గునుగు పువ్వు మిలమిల.. చామంతి పువ్వు ఘుమఘుమ తంగేడు పువ్వు తళతళ.. మా బతుకమ్మ కళకళ ఉయ్యాలో.. ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ సూడమ్మ ఉయ్యాలో.. మా గౌరమ్మ తల్లి ఉయ్యాలో
పొద్దు పొడవక ముందే లేసి.. పొలం గట్లకు ఉరికినం తంగేడు కొమ్మలు వంచి.. పసుపు పూలు తెంపినం గునుగు పూల కట్టలు కట్టి.. తెల్లని వెన్నెల తెచ్చినం చామంతులు, బంతి పూలు.. కట్ల పూలు కలిపినం తాంబాలంల వరుస వరుస.. గోపురమోలె పేర్చినం గుమ్మడి పువ్వు నడి నెత్తిన.. పసుపు గౌరమ్మను నిలిపినం
పట్టు చీరల రెపరెపలు.. కాళ్ళ గజ్జెల ఘల్లు ఘల్లు నుదుట కుంకుమ సూరీడు.. కొప్పు నిండా పూల జల్లు నెత్తి మీద బతుకమ్మతో.. నడిసి వస్తె ఆడబిడ్డ ఊరు ఊరంత గుడి అయితది.. ఆమెనే గౌరమ్మ అయితది సుట్టూ తిరిగి సప్పట్లు.. ఒక్క గొంతై పాటలు అక్క సెల్లెండ్ల నవ్వులల్ల.. పండుగ పొంగి పొర్లుతది
పసుపు కుంకుమ నిలవాలె.. పెనిమిటి నూరేండ్లు బతకాలె పిల్లా పాపలు సదవాలె.. సిరులతోటి ఎదగాలె అవ్వ అయ్యలు సల్లంగుండాలె.. అన్నదమ్ముల ఇల్లు నిండాలె సెరువు నిండాలె, సేను పండాలె.. ఊరు వాడ సల్లంగుండాలె గునుగు పువ్వు మిలమిల
సద్దుల పొద్దు సందె యాళ్ళ.. సెరువు గట్టున దీపాలు నీళ్ళ మీద పూల తెప్ప.. తేలిపోతాంటె కండ్ల నీళ్ళు మా మొక్కులు మోసుకపోవమ్మ.. మా కష్టాలు కడిగిపోవమ్మ పోయి రావమ్మ పూల తల్లి.. మల్ల ఏడాది తిరిగి రావమ్మ