అరిజోనా, పియోరియా: తెలుగు భాష, సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో సిలికానాంధ్రమనబడి ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండుగ అరిజోనా రాష్ట్రంలోని పియోరియా (Peoria, Arizona) లో వైభవంగా జరిగింది.
సియెర్రా వెర్డే స్కూల్ ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 350 మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం దీపప్రజ్వలనతో ఆరంభమై, వినాయకునికి ప్రార్థనలు, తెలుగు (Telugu) భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
అనంతరం అరిజోనా (Arizona) మనబడి సమన్వయకర్త శ్రీ బాలాజీ గారి తండ్రి మరణం నేపథ్యంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సభికులు రెండు నిమిషాలపాటు మౌనంగా నివాళులు అర్పించారు. తరువాత బాలబడి నుంచి ప్రభాసం వరకు వివిధ స్థాయిల్లో ఉన్న విద్యార్థులు తమ ప్రతిభను ఆవిష్కరించారు.
చిన్నారులు ప్రదర్శించిన తెలుగు (Telugu) నాటికలు, సాంప్రదాయ కూచిపూడి నృత్యాలు, పద్యపఠనం, గేయాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలకు పిల్లలు అందించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ పిల్లల శ్రమతో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం స్పష్టంగా కనిపించింది.
పియోరియా (Peoria, Arizona) ప్రాంతీయ సమన్వయకర్త శ్రీనివాస్ డోకి (Srinivas Doki) మాట్లాడుతూ, ఫీనిక్స్లో మనబడి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి గురించి వివరించారు. తెలుగు భాషాభ్యాసం పిల్లల్లో సంస్కార విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
రాబోయే కాలంలో మరింత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు (Teachers), బాలగురువులు, తల్లిదండ్రులు, వాలంటీర్లకు (Volunteers) ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయానికి శ్రీనివాస్ డోకి, దీపక్ పైడిమర్రి, వంశీ కృష్ణ ఇరువారం (Vamsi Krishna Reddy Eruvaram), పద్మజ, లత, మల్లికార్జున్ ఇరగం, దివ్య, నీలిమ, శిరీష , రుష్మ తదితరులు సమిష్టిగా కృషి చేశారు. అలాగే బాలగురువులు శిశిర్, అన్విత , షమిత , అదితి, కార్తీక, అనూహ్య, ఆర్యన్, అంజన, ఆకాశ్, యశస్వి తదితరులు కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.
వీడియో చిత్రీకరణను అరుణ్ సమర్థవంతంగా నిర్వహించగా, కేన్యాన్ పార్టీ ప్లానెర్స్ చేసిన అలంకరణలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సిద్ధం చేసిన విందు సభికులందరినీ ఆకట్టుకుంది. సమూహంగా నిర్వహించిన భోజన విందు కార్యక్రమానికి మరింత ఆత్మీయతను జోడించింది.
సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమం తెలుగు సంస్కృతి (Telugu Culture), సంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచింది. తమ పిల్లలు తెలుగు భాష (Telugu Language) లో ప్రదర్శనలు ఇస్తుండటాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది నిర్వహించే మనబడి (Manabadi) పిల్లల పండుగ ఈసారి కూడా విజయవంతంగా నిర్వహించబడింది. విదేశీ నేలపై తెలుగు భాషను పరిరక్షిస్తూ, కొత్త తరాలకు సంస్కృతిని చేరవేయడంలో మనబడి చేస్తున్న సేవ ప్రశంసనీయం అని పలువురు అభిప్రాయపడ్డారు.