East Windsor, New Jersey: సామాజిక బాధ్యతను తెలుగు విద్యార్ధుల్లో పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్థానిక ఈస్ట్ విండ్సర్ నగరంలో చేపట్టిన హైవే దత్తత సామాజిక స్పృహను చాటిచెప్పింది.
పర్యావరణ పరిరక్షణను ఒక యజ్ఞంలా భావించి గతంలో పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందించిన నాట్స్ (North America Telugu Society – NATS), అదే స్ఫూర్తితో ఈసారి న్యూజెర్సీలో ఈస్ట్ విండ్సర్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది.
ఈ పారిశుధ్య కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. సమాజం పట్ల బాధ్యతను చిన్నతనం నుంచే అలవరుచుకోవాలనే సంకల్పంతో, రహదారి పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించి తమ వంతు తోడ్పాటును అందించారు.
సమాజ హితం కోసం పిల్లలు చూపిన ఈ చొరవ పెద్దలను సైతం ఆలోచింపజేసింది. విద్యార్థులు చిన్ననాడే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల వారిలో క్రమశిక్షణ, సామాజిక స్పృహ పెరుగుతాయని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) అన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, ఇలాంటి పనులు విద్యార్థుల భవిష్యత్తుకు మరియు వారి విద్యా సంబంధిత సేవా గుర్తింపునకు ఎంతో తోడ్పడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.
స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో సామాజిక హితమే లక్ష్యంగా నాట్స్ నిరంతరం కృషి చేస్తోందని నాట్స్ నాయకులు తెలిపారు. నాట్స్ ఎడాప్ట్ ఎ హైవే (Adopt-A-Highway) లో పాల్గొన్న వారందరిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla) అభినందించారు.