- ప్రపంచంలోని తెలుగు దనాన్ని ఒక వేదిక పైకి తీసుకొచ్చిన GWTCS
- అలరించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు
- ఆకట్టుకున్న నృత్యాలు, వివిధ సంగీత పాఠశాలలలకు చెందిన చిన్నారుల నాట్య ప్రదర్శనలు
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారధ్యంలో సంగీత సాహిత్య హాస్యం (MLC) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎన్నటికీ మరచిపోమని GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ప్రవాస తెలుగువారికి వినోదం, విజ్ఞానం, సాంస్కృతిక వారసత్వం అందించే లక్ష్యంతో మా సంస్థ పనిచేస్తుంది.
మన తరువాత తరం ఏదీ కొల్పోకూడదో.. దాని కోల్పోకుండా చూడాల్సిన భాద్యత ఈ తరంపై ఉంది. పాత జ్ఞాపకాలు మరచిపోయినా, వాటిని చెరిపివేసినా, భావి తరాలు మనల్ని క్షమించవు. అందుకే ఈ తరానికి వాటిని అందించటానికి సాంప్రదాయ బద్ధంగా వీటన్నింటినీ రూపకల్పన చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో భాగస్వాములయిన ప్రతిఒక్కరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ (Songa Roshan Kumar), మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) తదితరులు ప్రసంగించారు.
“తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ ఉట్టిపడేలాగా వివిధ రూపాలలో కళలు, సాహిత్యం, సంస్కృతీ, ఆధ్యాత్మికతను జోడించి అనేక రూపాలలో GWTCS వారు కార్యక్రమాలు రూపొందించారు. ప్రపంచంలోని తెలుగు దనాన్ని ఒక వేదిక పైకి తీసుకొచ్చి తెలుగు భాషకు, తెలుగు జాతికీ గుర్తింపు తెచ్చారు.
52 సంవత్సరాల Greater Washington Telugu Cultural Sangam (GWTCS) ప్రస్థానంలో భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడుతూ, విశిష్టమైన పండుగలు, ఇతర వేడుకలు క్రమం తప్పకుండా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు” అని వారు తెలిపారు.
సాయికాంత రూపొందించిన నృత్యాలు, వివిధ సంగీత పాఠశాలలలకు చెందిన చిన్నారుల నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చక్కటి సంగీత, సాహిత్య, హాస్యాన్ని మేళవించి వినోదాన్ని అందించిన ప్రముఖ సినీ గేయ రచయితా అనంత శ్రీరామ్ (Anantha Sriram) బృందాన్ని ఘనంగా సత్కరించారు.
రక రకాల వేష ధారణతో.. చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ (Ugadi Festival) ఘన సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందు బోజనాలను అందించారు.
పూర్వ అధ్యక్షులు త్రిలోక్ కంతేటి, మన్నే సత్యనారాయణ (Satyanarayana Manne), సుధ పాలడుగు, కృష్ణ లాం (Krishna Lam), సంస్థ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నే, రాజేష్ కాసరనేని, భానుప్రకాష్ మాగులూరి, శ్రీనివాస్ గంగ, విజయ్ అట్లూరి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, పద్మజ బేవర, శ్రీవిద్య సోమ, పావని తదితరులు.. సభికులకు ధన్యవాదములు తెలిపి.. బాషా, సంస్కృతీ ని కాపాడుకోవటం, కళను ప్రోత్సహించటం, కళాకారులను సత్కరించటం తెలుగింటి సంప్రదాయమని తెలిపారు.