New York: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రవాస భారతీయుల్లో, ముఖ్యంగా భావితరాలకు సజీవంగా అందించాలని సంకల్పంతో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో గోరింటాకు పండగను ఘనంగా నిర్వహించారు.
న్యూయార్క్, క్వీన్స్ లో హనుమాన్ మందిర్ వేదికగా ఈ గోరింటాకు వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. వల్లెం వారి ఫార్మ్స్ (Vallem Vaari Farms) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యూయార్క్ పరిసరాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
పవిత్ర శ్రావణమాసంలో గోరింటాకు (Gorintaku) పెట్టుకోవడం, సంప్రదాయ దుస్తులు ధరించడం, మహిళలు, చిన్నారులు పరస్పరం గోరింటాకుతో అలంకరించుకోవడం లాంటి కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సంస్కృతిలో గోరింటాకుకు ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించారు.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల (Ravinder Kodela) తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించడం ద్వారా సమాజంలో ఐక్యత, సాంస్కృతిక అనుబంధం మరింత బలోపేతం అవుతుందని నైటా కార్యవర్గం పేర్కొన్నారు.
“మన మూలాలు – మన సంస్కృతి – మన సంప్రదాయం” అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ గోరింటాకు పండుగ న్యూయార్క్ (New York) లో తెలుగు కుటుంబాలకు (Telugu Families) ముఖ్యంగా మహిళలకు మధురమైన జ్ఞాపకంగా నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, హనుమాన్ మందిర్ నిర్వాహకులకు, పాల్గొన్న తెలుగు కుటుంబాలకు నైటా కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.