చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) దశమ వార్షికోత్సవాలను పురస్కరించుకొని, CAA ఉన్నత ఆశయాలకు మరింత పవిత్రతను చేకూర్చే విధంగా, తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమైన సీతారాముల కళ్యాణాన్ని అరోరా శ్రీ వెంకటేశ్వర (బాలాజీ) స్వామి దేవస్థానం నందుగల పంచవటిలో శనివారం, ఏప్రిల్ 11వ తేదీన కన్నుల పండుగగా నిర్వహించారు.
భూదేవంత మండపంలో ఆకాశమంత పందిరివేసి వేదమంత్రోచ్ఛారణల నడుమ, ముత్యాల తలంబ్రాలు సాక్షిగా, భక్తుల జయజయ ధ్వనాల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన ఆదర్శ దంపతుల కల్యాణం, కార్యక్రమానికి వచ్చిన భక్తులను తన్మయత్వానికి గురిచేసింది.
అరోరా శ్రీ వెంకటేశ్వర (బాలాజీ) స్వామి దేవస్థానం అర్చకులు శ్రీ హనుమంత ప్రసాదు గారు పురోహితులుగా, చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) అధ్యక్షులు తమిష్రా కొంచాడ (Tamishra Konchada) – శ్రీనివాస్ సుబుద్ధి గార్ల కుటుంబం వధువు పక్షాన కన్యాదానం చేయగా, సంస్థ చైర్మన్ రాఘవ – శివబాల జాట్ల గార్ల కుటుంబం వరుడు పక్షాన చేరి కళ్యాణ క్రతువుని నిర్వహించారు.
ఒకపక్క కళ్యాణ క్రతువుని నిర్వహిస్తూనే, పురోహితులు హనుమంత ప్రసాదు గారు సీతారామ కళ్యాణంలోని వివిధ ఘట్టాలను వివరిస్తూ చేసిన ప్రసంగ భక్తులను భావోద్వేగాలకు గురిచేసాయి. ఈ సందర్భంగా పురోహితులు శ్రీ హనుమంత ప్రసాద్ గారు మాట్లాడుతూ, చికాగో (Chicago, Illinois) ప్రాంతంలోని ఏ ఇతర ప్రవాస భారతీయ సంఘాలు ఇంతవరకు చేయని విధంగా, వినూత్నంగా, మొట్టమొదటిసారిగా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.
పెద్దలు, భక్తులు, సభ్యులు ముక్తకంఠంతో ఈ కార్యక్రమాన్ని అభినందించి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని అభిలషించారు. కళ్యాణోత్సవ అనంతరం నవ దంపతులైన శ్రీ సీతారాములవారిని, ఆంజనేయుడు లక్ష్మణుని సమేతంగా పల్లకిలో ఊరేగించారు ఈ ఊరేగింపుని ఆడపడుచులు కోలాటం ఆడుతూ ముందుకు నడిపించారు.
అకేషన్స్ బై కృష్ణ, కృష్ణ జాస్తి గారు కళ్యాణ వేదికను అందంగా ముస్తాబు చేశారు. తాము కొత్తగా భారతదేశం నుంచి తీసుకువచ్చిన పెండ్లి మండపం నిర్మాణాన్ని మొదటిసారిగా శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఉపయోగించారు. Schaumburg లోని Vishnu Villas Restaurant నుండి, కళ్యాణ్ గారు వారు ఎంతో రుచికరంగా, సంప్రదాయపద్ధతిలో తయారు చేయించిన కళ్యాణ భోజనాన్ని, సురేష్ అయినాపూడి, ధర్మేంద్ర గాలి, మురళి రెడ్డివారి నేతృత్వంలోని బృందం ఆప్యాయంగా భక్తులకు వడ్డించారు.
ప్రదీప్ బత్చు, చక్రి, నరేంద్ర నూకల ఈ అందమైన వేడుకను తమ కెమెరాలలో అందంగా చిత్రించారు. సంస్థ సలహాదారు శ్రీకృష్ణ మాతుకుమల్లి (Srikrishna Matukumalli), ఉపాధ్యక్షులు రామకృష్ణ తాడేపల్లి, కార్యదర్శి ఒగ్గు నరసింహారెడ్డి ఈకార్యక్రమం సజావుగా జరిగేలా పర్యవేక్షించారు. సుజాత అప్పలనేని గారు చికాగో ఆంధ్ర ఆడపడుచులతో కలిపి కళ్యాణ మహోత్సవానికి కావలసిన ప్రసాదాలను తయారు చేశారు.
భాగ్యలక్ష్మి సంగెం గారు కల్యాణానికి కావలసిన పూమాలలను తన స్వహస్తాలతో తయారు చేశారు. శ్రీమతి ఆషా అడిగా గారి విద్యార్థి కుమారి కోగుల శ్రీ సురేష్ కుమార్ నృత్యోపచారం నిర్వహించారు. ప్రభాకర్ మల్లంపల్లి సురేష్ మహలి కార్యక్రమానికి వచ్చిన భక్తుల నమోదు చేసుకుని సభా ప్రాంగణానికి పంపించారు.
గౌరీ అద్దంకి గారు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి కావలసిన సాంకేతిక సహాయాన్ని అందజేశారు. కిరణ్ వంకాయలపాటి గారు ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో (Social Media) ప్రత్యక్ష ప్రసారం కావడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు.
ఇతర కార్యవర్గ సభ్యులు సునీత రాచపల్లి,సుగుణ శిరందాసు, శృతి కూచంపూడి, శ్రీస్మిత నండూరి, శైలజ సప్ప, రమ్య మైనేని, స్వర్ణ నీలపు, సాహితీ కొత్త, సుభాష్ చేపలమడుగు, రామారావు కొత్తమాసు, శ్రియ కొంచాడ, దివిజ చల్లా, జైఅనికేత్ మెడబోయిన, జిష్ణు వీరపనేని ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి కావలసిన సహాయ సహకారాలను అందించారు.
చివరిగా సంస్థ అధ్యక్షులు తమిష్రా కొంచాడ, కార్యదర్శి ఒగ్గు నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. సీతారాముల కళ్యాణం చేయాలనే సంకల్పాన్ని తమకు తమ సంస్థకు కలిగించినందుకు ముందుగా ఆ సీతారాముల వారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా జరగడానికి ముఖ్య కారకులైన పురోహితులు శ్రీ హనుమంత ప్రసాద్ గారికి, ఇంత మంచి ప్రాంగణాన్ని మనకు అందించిన అరోరా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారికి, ఈ కళ్యాణం ఇంత అందంగా జరగటానికి నిరంతరం వెన్నంటి ప్రోత్సహించిన సంస్థ సభ్యులకు,స్పాన్సర్లకి, ట్రస్టీస్కు, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, కార్యవర్గ సభ్యులకి స్వచ్ఛంద కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.