Connect with us

Literary

China ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో Hong Kong తెలుగు సమాఖ్య సభ్యుల విశేష భాగస్వామ్యం

Published

on

హాంగ్ కాంగ్ నేపథ్యం

Shangai, China: చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతమైన హాంగ్ కాంగ్ ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటి. సుమారు 75 లక్షల మంది జనాభా కలిగిన హాంగ్ కాంగ్ ‌లో చైనీయులే అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, భారతీయులు కూడా 1840ల నుండి అక్కడ స్థిరపడి నగర అభివృద్ధిలో విశిష్టమైన పాత్ర పోషిస్తున్నారు. నేడు వేలాదిమంది భారతీయులు హాంగ్ కాంగ్ ‌(Hong Kong) లో నివసిస్తూ వ్యాపారం, ఆర్థిక రంగం, విద్య, సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.

హాంగ్ కాంగ్ లో భారతీయులు – తెలుగు సమాజ ప్రస్థానం

హాంగ్ కాంగ్ ‌లో తెలుగు కుటుంబాలు నాలుగు దశాబ్దాలకు పైగా నివసిస్తూ తెలుగు భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో కృషి చేస్తున్నాయి. హాంగ్ కాంగ్ (Hong Kong) లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల ఐక్యత, భాషా-సాంస్కృతిక పరిరక్షణ లక్ష్యాలతో 1990ల చివరి దశలో ఆవిర్భవించిన ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (Hong Kong Telugu Samakhya), 2013 నుండి అధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ తెలుగు భాష, సాహిత్యం, కళలు మరియు సంప్రదాయాల ప్రోత్సాహానికి అంకితభావంతో సేవలందిస్తోంది.

సమాఖ్య వ్యవస్థాపక సభ్యురాలు శ్రీమతి జయ పీసపాటి గారు 2016 నుండి సింగపూర్, హైదరాబాద్, కాకినాడ, మలేషియా మరియు షాంఘై నగరాల్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సదస్సులు, సాహిత్య మహాసభల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. ఆమెకు ఇటీవల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ (Telugu Book Of Records) హాంగ్ కాంగ్ చీఫ్ హానరరీ అడ్వైజర్ అండ్ కోఆర్డినేటర్గా గౌరవ బాధ్యతలు అప్పగించబడగా, ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ (APTF) బోర్డులో వైస్ ప్రెసిడెంట్ (ఈస్ట్ ఏషియా) గా ఎన్నిక కావడం హాంగ్ కాంగ్ తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది.

సదస్సులో (Conference) భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు పంపిన అభినందన సందేశం విశేష ఆదరణ పొందింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారి ముఖ్యోపన్యాసం, ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Dr. Yarlagadda Lakshmi Prasad) గారి విశిష్ట ప్రసంగం పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. చైనాలో (China) ఇంత విస్తృత స్థాయిలో తెలుగు సాహిత్య సదస్సును నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

షాంఘైలోని భారత కాన్సులేట్ (Consulate) జనరల్ కార్యాలయం తరఫున కాన్సుల్స్ శ్రీమతి స్నేహజ జొన్నలగడ్డ గారు, శ్రీ రోహిత్ కోగంటి గార్లు గౌరవ అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా గడ్డపై ఇటువంటి ప్రతిష్ఠాత్మక తెలుగు సాహిత్య సదస్సు నిర్వహించబడడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన షాంఘై తెలుగు సంఘాన్ని అభినందించారు.

నార్డ్ ఆంగ్లియా ఇంటర్నేషనల్ స్కూల్ తమ పాఠశాల (School) ప్రాంగణాన్ని తెలుగు సింపోజియం నిర్వహణకు ఉదారంగా అందించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ రిచర్డ్ థాంప్సన్ గారు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.

ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (The Hong Kong Telugu Samakhya) వ్యవస్థాపక అధ్యక్షురాలు Jaya Peesapaty స్పందిస్తూ, ఈ ఏడాది తమ సభ్యులు సాహిత్య మరియు సాంస్కృతిక విభాగాల్లో విశేషంగా పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆమె సదస్సు నిర్వహణ బృందంలో భాగస్వామిగా సేవలందించడమే కాకుండా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున షాంఘై తెలుగు సంఘానికి “షాంఘైలో తొలి తెలుగు సింపోజియం (Symposium) నిర్వహించిన సంస్థ”గా ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ కూచిపూడి (Kuchipudi), ఆంధ్రనాట్యం, పెరిని నృత్య కళాకారుడు శ్రీ సంజయ్ వడపల్లి గారు ఆంధ్రనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. అలాగే “భారతీయ శాస్త్రీయ నృత్య రీతులు – ఆధునిక పోకడలు” అనే అంశంపై పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించి సభికుల ప్రశంసలు అందుకున్నారు.

సదస్సు ప్రత్యక్ష కార్యక్రమాలకు అనుబంధంగా నిర్వహించిన ఆన్‌లైన్ (Online) జూమ్ సాహిత్య వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో పాల్గొన్నఏకైక హాంగ్ కాంగ్ వక్త మౌక్తిక మంగిపూడి తన స్వీయ రచన కథను సదస్సులో పఠనం చేసారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ రచయితలు, కవులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించడంతో పాటు, నూతన గ్రంథాలను ఆవిష్కరించారు. సాహిత్య చర్చలు, కవితా వేదికలు, పుస్తకావిష్కరణలు సదస్సుకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.

ఈ సందర్భంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (The Hong Kong Telugu Samakhya) ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో నిర్వహించే ఇటువంటి రెండు, మూడు రోజుల సాహిత్య సదస్సులు కొత్త రచయితలు, యువ సాహితీవేత్తలు, విద్యార్థులు (Students) మరియు భాషాభిమానులకు విశిష్టమైన అభ్యాస వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అనుభవజ్ఞులైన సాహిత్య ప్రముఖులతో ప్రత్యక్షంగా మమేకమవడం, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం, కొత్త ఆలోచనలను పంచుకోవడం, అంతర్జాతీయ (International) స్థాయిలో పరిచయాలు పెంపొందించుకోవడం వంటి అవకాశాలను ఈ సదస్సులు కల్పిస్తాయని వారు తెలిపారు.

తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే సంకల్పంతో నిర్వహించబడిన ఈ 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు తెలుగు జాతి సాంస్కృతిక వైభవానికి, ప్రపంచ తెలుగు ఐక్యతకు మరో మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు (Organizers) పేర్కొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected