ఆగస్టు 19, 2026 మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా బే ఏరియా (Bay Area) నగరమైన నెవార్క్ (Newark, California) లో “వీక్షణం – సాహితీ గవాక్షం” 14వ వార్షికోత్సవ వేదిక సాక్షిగా సాహిత్య పరిమళాలతో నిండిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ రచయిత వెంకట్ నాగం రచనలు “రచ్చబండ చర్చలు” మరియు “కలగూర గంప” పుస్తకాల ఆవిష్కరణకు వీక్షణం ఆధ్వర్యంలో సాహిత్యాభిమానులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కాలిఫోర్నియా బే ఏరియాలో (California Bay Area) నెలకొన్న వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవ సమావేశం ఇందుకు వేదికైంది. బే ఏరియా శివారు నగరమైన నెవార్క్‌లో (Newark, California) నివసిస్తున్న రచయిత్రి శ్రీమతి షంషాద్, శ్రీ అబ్దుల్లా గారి స్వగృహంలో ఈ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సభకు తెలుగు సాహిత్యంలో ఘనాపాఠీలుగా కీర్తింపబడుతున్న కౌముది పత్రిక శ్రీ కిరణ్ ప్రభ గారు, నెచ్చెలి పత్రిక ప్రధాన సంపాదకురాలు డా. కె. గీతామాధవి సభాధ్యక్షులుగా విచ్చేశారు.
“రచ్చబండ చర్చలు” మరియు “కలగూర గంప” పుస్తకాలను శ్రీ కిరణ్ ప్రభ, డా. కె. గీతామాధవి, శ్రీమతి రమణ, శ్రీమతి శారద కాశీవఝల, శ్రీమతి షంషాద్, డా. సురేందర్ రెడ్డి, వెంకట్ నాగం (Venkat Nagam), వాణి నాగం ఆహుతుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ ప్రభ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రజలతో మమేకమయ్యే భాషలో ఆలోచనాత్మక కాలం శీర్షికలో పత్రికలలో రచనలు చేయడం ఎంత ముఖ్యమో వివరించారు.
ఆయన మాట్లాడుతూ, వెంకట్ నాగం గారి రచనలు సమాజంలోని విభిన్న అంశాలను స్పృశించాయి అని, ఈ కాలం రచయితలు అరుదుగా ఉంటారు, అమెరికాలో ఉన్న అతి కొద్దిమందిలో వెంకట్ నాగం ఒకరు అని ప్రశంసించారు. కాలం శీర్షికలో రచనలకు భారత్ (India) కు సంబంధించిన విభిన్న అంశాలను ఎంచుకోవడం, వాటిని పాఠకులతో అనుసంధానం చేస్తూ నడిపించడం, ఒక చక్కని ముగింపు ఇవ్వడమే కాకుండా, భిన్న ప్రముఖ పత్రికల సంపాదకీయం పేజీలలో వాటిని వెలువరించడంలో వెంకట్ నాగం పరిణతి సాధించారని ఆయన చెప్పారు.
వెంకట్ నాగం (Venkat Nagam) వ్యాస రచనా ప్రయాణం మరింత ఉజ్వలంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. వీక్షణం వ్యవస్థాపకురాలు, సంధానకర్త, నెచ్చెలి పత్రిక ప్రధాన సంపాదకురాలు డా. కె. గీతామాధవి రచయిత యొక్క సామాజిక దృక్పథాన్ని మరియు సాహిత్య నిబద్ధతను ప్రశంసించారు. అనంతరం రచయిత వెంకట్ నాగం గారు తన రచనల వెనుక ఉన్న ఆలోచనలను, ప్రజలతో మమేకమయ్యే అనుభవాలను సభతో పంచుకున్నారు.
అమెరికాలో నిర్వహిస్తున్న సాహితీ సభలు ఇండియాలో (India) వలె ఉన్నతంగా సాగుతున్నాయనీ, 25 ఏండ్ల క్రితం బే ఏరియాలో గరికిపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) గారి అవధానం కార్యక్రమంలో సంధానకర్తగా కిరణ్ ప్రభ గారి వేదికపై ఉండగా చివరి బెంచిలో కూర్చొని కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించిన నేను ఈరోజు వీక్షణం 14వ వార్షికోత్సవ సభలో కిరణ్ ప్రభ గారి, డా. కె. గీతామాధవి గారి అమృత హస్తాల మీదుగా తన పుస్తకాల ఆవిష్కరణ జరగడం, కిరణ్ ప్రభ (Kiran Prabha) గారి పక్కన కూర్చొని తన ప్రసంగాన్ని వినిపించే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్టు వెంకట్ నాగం చెప్పారు.
ఈ మహావకాశాన్ని కలగచేసిన వీక్షణం సాహితీ సంస్థకీ, వ్యవస్థాపకురాలు డా. కె. గీతామాధవి గారికీ వెంకట్ నాగం ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో డా. కె. గీతామాధవి వీక్షణం వేదిక 14 ఏండ్ల ప్రయాణం విశేషాలను వివరించడంతో ప్రారంభమై, అనంతరం వీక్షణం వార్షిక సంచిక ఆవిష్కరణ, వెంకట్ నాగం పుస్తకావిష్కరణ, డా. కె. గీతామాధవి రచించిన “అనగనగా అమెరికా” పుస్తకావిష్కరణ, తదుపరి వీక్షణం ఆహుతుల ఆత్మీయ పరిచయం కార్యక్రమాలు జరిగాయి.
వీక్షణం ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకాల ఆవిష్కరణతో తెలుగు సాహిత్య (Literary) ప్రపంచంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఆసాంతం సభికులు రెట్టించిన ఉత్సాహంతో కరతాళ ధ్వనుల ద్వారా తమ హర్షాన్ని తెలియజేశారు. నిజమైన తెలుగు భాషకు పండగ అంటే ఇదేనని పలువురు వ్యాఖ్యానించారు.