California, USA: అంబటి దంపతుల దాతృత్వ స్ఫూర్తి భావితరాలకు మార్గదర్గకం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో డీన్ డాక్టర్ జోస్ ఎమ్ భారల్ సాంచేజ్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (University of California, San Francisco) కు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, రమ అంబటి దంపతులు 1 మిలియన్ డాలర్ల (1 Million Dollars) (సుమారు రూ.10 కోట్లు) విలువైన ఎండోమెంట్ (శాశ్వత నిధి) విరాళాన్ని ప్రకటించారు.
అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో (Fresno) పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ విరాళాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు అందజేశారు. ఈ విరాళం సాన్ జోవాక్విన్ లోయలో (San Joaquin Valley) వైద్య విద్య (Medical Education), పరిశోధనలను శాశ్వతంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఇచ్చారు. సాధారణ గ్రాంట్‌లకు భిన్నంగా ఎండోమెంట్ నిధులు (Endowment Funds) ఎప్పటికీ అయిపోవు.
ఈ సందర్భంగా డీన్ డా.సాంచేజ్ (Dean Dr. Sanchez) మాట్లాడుతూ.. అంబటి దంపతులు ఇచ్చిన ఈ విరాళం (Donation) ఎండోమెంట్ ఫండ్ కిందకు వస్తుందని అన్నారు. ఎండోమెంట్ నిధి శాశ్వత నిధి కింద జమవుతుందని తెలిపారు. దీనిలో ఉన్న 1 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా ఉంచి, దాని నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని (Annual Income) మాత్రమే ఖర్చు చేస్తారని అన్నారు. ఏటా ఈ నిధి నుంచి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉన్న అత్యుత్తమ ప్రతిభ కలిగిన వైద్య విద్యార్థులకు, వారి ఆర్థిక అవసరాలకు సహాయం చేయడం జరుగుతుందని వివరించారు.
గ్రామీణ వైద్యం, అల్ట్రాసౌండ్ టెక్నాలజీ, కుటుంబ వైద్యం వంటి రంగాల్లో వినూత్న పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. దీనివల్ల భావితరాల వైద్య విద్యార్థుల పరిశోధనలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అంబటి దంపతుల ఈ ఉదారమైన విరాళం UCSF చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అంబటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వైద్యులు, పరిశోధకులు. ఆయన సతీమణి రమ కూడా సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారని సాంచేజ్ తెలిపారు.
డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ… మాతృభూమి భారతదేశం, నేను స్థిరపడిన అమెరికా రెండింటి రుణం తీర్చుకుంటామన్నారు. 1986 నుంచి అమెరికాలోని UCSFలో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా (Clinical Professor of Urology) పనిచేస్తున్నానని తెలిపారు. మా కుటుంబం యూఎస్ఏలో 40 ఏళ్లుగా నివసిస్తున్నామని, UCSF మాకు గుర్తింపునిచ్చి నేను వైద్యుడిగా స్థిరపడటానికి అవకాశం కల్పించిందన్నారు.
నా సతీమణి రమ ప్రోత్సాహంతో మా సంపదలో కొంత భాగాన్ని తిరిగి ఈ సమాజానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ నిధి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ప్రతిభ కలిగిన విద్యార్థులు వైద్య విద్యను (Medical Education) అభ్యసిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. మా తర్వాత కూడా ఈ నిధి భవిష్యత్ తరాలకు కొనసాగుతుందన్నారు. దీనివల్ల ఎంతోమంది వైద్యరంగంలో సేవలందించేందుకు డాక్టర్లు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.