Connect with us

Literary

నాన్న అంటే నస కాదు.. నడక, నడవడిక నేర్పిన దైవం – మధ్యతరగతి నాన్న: Shyam Koppu

Published

on

చూపుల్లో ఆకాశం అంత పెద్ద కలలు..
చేతుల్లో మాత్రం నెల జీతం పరిమితులు..
అయినా ఆ పరిమితుల మధ్యే
అపరిమితమైన ప్రేమను పంచే వాడు.
.

ఉదయం అలారం మోగకముందే లేచి,
గడియారం కన్న ఎక్కువ బాధ్యతలతో పరుగులు పెడతాడు..
తన అలసటను కప్పి ఉంచి,
మన భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు పదును పెడతాడు..

తనకు కొత్త షర్ట్ కొనుక్కోవడం ఇంకో పండుగకి వాయిదా వేసి,
మనకు ప్రతి పండుగకి కొత్త బట్టలు తెస్తాడు..
తన చిన్న కోరికలు మూలన పెట్టి,
మన చిన్న ఆనందాలను పెద్ద పండుగలా చేస్తాడు..

మనం తప్పులు చేసినప్పుడు మందలిస్తాడు,
కానీ మన మీద ప్రేమ తగ్గదు..
మన విజయం చూసినప్పుడు ఆనందిస్తాడు,
మన మీద నమ్మకమూ తగ్గదు..

“డబ్బు విలువ తెలుసుకో” అని చెప్పేది
కఠినంగా అనిపించినా,
ఆ మాటల వెనుక దాగి ఉన్నది
మన భవిష్యత్తు కోసం అతని భయం.

వయసు పెరుగుతున్నా బాధ్యతలు తగ్గవు,
తన కలలు మాత్రం నిశ్శబ్దంగా మాయమవుతాయి..
కానీ మన కలలు నెరవేరినప్పుడు
అతని హృదయం అనందంతో నిండిపోతుంది.

తన జీవితాన్ని త్యాగంగా మార్చుకుని,
మన జీవితాన్ని విజయంగా మలిచే
నిశ్శబ్ద యోధుడు..

నాన్న అంటే నస కాదు.. నడక, నడవడిక నేర్పిన, నడిపించే దైవం!

– Shyam Koppu

error: NRI2NRI.COM copyright content is protected