Connect with us

Schools

కర్నూలు పాఠశాలకు 10 లక్షల విరాళం: TANA & Kurnool NRI Foundation

Published

on

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా నాలుగవ సంవత్సరం 10 లక్షల విరాళాన్ని తానా ఫౌండేషన్ సహకారంతో కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ (Kurnool NRI Foundation) అందించింది. తానా ఫౌండేషన్ (TANA Foundation) చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి 10 లక్షల చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి శుక్రవారం సెప్టెంబర్ 15 నాడు అందజేశారు.

అనాధ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు తానా బోర్డు సభ్యులు, కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ చైర్మన్ రవి పొట్లూరి (Ravi Potluri) తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్నబాలభారతి పాఠశాల (Bala Bharathi High School) మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ (Kurnool NRI Foundation) స్పూర్తితో ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

భవిష్యత్తులో కూడా బాలభారతి పాఠశాలకు వస్తూ ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం పదిహేను వందలకు పైగా గ్రామీణ విద్యార్థులకు పారితోషికాలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిధులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో పొదుపుసంఘం మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారం మరువలేనిదని విజయభారతి తెలిపారు.

స్వయంకృషితో ఎదిగి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విశేషసేవలందిస్తున్నశశికాంత్ వల్లేపల్లి వంటివారు అందరికీ ఆదర్శమని మరిన్ని విజయశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రవి పొట్లూరి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ సమన్వయకర్త రాజశేఖర్ ముప్పా తెలిపారు.

రవి పొట్లూరి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని బాలభారతి పాఠశాల ప్రధానోపాద్యాయుడు క్లెమెంట్ సత్యంబాబు, వైస్ ప్రిన్సిపాల్ సవ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ నర్సింహా రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సందడి మధు, తానా సభ్యుడు చందు భసూత్కర, పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కమిటీ కార్యవర్గం విజయలక్ష్మి, తాజానిష, పద్మావతమ్మ, ఐక్యసంఘంకు చెందిన నాలుగువేల మందికి పైగా మహిళలు, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected