Connect with us

Literary

జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు

Published

on

తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రోత్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారకంగా గత ఐదు సంవత్సరాల నుంచి, ప్రతి ఏడాదీ నవలారచనలో పోటీలను నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. “మారుతున్న విలువలు-చదువులు-తల్లిదండ్రుల బాధ్యత-యువత” నేపథ్యంలో నవలలను ఆహ్వానించాం.

పోటీకి ప్రత్యేకంగా అంశాన్నిచ్చినప్పుడు నవలలు కొత్తగా రాయాల్సి వస్తుంది. పాత వాటిని తిరగరాసి పంపడం కుదరదు. అయినాసరే రచయితలు ఎంతో ఉత్సాహంగా స్పందించారు. ఊహించినదానికంటే రెట్టింపు నవలలు వచ్చాయి. రాశిలోనే కాకుండా వాసిలో కూడా తీసిపోని నవలలు రావడం తెలుగు నవలా రచయితలలోని నిత్యనూతన చైతన్యాన్ని సూచిస్తోంది.

మొదటి వడపోతలో 24, రెండవ వడపోతలో 6, మూడవ వడపోతలో 4 నవలలు నిలబడ్డాయి. అయిదురుగు గుణనిర్ణేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆరవ సాహిత్యకారుడి అభిప్రాయాన్ని తీసుకోవలసి వచ్చింది. వారు కూడా ఉత్తమత్వాన్ని నిర్ణయించేప్పుడు రెండు విశిష్ట నవలలు, రెండు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. మిగిలిన గుణనిర్ణేతలు కూడా మరోసారి చర్చించుకున్న తరువాతే ఫలితాల ప్రకటన వెలువరిస్తున్నాము. ఉత్తమత్వాన్ని నిర్ధారించడ్డానికి కొత్త గీటురాళ్ళు కావలసిన పరిస్థితి ఏర్పడటం తెలుగు నవలకి మంచి భవిష్యత్తు ఉందనడానికి గొప్ప సూచన.

విశిష్ట నవలలు
“శిలలు శిల్పాలు” “హంపికి చేరిన ఉత్తరం“
మీనాక్షి శ్రీనివాస్ డా. బి. నాగశేషు బహుమతి మొత్తం: రూ. 20,000 బహుమతి మొత్తం: రూ. 20,000
ప్రత్యేక బహుమతులు
“విలువల వంతెన” “శ్రమయేవ జయతే“
శర్మ దంతుర్తి డా. శ్రీదేవీ శ్రీకాంత్ బహుమతి మొత్తం: రూ. 10,000 బహుమతి మొత్తం: రూ. 10,000

పై నాలుగు నవలలూ నాలుగు భిన్నమైన పార్శ్వాలను స్పర్శించాయి:
• కమర్షియల్ నవలల తరహాలో ఎక్కడా పట్టు సడలకుండా ఇచ్చిన ఇతివృత్తానికి న్యాయం చేసిన నవల – ‘శిలలు శిల్పాలు’
• ప్రాంతీయతకి ప్రాధాన్యతనిచ్చిన అద్భుత నవలాశిల్పం – ‘హంపికి చేరిన ఉత్తరం’
• విద్యావ్యవస్థలోని అలసత్వం కారణంగా ఏర్పడిన దారుణాలన్నింటినీ కళ్ళకి కట్టే నవల
– ‘విలువల వంతెన’
• సున్నతో మొదలై అనంతానికి సాగే జీవన యానాన్ని దృశ్యమానం చేసిన నవల -‘శ్రమయేవ జయతే’

వైవిధ్యానికి పెద్దపీట వేసే ఈ నాలుగునవలలూ సిరికోన సాహితీ అకాడెమీకి గర్వకారణంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయితలు నలుగురికీ, సిరికోనీయులందరి పక్షాన మనఃపూర్వక అభినందనలు. వారి కృషి తెలుగు సాహిత్య రంగంలో మరింత సమున్నత గౌరవ, ప్రతిష్టలను సముపార్జించుకొంటుందని మనసారా విశ్వసిస్తూ, శుభాకాంక్షలు అందిస్తున్నాము.

గమనిక: ఈ నాలుగు నవలలూ సిరికోనలో ధారావాహికంగా ప్రచురించబడతాయి. పురస్కారాల ప్రదానం జూలై/ ఆగస్టు (2026) లో జరుగుతుంది. త్వరలో తేదీ మరియు మిగతా వివరాలు ప్రకటించగలము.

– జొన్నగడ్డ సుబ్రహ్మణ్యం (సిరికోన సాహితీ అకాడెమీ ఎడ్మిన్)

error: NRI2NRI.COM copyright content is protected