Maryland, July 4, 2026: తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తెలుగు పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా ఉచిత ఆన్లైన్ ఆర్ట్ వర్క్ నిర్వహించింది. ‘నాట్స్’ మేరీల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉచిత ఆన్లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
చెన్నై (Chennai, Tamilnadu) కి చెందిన ప్రముఖ చిత్రకారుడు గోపీకృష్ణ మూర్తి ఈ వర్క్‌షాప్‌లో చిత్రకళపై శిక్షణ ఇచ్చారు. కళారంగంలో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, అనేక పురస్కారాలు అందుకున్న గోపీకృష్ణ, పెన్సిల్ డ్రాయింగ్‌లోని మెళకువలను ఎంతో సులభంగా, దశలవారీగా వివరించారు. ఆయన బోధనా శైలి పట్ల ఈ శిక్షణలో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కళాభిమానులు ఈ వర్క్‌షాప్ (Art Workshop) లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా 5 నుండి 13 సంవత్సరాల వయస్సు గల సుమారు 30 మంది చిన్నారులు పెన్సిల్ డ్రాయింగ్‌లో ప్రాథమికాంశాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు.
పిల్లలతోపాటు పెద్దలు కూడా ఎంతో ఆసక్తిగా డ్రాయింగ్స్ వేసి, తాము గీసిన చిత్రాలను చూసి మురిసిపోయారు. ఈ తరగతులు వేసవి సెలవులను (Summer Holidays) సద్వినియోగం చేసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కూడా కళాత్మక విద్యను కొనసాగించాలనే స్ఫూర్తిని నింపాయి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ (NATS Maryland Chapter) సభ్యులు వాకుల్ మోరే, విశ్వ మార్ని, హారిణి నర్ల , సువర్ణ కీలక పాత్ర పోషించారు. కుటుంబాలకు ఉపయోగకరమైన, విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను అందించడంలో తమ వంతు కృషి చేస్తూ, పిల్లల్లోని దాగి ఉన్న సృజనాత్మకతకు ఈ వర్క్‌షాప్ (Workshop) వేదికగా నిలిచింది.
ఈ ఆన్లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ (Online Art Workshop) నిర్వహణ ద్వారా చిత్ర కళా శిక్షణను తెలుగువారికి అందించడంలో కృషి చేసిన నాట్స్ మేరీ ల్యాండ్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ (Raj Allada) ప్రత్యేకంగా అభినందించారు.