ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్ మరియు ప్రముఖ వైద్య నిపుణుడు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (Dr. Nagendra Srinivas Kodali) ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన మరియు సాహసోపేతమైన మారథాన్ లలో ఒకటైన టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ (Tenzing Hillary Everest Marathon) ను విజయవంతంగా పూర్తి చేసి మరో అరుదైన ఘనతను సాధించారు.
ప్రతి సంవత్సరం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రాంతంలో నిర్వహించే ఈ మారథాన్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో జరిగే మారథాన్ (Marathon) గా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ప్రారంభమయ్యే ఈ రేసులో తక్కువ ఆక్సిజన్, కఠినమైన వాతావరణ పరిస్థితులు, మంచుతో కూడిన మార్గాలు, ఎత్తుపల్లాలు వంటి ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.
ఈ పోటీని పూర్తి చేయడం అసాధారణమైన శారీరక మరియు మానసిక సామర్థ్యానికి నిదర్శనం. పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన తానా విశ్వ గురుకులం అనే ప్రత్యేక బోధనా పద్ధతిని ప్రపంచానికి మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికా (North America) లోని తెలుగు వారికీ పరచియం చెయ్యటం లో భాగంగా ఈ సాహస యాత్ర సాగించారు.
తానా విశ్వ గురుకుల బోధనా వ్యాప్తికి, తానా సిద్ధాంతాలు, వ్యవస్థాపక లక్ష్యాలను మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి ఎంతో క్లిష్టమైన ఈ యాత్రలకి డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన ప్రపంచంలోని ఏడు అత్యున్నత శిఖరాల్లో మూడు అయిన కార్స్టెన్స్ పిరమిడ్ (Indonesia), మౌంట్ ఎల్బ్రస్ (Russia) మరియు మౌంట్ కిలిమంజారో (Tanzania) లను విజయవంతంగా అధిరోహించారు.
సాహసం, సేవా భావం, నాయకత్వం కలగలిసిన డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (Dr. Nagendra Srinivas Kodali)సాధించిన ఈ విజయంపై తానా (TANA) సభ్యులు, తెలుగు సమాజ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వారసత్వాన్ని ప్రపంచ వేదికపై మరింతగా నిలబెట్టే దిశగా ఆయన చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
తానా చేసే సేవా కార్యక్రమాలని ప్రోత్సహించడంతో పాటు 2027లో డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali) అధ్యక్షతన జరిగే తానా స్వర్ణోత్సవాలని విజయవంతం చెయ్యాలని, వాటికీ అందరి సహాయ సహకారాలు అందించాలని తానా (TANA) బోర్డు చైర్మన్ డా నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి విజ్ఞప్తి చేసారు.