మేరీల్యాండ్ (Maryland) లోని గైథర్స్‌బర్గ్‌లో క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (Capitol Area Telugu Society – CATS) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది మహోత్సవం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది.
ఏప్రిల్ 18న జరిగిన ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సోయగాన్ని ప్రతిబింబిస్తూ విశేష స్పందనను పొందాయి. క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (Capitol Area Telugu Society – CATS) సంస్థ అధ్యక్షుడు పార్థ బైరెడ్డి (Partha Byreddy) నాయకత్వంలో నిర్వహించిన ఈ మహోత్సవం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (Capitol Area Telugu Society – CATS) సంస్థను మరింత విస్తరించడంలో భాగంగా సాంస్కృతిక, సేవా కార్యక్రమాలతో పాటు యువతకు, వ్యాపార రంగానికి ఉపయోగపడే కొత్త కార్యక్రమాలను, ముఖ్యంగా బిజినెస్‌కు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
CATS వైస్ ప్రెసిడెంట్ రమణ సమన్వయంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. జనరల్ సెక్రటరీ రంగ స్వామి రెడ్డి సూరా, కల్చరల్ సెక్రటరీ శిరీషా కొల్ల, ట్రెజరర్ లక్ష్మీకాంత్ గొట్టం, చారిటీస్ & కమ్యూనిటీ అఫైర్స్ ఇన్‌చార్జ్ మహేష్ అనంతోజ్ తదితర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి కార్యక్రమ విజయానికి దోహదపడ్డారు.
CATS ట్రస్టీలు బొమ్మా రెడ్డి, రామ ఎరుబండి, సుధర్శన్ దేవిరెడ్డి తమ అనుభవంతో మార్గదర్శకత్వం అందించగా, వ్యవస్థాపకుడు రామ్ మోహన్ కొండ సంస్థ అభివృద్ధిని కొనియాడారు. సలహాదారుల మార్గనిర్దేశం కూడా కార్యక్రమానికి బలంగా నిలిచింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్ (Aruna Miller) అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా, ఆమె పంపిన శుభాకాంక్షల సందేశం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే CATS సంస్థకు గౌరవంగా ఆమె అందించిన అధికారిక సైటేషన్‌ను CATS నిర్వాహకులు కృతజ్ఞతాభివందనాలతో స్వీకరించారు.
సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ (RP Patnaik) సంగీత ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా, గాయని అఖిల మామండూర్, గాయకుడు శ్రీకాంత్ లంక (Srikanth Lanka) తమ గాత్రంతో సభను ఉత్సాహభరితంగా మార్చారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ముఖ్యంగా అగ్ని డాన్స్ స్కూల్ వారి డ్రమాటిక్ డాన్స్ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మానవతా సేవలో విశిష్ట సేవలందిస్తున్న మోహన్ నన్నపనేని (Mohan Nannapaneni), సామ్ వొనుము లను ప్రత్యేకంగా సత్కరించడంతో పాటు, సంస్థ గత అధ్యక్షులను ఘనంగా సన్మానించారు.
పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వంటి సంప్రదాయ అంశాలు వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చగా, రుచికరమైన విందు హాజరైన వారిని ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలు (Telugu People) ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మొత్తం CATS టీమ్ కృషికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. విదేశీ నేలపై తెలుగు సంస్కృతిని ఇంత ఘనంగా నిలబెట్టిన ఈ మహోత్సవం పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు.