Connect with us

Devotional

Canada, Mississauga: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణం

Published

on

తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, పిట్స్‌బర్గ్ వారి సహకారంతో శ్రీ శ్రీనివాస కల్యాణం కెనడాలోని మిస్సిసాగా నగరంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. సుప్రభాతం, అభిషేకం, అలంకరణ మరియు కల్యాణం అనే ఆచారక్రమాన్ని అనుసరించి ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తింది.

పిట్స్‌బర్గ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ (Sri Venkateswara Temple – Pittsburgh) 50వ వార్షికోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించబడిన ఈ కార్యక్రమం మరింత విశిష్టతను సంతరించుకుంది. పిట్స్‌బర్గ్ టెంపుల్ వారు తమ దేవతామూర్తులను పిట్స్‌బర్గ్ వెలుపలికి తీసుకువచ్చి కల్యాణాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషంగా నిలిచింది.

ఈ దివ్యోత్సవంలో పిట్స్‌బర్గ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ (Sri Venkateswara Temple – Pittsburgh) ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ కొత్తపల్లి గారు, సెక్రటరీ శ్రీ హరీశ్ కొండ గారు మరియు అర్చకులు శ్రీ సంతోష్ కుమార్ చార్యులు గారు పాల్గొనడం కార్యక్రమానికి సంస్థాగత విశిష్టతను మరింత పెంచింది.

ఈ కార్యక్రమానికి కల్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తులు, తమ సంకల్పం చేయించుకున్న భక్తులు (Devotees), మరియు సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరూ స్వామివారి దివ్య దర్శనం పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. భక్తుల భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి మరింత పవిత్రతను, ఉత్సాహాన్ని, మరియు వైభవాన్ని తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా పలు ఆకర్షణీయమైన స్టాల్స్ (Shopping Stalls) ఏర్పాటు చేయబడినాయి. స్థానిక వ్యాపార సంస్థలు, శ్రేయోభిలాషులు, మరియు స్పాన్సర్లు ఈ మహోత్సవానికి సహకరించి, స్వయంగా హాజరై కార్యక్రమాన్ని ఎంతో ఆస్వాదించారు. వారు ఏర్పాట్లను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని, మరియు కార్యక్రమ నిర్వహణను ప్రశంసించారు.

తిరుమల (Tirumala, Tirupati) నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదం భక్తుల కోసం అందించబడింది. ఇది ఈ కార్యక్రమానికి ఒక విశిష్ట ఆకర్షణగా నిలిచింది. కల్యాణం ముగిసిన అనంతరం, అందరికీ సాంప్రదాయబద్ధమైన పులిహోర మరియు దద్దోజనం అందించబడింది.

తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association – TCA) అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం (Srinivas Mannem) గారు మాట్లాడుతూ, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పిట్స్‌బర్గ్ వెలుపల తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కళ్యాణ కార్యక్రమానికి భాగస్వామిగా ఉండటం తమకు గర్వకారణమని తెలిపారు.

ఇది ఒక ప్రత్యేకమైన ఆరంభమని, పిట్స్‌బర్గ్ (Pittsburgh, Pennsylvania) వెలుపల మరెన్నో ఇలాంటి కల్యాణాలు జరగడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో అందరికీ శాంతి, ఆరోగ్యం, సౌఖ్యం, మరియు సర్వశ్రేయస్సు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాన్ని TCA కార్యవర్గం, బోర్డు ఆఫ్ ట్రస్టీస్, వ్యవస్థాపక సభ్యులు, మరియు స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమ విజయానికి సహకరించిన శ్రీ వెంకటేశ్వర టెంపుల్, పిట్స్‌బర్గ్ (Pittsburgh) వారికి తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం (Srinivas Mannem), ఉపాధ్యక్షులు శ్రీ శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రణీత్ పాలడుగు, కోశాధికారి శ్రీ రాజేష్ అర్ర, డైరెక్టర్లు శ్రీమతి శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శ్రీ శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం, శ్రీ సంతోష్ గజవాడ మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

సుమారు 1000 మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) తరపున ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అందరి సహకారం కొనసాగాలని ఆకాంక్షించింది.

error: NRI2NRI.COM copyright content is protected