Frisco, Texas, September 12, 2026: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX), టెక్సాస్ ఇండో-అమెరికన్ ఫిజిషియన్స్ సొసైటీ (TIPS) భాగస్వామ్యంతో నిర్వహించిన సుఖీభవ ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ ఆరోగ్య శిబిరానికి కమ్యూనిటీ సభ్యుల నుంచి విశేష స్పందన లభించింది.
ఫ్రిస్కోలోని Rejoice Lutheran Churchలో సెప్టెంబర్ 12వ తేదీన ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని, ప్రజలకు ఉచిత వైద్య సలహాలు, ఆరోగ్య అవగాహనతో పాటు అవసరమైన వైద్య సూచనలు అందించారు.
ఈ శిబిరంలో ఇంటర్నల్ మెడిసిన్/ఫ్యామిలీ ప్రాక్టీస్, కార్డియాలజీ, న్యూట్రిషన్, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, రుమటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, స్లీప్ మెడిసిన్ తదితర వైద్య విభాగాలకు చెందిన నిపుణులు (Doctors) సేవలందించారు. ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ హాజరై, ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు.
TANTEX మరియు TIPS సంయుక్తంగా నిర్వహించిన ఈ కమ్యూనిటీ సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న TANTEX బృందం, TIPS వైద్యులు మరియు వాలంటీర్లను మేయర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా TANTEX అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి (Madhavi Lokireddy) మాట్లాడుతూ, “సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్య నిపుణుల సలహాలను అందుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యం.
ఈ ఉచిత ఆరోగ్య శిబిరానికి కమ్యూనిటీ సభ్యుల నుంచి లభించిన స్పందన ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి సేవలందించిన వైద్యులకు, సహకరించిన వాలంటీర్లకు (Volunteers) మరియు నిర్వాహక బృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
ఈ TANTEX (Telugu Association of North Texas) సుఖీభవ ఉచిత ఆరోగ్య శిబిరకార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులు, స్పాన్సర్లు (Sponsors), వాలంటీర్లు మరియు మీడియా భాగస్వాములకు (Media Partners) నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.