Aldie, Virginia: అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ఘనంగా చాటిచెప్పే లక్ష్యంతో క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (CATS) ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా, దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 1, 2026న వర్జీనియాలోని ఆల్డీలో ఉన్న జాన్ ఛాంప్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 1,500 మందికి పైగా తెలుగు ప్రజలు, కుటుంబ సభ్యులు, చిన్నారులు, యువత హాజరై పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి, అమెరికా దేశభక్తి, సంగీతం, నృత్యం, కళా ప్రదర్శనలు, కుటుంబ సమైక్యత కలగలిసిన ఈ వేడుకలు ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో చిన్నారులు, యువత, స్థానిక కళాకారులు ప్రదర్శించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, రంగురంగుల ఫ్యాషన్ షో ప్రేక్షకులకు కనువిందు చేశాయి.
ఈ వేడుకలకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు శ్రీ సుహాస్ సుబ్రహ్మణ్యం (Congressman Suhas Subramanyam), వర్జీనియా రాష్ట్ర సెనేటర్ శ్రీ కన్నన్ శ్రీనివాసన్ (VA State Senator Kannan Srinivasan), డెలిగేట్లు, కౌంటీ సూపెర్వైసోర్స్, కౌంటీ షెరీఫ్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సుహాస్ సుబ్రహ్మణ్యం గారితో తెలుగు సమాజానికి సంబంధించిన పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.
తెలుగు సమాజం అమెరికాలో అందిస్తున్న సేవలు, సామాజిక భాగస్వామ్యం, భవిష్యత్ అవకాశాల గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. 2026 సంవత్సరం అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సంవత్సరం (1776–2026) కావడంతో, అమెరికా సైన్యంలో సేవలందిస్తున్న మరియు సేవలందించిన భారతీయ మూలాలున్న సైనికులను ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించడం ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దేశ రక్షణ కోసం వారు అందిస్తున్న సేవలు, అంకితభావం, త్యాగాలను గుర్తిస్తూ CATS, వారి సేవలకు ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ఈ సందర్భంగా సైనికులు సార్జెంట్ ప్రసాదం శివ ప్రసాద్, మేజర్ శాంతన్ తూడి, స్పెషలిస్ట్ హారిక కొప్పుల, లెఫ్టినెంట్ కల్నల్ మధు కాశీపతి, లెఫ్టినెంట్ కల్నల్ కౌశిక్ వడ్డీ, మధు నడింపల్లి, స్టాఫ్ సార్జెంట్ వెంకటేష్ బాలిన లను కాట్స్ కార్య వర్గం గౌరవించి అభినందించింది.
వీరందరి భాగస్వామ్యం, వేడుకలకు ప్రత్యేక గౌరవాన్ని, దేశభక్తి స్ఫూర్తిని జోడించింది. భారతీయ మూలాలున్న వ్యక్తులు అమెరికా రక్షణ రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి గౌరవించడం ద్వారా CATS ఒక గొప్ప సామాజిక సందేశాన్ని అందించింది. ప్రముఖ గాయకులు, కళాకారుల ప్రదర్శనలతో పాటు REVERBZ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ అందించిన ప్రత్యేక సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
పాటలు, నృత్యాలు, సంగీతంతో వేడుకల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వెండర్ స్టాల్స్, ప్రామాణికమైన భారతీయ వంటకాలు, రాఫెల్ డ్రా, ఆకర్షణీయమైన బహుమతులు, ఫోటో బూత్‌లు సందర్శకులను విశేషంగా అలరించాయి.
ఉచిత ప్రవేశంతో పాటు విచ్చేసిన అతిథులందరికీ కాంప్లిమెంటరీ డిన్నర్ ఏర్పాటు చేయడం నిర్వాహకుల ఆతిథ్య భావనకు నిదర్శనంగా నిలిచింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేలా అన్ని ఏర్పాట్లు చేయడం వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ మహోత్సవం విజయవంతం కావడంలో కాట్స్ అధ్యక్షులు శ్రీ పార్థా బైరెడ్డి (Partha Byreddy) కీలక పాత్ర పోషించారు.
ఆయన నాయకత్వంలో కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో కృషి చేసి ఈ భారీ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థా బైరెడ్డి మాట్లాడుతూ, కాట్స్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక, సేవా కార్యక్రమాలతో పాటు యువతకు, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఉపయోగపడే వినూత్న కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా తెలుగు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల మధ్య పరిచయాలు, పరస్పర సహకారం, వ్యాపార అవకాశాలను పెంపొందించేలా బిజినెస్ నెట్‌వర్కింగ్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. CATS వ్యవస్థాపకులు శ్రీ రామ్ మోహన్ కొండ సంస్థ స్థాపనకు బలమైన పునాది వేసి, తెలుగు సమాజ ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు మార్గం సుగమం చేశారు.
సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి భారీ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ తెలుగు సమాజ అభ్యున్నతికి, భావితరాలకు తెలుగు సంస్కృతిని పరిచయం చేయడానికి కాట్స్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
పాస్ట్ ప్రెసిడెంట్ గోపాల్ నున్న మరియు వైస్ ప్రెసిడెంట్ రమణ మద్దికుంట సమన్వయంతో కార్యక్రమం ఆద్యంతం సజావుగా కొనసాగింది. కల్చరల్ సెక్రటరీ శిరీష కొల్ల, ట్రెజరర్ లక్ష్మీకాంత్ గొట్టం, చారిటీస్ & కమ్యూనిటీ అఫైర్స్ ఇన్‌చార్జ్ మహేష్ అనంతోజ్, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ కిషోర్, జాయింట్ సెక్రటరీ విశాల్ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ సమిష్టిగా కృషి చేస్తూ, వాలంటీర్ల సహకారంతో కార్యక్రమంలోని వివిధ విభాగాలను సమర్థవంతంగా నిర్వహించారు. స్పాన్సర్లు, కళాకారులు, చిన్నారులు, వెండర్లు, వాలంటీర్లు అందించిన సహకారం ఈ వేడుకల విజయానికి ఎంతో దోహదపడింది.
కాట్స్ ట్రస్టీలు మరియు సంస్థ సలహాదారులు తమ విలువైన సూచనలు, అనుభవం, మార్గదర్శకత్వంతో కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు. వ్యవస్థాపకులు, ట్రస్టీలు, సలహాదారులు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సహకారులు, వాలంటీర్ల సమిష్టి కృషి సంస్థ బలోపేతానికి, ఇటువంటి భారీ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణకు దోహదపడింది.
ఈ వేడుకల్లో భాగంగా తెలుగు సమాజంతో పాటు ఇతర తెలుగు సంఘాలు, కమ్యూనిటీ సంస్థలకు చెందిన ప్రముఖులను కూడా కాట్స్ ప్రత్యేకంగా సత్కరించింది. ముఖ్యంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA), తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ప్రతినిధులు, ఇతర కమ్యూనిటీ ప్రముఖులను ఆహ్వానించి, వారి సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు.
వివిధ తెలుగు సంఘాల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం, సహకారాన్ని చాటిచెప్పేలా ఈ సత్కార కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలు, కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు. వేడుకలను చక్కగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.