Connect with us

Service Activities

రెడ్డి రాజుల రాజధాని అద్దంకిలో శ్రీనివాస్ కూకట్ల వైభవంగా చైతన్య స్రవంతి నిర్వహణ

Published

on

మహాకవి ఎర్రన నడిగాడిన నేల, కళలకు కాణాచి, పద్యం పుట్టిన గడ్డ, రెడ్డి రాజుల రాజధాని, పవిత్ర గుండ్లకమ్మ నదీ తీరాన వెలసిన చారిత్రాత్మకమైన అద్దంకి పట్టణంలో ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కూకట్ల (Srinivas Kukatla) ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 23 నుండి 27వ తేదీ వరకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) చైతన్య స్రవంతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

తెలుగువారు గర్వపడేలా నిర్వహిస్తున్న తానా చైతన్య స్రవంతిలో భాగంగా అద్దంకిలో “తానా”, “కూకట్ల ఫౌండేషన్”, ‘తానా ఫౌండేషన్” మరియు పలువురు దాతల సహకారంతో ఐదు రోజులు పాటు వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు, రైతు సేవా కార్యక్రమాలు, వికలాంగులకు ట్రీ సైకిళ్ల పంపిణీ, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ, లాప్టాప్ ల బహుకరణ, పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

డిసెంబర్ 25వ తేదీన తానా కోఆర్డినేటర్ శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జనార్ధన్ నిమ్మలపూడి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంత్ర, తానా టెంపుల్ కోఆర్డినేటర్ జగదీశ్వరరావు పెద్దబోయిన, అపలాచియన్‌ రీజియన్‌ సమన్వయకర్త నాగ పంచుమర్తి, తాన స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో ప్రజానీకం హాజరు కావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్న తానా టీం:- ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని డిసెంబర్ 25వ తేదీన తాన అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ కూకట్ల, బోర్డు మెంబర్ జనార్ధన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ చైర్మన్ కోటా శ్రీనివాస్ కుమార్ మేళతాళాలు వేద పండితుల మంత్రాచారాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వీరికి స్వామివారి ప్రసాదములు వేద ఆశీర్వచనాలు స్వామి వారి చిత్రపటాలను చైర్మన్ కోటా శ్రీనివాస్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కోరిక మేరకు దేవస్థానానికి 120 కే.వి జనరేటర్ ను తానా ఫౌండేషన్ కూకట్ల ఫౌండేషన్ తరపున ఇచ్చేందుకు అంజయ్య చౌదరి, శ్రీనివాస్ ఇరువురు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు మాట్లాడుతూ కుకట్ల ఫౌండేషన్ ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్న శ్రీనివాస్ కూకట్ల అద్దంకి ప్రాంత శ్రీమంతుడని ఇలాంటి వ్యక్తి అద్దంకిలో ఉండటం ఈ ప్రాంత వాసులకు గర్వకారణమన్నారు. తానా డైరెక్టర్ జనార్ధన్ నిమ్మలపూడి మాట్లాడుతూ కుకట్ల సోదరులు శ్రీనివాస్, వెంకటకృష్ణ, హరీష్ చౌదరి ల సేవా దృక్పథాన్ని కొనియాడారు. అద్దంకి ప్రాంత ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు కూకట్ల శ్రీనివాస్ చేసిన పలు సేవలను అభినందించారు. శ్రీనివాస్ కూకట్ల మాట్లాడుతూ కన్నతల్లికి, పుట్టిన గ్రామానికి సేవ చేయడం కన్నా మంచి కార్యక్రమం మరేది లేదని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన తన తల్లిదండ్రులు సుబ్బారావు, విద్యావళిలను ఆయన సత్కరించారు.

Srinivas Kukatla

ప్రజల్లో అవగాహన కల్పించిన క్యాన్సర్ అవేర్నెస్ వాక్:- క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవటం మూలంగా వ్యాధి ముదిరి చివరి దశలో గుర్తించటం వ్యాధి నయం కాక మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించి క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేందుకు కూకట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో “క్యాన్సర్ అవేర్నెస్ వాక్” కార్యక్రమం జరిగింది. అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు పలు స్వచ్ఛంద సంస్థలు, సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థలు, పలు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీనివాస్ కూకట్ల నిర్వహించిన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకొని ఆలోచింపజేసింది.

అద్దంకి ప్రాంతంలో అధిక శాతం ప్రజలు కాయకష్టం చేసుకుని జీవించే శ్రామికులే. ఈ పేద ప్రజల జబ్బును పడితే నయం చేసుకోలేక అప్పుల పాలవుతున్నారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి . ఇప్పుడు వారి దయనీయ బతుకుల్లో కూకట్ల ఫౌండేషన్ కొత్త కాంతులు నింపుతున్నది. వివిధ రకాల వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా కుల, మత, వర్గ రహితంగా పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యులు పేదలకు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇస్తున్నారు. ఈ సామాజిక ఆరోగ్య చైతన్యం వెనుక ఉన్నది ఒకే ఒక్కడు శ్రీనివాస్ కూకట్ల. డిసెంబర్ 25వ తేదీన అద్దంకిలోని కుకట్ల కన్వెన్షన్ హాల్లో క్యాన్సర్, కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. కూకట్ల ఫౌండేషన్, Grace Cancer Foundation ఆధ్వర్యంలో వైద్యులు 115 మందికి క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించి హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక బస్సులో అవసరమైన వారికి ఉచితంగా క్యాన్సర్ గుర్తింపు ఎక్సరేలను తీశారు.

అదేవిధంగా కంటి శుక్లాలు వివిధ రకాల కంటి జబ్బులు ఉన్నవారికి ఒంగోలు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 60 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోడులను పంపిణీ చేశారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కూకట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు జరిగాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి 15 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా కరువది జట్టు విజేతగా నిలిచింది.

రైతు కోసం తానా, కూకట్ల ఫౌండేషన్:- వ్యవసాయ కుటుంబం నుండి ఉన్నత స్థానానికి వచ్చిన శ్రీనివాస్ కూకట్ల రైతుల శ్రేయస్సు కోసం, వారి రక్షణ కోసం దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అద్దంకిక చెందిన ఎన్ఆర్ఐ చట్టబత్తిన కృష్ణ కిషోర్ డొనేట్ చేసిన 25 పవర్ స్పేయర్లను రైతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా కూకట్ల ఫౌండేషన్, సురేష్ జాగర్లమూడి డొనేట్ చేసిన 170 రైతు రక్షణ కిట్లను సభలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో రైతుల పాల్గొన్నారు.

వికలాంగులకు ట్రీ సైకిల్స్, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ:- తాన ఫౌండేషన్, కూకట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు వందమంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే 10 ట్రేస్ సైకిల్స్ రెండు బ్యాటరీతో నడిచే సైకిల్స్ వికలాంగులకు శ్రీనివాస్, అంజయ్య చౌదరి పంపిణీ చేశారు.

విద్య , పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు: -ప్రతిభ కలిగి ఉండి పేదరికం కారణంగా విద్య మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో కూకట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ కూకట్ల సుమారు లక్ష రూపాయలను విద్యార్థులకు స్కాలర్షిప్ల రూపంలో పంపిణీ చేశారు.

తండ్రి బాటలో తనయ నేహా:- తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటే దేశం బాగుంటుందని నమ్మి, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పాటు అందించే వ్యక్తి శ్రీనివాస్ కూకట్ల. వారి బాటలోనే వారి కుమార్తె నేహా కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తూ చిన్నవయసులోనే పలువురికి ఆదర్శంగా నిలిచింది. నేహా గత సంవత్సరం తన జన్మదినాన్ని అందరిలా స్నేహితులు, బంధువులు మధ్య కాకుండా అద్దంకిలోని బదిరుల ఆశ్రమ పాఠశాలలో చెమిటి, మూగ విద్యార్థుల మధ్య జరుపుకొని ఆ రాత్రి అక్కడే ఉండి తానే అక్కడ విద్యార్థులు అందరికీ స్వయంగా చేతులకు మెహేంది పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా తాను స్వయంగా విరాళాలు సేకరించి మేదరమెట్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో తానా ఫౌండేషన్ వారి సహకారంతో 1000 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్లను నిర్మించి ఇటీవల ప్రారంభోత్సవం కూడా చేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు:- కార్యక్రమాల ముగింపు సందర్భంగా కూకట్ల కన్వెన్షన్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్థానిక బెల్ అండ్ బెన్నెట్ పాఠశాల విద్యార్థులతో పాటుగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు పేరెన్నిక గల కళా బృందాలు, విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫోక్ ఆర్కెస్ట్రా ప్రేక్షకులను కనువిందు చేశాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected