Connect with us

Politics

North Rhine-Westphalia, Germany: 2029లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Published

on

  • అమరావతి సహా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై వైకాపా వాళ్లు చేస్తున్న విషప్రచారాల్ని తిప్పి కొట్టాలి
  • ఇందుకు వేదికగా సామాజిక మాధ్యమాలు
  • జర్మనీలో ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశంలో సంకల్పం

2024లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు …. టిడిపి గెలుపే లక్ష్యంగా వివిధ దేశాల్లోని ప్రవాసాంధులు పనిచేయాలని జర్మనీలోని టీడీపీ ఎన్నారై నేతలు పిలుపునిచ్చారు. తామూ అదే లక్ష్యంతో పని చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నట్టు తెలిపారు.

జర్మనీలోని నార్త్ రైన్–వెస్ట్‌ఫేలియా (North Rhine-WestphaliaNRW) రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సమావేశం డ్యూసెల్డార్ఫ్‌ (Düsseldorf) లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

అభివృద్ధి భళా.. సంక్షేమం అదిరేలా

ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) నేతృత్వం, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కృషితో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని ఎన్నారై టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిని పాల్గొన్నవారు ప్రశంసించారు. అదే సమయంలో వీటిపై వైయస్సార్సీపి (YSRCP) నాయకులు చేస్తున్న దుష్ప్రచారాల్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. దీనికి సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకోనున్నట్టు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

గత రెండేళ్లుగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఎన్నారైలు (NRIs) కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు. జర్మనీలోని తెలుగు ప్రజల్లో పార్టీ విధానాలు, ప్రభుత్వ విజయాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి NRW రాష్ట్ర టీడీపీ సమావేశాలను వీలైనంత తరచుగా నిర్వహించాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో కిషోర్ నల్లపాటి, డా. దీప కందుల, లక్ష్మీపతి మద్దిపట్ల, శ్రీ కృష్ణుడు నాగండ్ల, రామకృష్ణ కొమడూరి, అశోక్‌బాబు దాసరి, శ్రీకాంత్ ఎర్రగుంట, సురేష్ గుడివాడ, స్వప్న, రఘుకుమారి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి సుమంత్ కొర్రపాటి, ఫర్హత్ మిర్జా, దినేష్ కోవి, లోకేష్, వంశీ హాజరుకాగా, మ్యూనిక్ నుంచి నరేష్ కోనేరు పాల్గొన్నారు. APNRTS అందించే సేవలను కంట్రీ కోఆర్డినేటర్ సుమంత్, రీజినల్ కోఆర్డినేటర్ నరేశ్ కోనేరు వివరించారు.

రుచికరమైన విందు.. ఆత్మీయ ముచ్చట్లు

పురుషులు, మహిళలు, చిన్నారులు పాల్గొనడంతో సమావేశం ఆత్మీయ, కుటుంబ వాతావరణంలో సాగింది. అనంతరం అందరూ కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ, స్నేహపూర్వకంగా ముచ్చటించారు. జర్మనీలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ (NRI TDP) శ్రేణుల ఐక్యత, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతకు ఈ సమావేశం ప్రతీకగా నిలిచింది.

error: NRI2NRI.COM copyright content is protected