London, Croydon: లండన్ లోని క్రొయ్దన్ ప్రాంతంలో క్రొయ్దన్ తెలుగు అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. రిడ్డ్లెస్‌డౌన్ కాలేజియేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో హాజరైనారు. తెలుగు సంప్రదాయానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచారు.
బతుకమ్మ వైభవం
పట్టుచీరలు, వోణీలు ధరించిన మహిళలు, యువతులు వేడుకలకు (Celebrations) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూలతో అలంకరించిన వందల రంగురంగుల బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి.
గౌరీదేవికి, ప్రకృతి మాతకు సమర్పణగా అందంగా పేర్చిన బతుకమ్మల (Bathukamma) చుట్టూ మహిళలు తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి, నృత్యాలు చేశారు. సమిష్టిగా మోగిన చప్పట్లు, పాటలు, నృత్య అడుగులతో వేదిక మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. తర్వాత అందరికీ పసందైన తెలుగు వంటకాలతో భోజన ఏర్పాట్లు జరిగాయి.
నిర్వాహకుల కృషి
2026 CTA కమిటీ సభ్యులు సాయి ప్రకాష్, వెంకట్, ప్రవీణ్, మట్టారెడ్డి, చిరంజీవి, శాంతి, అలాగే అనేక మంది వాలంటీర్ల (Volunteers) అంకితభావం మరియు సహకారంతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
స్పాన్సర్ల సహకారం
ఈ కార్యక్రమానికి KP గ్రూప్స్, మాక్స్ వెల్త్ ఫైనాన్షియల్, అన్నపూర్ణ రైస్, సుక్రోజ్ కన్స్ట్రక్షన్, ఆభరణ సిల్క్స్, క్రిస్పీ దోస, గ్రీన్ ఆపిల్, వ్రిష్కర్ బ్లైండ్స్‌తో పాటు ఇతర సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా (Sponsors) సహకరించాయి.
విదేశాల్లో తెలుగు సంస్కృతిని (Culture) తరతరాలకు అందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకలు, ప్రవాస తెలుగు సమాజంలో భక్తి, ఆనందం మరియు సామాజిక సమైక్యతకు స్ఫూర్తిదాయక గా నిలిచాయి.