిగిన “చైనాలో తెలుగు” చర్చా వేదిక (Forum) ఆసక్తికరంగా జరిగాయి.
ప్రత్యక్ష సదస్సుకు అనుబంధంగా వంశీ ఇంటర్నేషనల్ అధినేత డా. వంశీ రామరాజు, రాధిక మంగిపూడి, కవుటూరు రత్నకూమార్ (Ratna Kumar Kavuturu) సంధానకర్తలుగా అంతర్జాలం (Internet) లో నిర్వహించిన జూమ్ వేదికలో పలువురు సాహితీవేత్తలు ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. విక్రమ్ సుఖవాసి సాంకేతిక సహకారం అందించారు.
సాహిత్య కార్యక్రమాలతో పాటు మలేషియా తెలుగు అకాడమీ బృందం ప్రదర్శించిన “ప్రహ్లాద చరిత్ర” నృత్యనాటిక, హాంకాంగ్‌కు (Hong Kong) చెందిన నాట్యాచార్యుడు సంజయ్ వడపల్లి నృత్య ప్రదర్శనలు, షాంఘై స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు భాషను (Telugu Language) ప్రపంచ వేదికలపై మరింత విశిష్ట స్థానానికి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసిందని సదస్సు ప్రధాన నిర్వాహకులు (Organizers) షాంఘై తెలుగు సంఘం అధ్యక్షులు డా. మాధవ రెడ్డి కోలన్ తెలిపారు.
అతనితో పాటు, ఈ సదస్సు విజయవంతం కావడంలో షాంఘై తెలుగు సంఘానికి చెందిన నాగ మల్లికార్జునరావు తోట, భవాని వాసిరెడ్డి, మోనికా సుంకర, ఉదయ్ భాస్కర్ పెయ్యేటి, వర్ణిక సరిపల్లి, రాహుల్ కోరాడ, సంగీత థామస్, పల్లవితో పాటు సంఘ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు అందరూ విశేష కృషి చేశారు. వారి సహకారం సదస్సు (Conference) విజయానికి కీలకంగా నిలిచింది.
సదస్సు విజయానికి సహకరించిన స్పాన్సర్లకు (Sponsors), అలాగే పాల్గొన్న అతిథులకు రుచికరమైన విందుభోజనం అందించిన షాంఘైలోని స్థానిక బాలీవుడ్ రెస్టారెంట్ యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు సాహిత్య చరిత్రలో చైనాలో తొలిసారిగా నిర్వహించబడిన తెలుగు సాహితీ సదస్సుగా ఈ కార్యక్రమాన్ని “తెలుగు బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ ” అంతర్జాతీయ (International) రికార్డుగా ప్రకటించి నమోదు చేసి, ప్రశంసాపత్రం అందజేసింది.