కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని శాక్రమెంటో శివారు నగరమైన ఫాల్సమ్లో, శాక్రమెంటో తెలుగు సంఘం (Telugu Association of Greater Sacramento – TAGS) మరియు సువిధ ఇంటర్నేషనల్ (Suvidha International Foundation) సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు సాహిత్య వేదిక కార్యక్రమం ఆదివారం, సెప్టెంబర్ 27, 2026 సాయంత్రం 5 గం.కు వేడుకగా జరిగింది.
తెలుగు సాహిత్య (Telugu Literature) అభిమానులు, రచయితలు, స్థానిక తెలుగు ప్రముఖులు, యువత, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక సాహిత్యోత్సవంగా మార్చారు. తెలుగు సాంప్రదాయం, సాహిత్యం మరియు భాషపై లోతైన ప్రేమను ప్రతిబింబించేలా ఈ వేదికలో జరిగిన కార్యక్రమాలు అందరి మనసులను హత్తుకున్నాయి.
శాక్రమెంటో (Sacramento, California) తెలుగు సాహిత్య వేదిక కార్యక్రమం లో వెంకట్ నాగం రచించిన “రచ్చబండ చర్చలు” మరియు “కలగూర గంప” పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. వ్యాస సంపుటిగా వెలువడ్డ ఈ రెండు పుస్తకాలు – సమాజం, జీవన విలువలు, సాంస్కృతిక అంశాలు, అనుభవాలపై రచయిత వెంకట్ నాగం ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తాయని ముఖ్య అతిథిగా పాల్గొన్న సిరిమల్లె పత్రిక సంపాదకులు శ్రీ మధు బుడమగుంట అభిప్రాయపడ్డారు.
పుస్తక రచయిత వెంకట్ నాగం (Venkat Nagam) మాట్లాడుతూ తన రచనలకు స్ఫూర్తిగా నిలిచిన పలు తెలుగు దినపత్రికల సంపాదకీయం పేజీలు, అవి తనను ఎందుకు ఆకర్షించాయి, వ్యాస రచనకు కావాల్సిన ముఖ్య అంశాల ఎంపిక, పాఠకులతో అనుసంధానానికి అనివార్యమైన చక్కని ఉపోద్ఘాతం, నేపథ్యం, ప్రధాన వాదోపవాదనలు, లోతైన విశ్లేషణలు, సందర్భానుసారంగా చారిత్రాత్మక ఉదాహరణల ప్రస్తావన, విస్తృత ఆలోచనలు, చివరిగా వ్యాసానికి అనివార్యమైన సమగ్ర ముగింపు వంటి అంశాలను వెంకట్ నాగం సోదాహరణంగా వివరించారు.
వ్యాసంలో అవసరమైన చోట తెలుగు సామెతల పొందిక “పాఠకుడు-రచయిత-ఎంచుకున్న అంశం” అనుసంధానానికి ఎలా ఉపయోగపడుతుందో, వ్యాస పాఠకుడి నుండి – వ్యాస రచయితగా తాను పరిణామం చెందిన సందర్భం వెంకట్ నాగం వీక్షకులకు వివరించారు. సభికులతో రచయిత వెంకట్ నాగం (Venkat Nagam) కు జరిగిన చర్చలు వేదికను మరింత విలువైనదిగా మార్చాయి.
ఈ సందర్భంగా 2001 నుండి పలు తెలుగు పత్రికలలో ప్రచురితమైన వ్యాసాలను సంపుటిగా పుస్తకరూపంలో ప్రచురించమని, పలు అంతర్జాతీయ తెలుగు సదస్సులలో పరిశోధనా పత్రాల సమర్పణకు విలువైన సూచనలు చేసి ప్రోత్సహించిన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారికి, 2023 నుండి రచ్చబండ చర్చల వ్యాస ధారావాహికలను ప్రోత్సహించిన సిరిమల్లె సంపాదకులకు, ఈ రెండు వ్యాస సంపుటి పుస్తకాలను ప్రచురించిన వంగూరి ఫౌండేషన్ (Vanguri Foundation of America) అధినేత వంగూరి చిట్టెన్ రాజు గారికి, తన 25 ఏండ్ల సాహిత్య ప్రయాణానికి సహకరించిన సహధర్మచారిణి వాణి కి వెంకట్ నాగం సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా సిరిమల్లె అంతర్జాల పత్రిక శత సంచికలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ పత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు అయిన శ్రీమతి ఉమా మరియు శ్రీ మధు బుడమగుంట దంపతులకు శాక్రమెంటో తెలుగు సంఘం (Telugu Association of Greater Sacramento) మరియు సువిధ ఇంటర్నేషనల్ సంస్థ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు.
తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధికి సిరిమల్లె పత్రిక మాధ్యమంగా గత 11 ఏళ్ళుగా ఉమా – మధు గారు చేస్తున్న సేవలను శాక్రమెంటో తెలుగు సంఘం మరియు సువిధ ఇంటర్నేషనల్ సంస్థ (Suvidha International Foundation) నాయకులు ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిరిమల్లె పత్రిక శత సంచిక పోస్టర్ను శ్రీమతి ఉమా, శ్రీ మధు, నిర్వాహకులు ఆవిష్కరించారు.
అనంతరం శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక గత మూడు సంవత్సరాల “ఈ – వార్షిక పత్రికల పోస్టర్” ను శాక్రమెంటో (Sacramento) తెలుగు సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక సాహితీ అభిమానులు రచయిత వెంకట్ నాగం – వాణి దంపతులకు, మరియు ఉమా- మధు దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సాహిత్య వేదిక (Literature) కార్యక్రమం, ప్రవాస తెలుగు ప్రజలకు భాషతో అనుబంధాన్ని మరింత బలపరచడమే కాక, కొత్త రచయితలకు ప్రోత్సాహాన్ని అందించే వేదికగా నిలిచిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ మరిన్ని ఇటువంటి వేదికలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. స్థానిక గోంగూర గ్రూపు నుండి దివాకర్ – శ్రీదేవి సోమంచి, కృష్ణ కిషోర్, అబ్దుల్ షేక్ కమ్మని తెలుగు గీతాలను ఆలపించారు. కృష్ణ కిషోర్, శాంకరి తమ వ్యాఖ్యానంతో సభ ఆసాంతం వీక్షకులను ఆకట్టుకున్నారు.
శాక్రమెంటో తెలుగు సాహిత్య వేదిక కార్యక్రమం విజయవంతం కావడానికి శాక్రమెంటో తెలుగు సంఘం చైర్మన్ నాగ్ దొండపాటి, అధ్యక్షుడు శ్యాం ఏలేటి, ఉప అధ్యక్షురాలు శాంకరి చీదెళ్ళ, జాయింట్ సెక్రటరీ శ్రీదేవి ఆళ్ళ, సువిధ ఇంటర్నేషనల్ (Suvidha International Foundation) సంస్థ తరపున అధ్యక్షుడు భాస్కర్ వెంపటి (Bhaskar Vempati), సువిధ బోర్డు సభ్యులు బాలు, పద్మప్రియ, అవినాష్, ఇంకా పలువురు కార్యకర్తలు సహకరించారు.
ఫాల్సమ్లోని (Folsom, California) స్థానిక రుచి రెస్టారెంట్ ఈ సాహిత్య సమావేశానికి ఆతిథ్యమిచ్చి – వడ్డించిన పసందైన విందు భోజనంతో సమావేశం ముగిసింది. తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ వేడుక ఒక మరపురాని సాహిత్యానుభూతిని అందించిందని పలువురు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా తెలుగు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు శాక్రమెంటో తెలుగు సంఘం మరియు సువిధ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.