Iowa, October 8, 2026: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అయోవాలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించింది. ఈ టోర్నమెంట్ లో తెలుగు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.
ఐఓవా చాప్టర్ (NATS Iowa Chapter) నిర్వహించిన ఈ 2వ వార్షిక క్రికెట్ లీగ్ – 2026 పోటీలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిశాయి. ఈ టోర్నమెంట్‌లో అడల్ట్ (పెద్దలు), కిడ్స్ (పిల్లలు) విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
సీడర్ రాపిడ్స్, మేరియన్, వాటర్లూ, ఐఓవా సిటీ వంటి విభిన్న ప్రాంతాల నుండి క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను దిగ్విజయం చేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో విజేతలకు, అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి నాట్స్ బహుమతులు పంపిణీ చేసింది.
ప్రత్యేక ఆకర్షణగా ‘కిడ్స్ క్రికెట్ లీగ్’
చిన్నారుల విభాగం ఈ టోర్నమెంట్‌కే (Cricket Tournament) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీజన్ పొడవునా చిన్నారులు అద్భుతమైన క్రీడా నైపుణ్యాలు, టీమ్‌వర్క్, క్రమశిక్షణను ప్రదర్శించారు. పిల్లలకు శిక్షణనిచ్చి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసిన కోచ్‌లు ముత్తు, బాలా సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడారు.
నాట్స్ ఐఓవా చాప్టర్ (NATS Iowa Chapter) కోఆర్డినేటర్ నవీన్ ఇంటూరి నాయకత్వంలో ఈ టోర్నమెంట్ అత్యంత క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడింది. చాప్టర్ నాయకులు గిరీష్ కంచర్ల, యుగంధర్ బాబు యెంప్రాల, శ్రీని వనవాసం, కళ్యాణి గోపాలం, కిశోర్ మద్దిని లు పోటీల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
ఈ ముగింపు వేడుకల్లో నాట్స్ (NATS) అయోవా మాజీ చాప్టర్ కోఆర్డినేటర్, హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ శివరామకృష్ణారావు గోపాలం తో పాటు స్థానిక నాయకులు జయంత్ గద్దె, పర్వత్ రెడ్డి, కవిత వనవాసం తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. యూత్ విభాగంలో సీడర్ రాపిడ్స్ , పిల్లల విభాగంలో సీడర్ వైకింగ్స్ గెలుపొందారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు రుచికరమైన భోజనాన్ని అందించిన సీడర్ రాపిడ్స్‌లోని ‘ప్యారడైజ్ ఇండియన్ రెస్టారెంట్’ యజమాని కృష్ణ మంగమూరి, ‘పెర్సిస్ రెస్టారెంట్’ యజమాని మహేష్‌లకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయోవాలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) ను దిగ్విజయంగా నిర్వహించిన నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ (Raj Allada) లు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ క్రీడా టోర్నమెంట్ (Cricket Tournament) కేవలం మ్యాచ్‌లకే పరిమితం కాకుండా తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చి క్రీడాస్ఫూర్తిని, స్నేహబంధాన్ని పెంపొందించిందని ఈ క్రికెట్లో పాల్గొన్నవారు ఈ క్రికెట్ ను వీక్షించడానికి వచ్చిన తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు.