Connect with us

News

అట్లాంటాలో భారత మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హ ప్రతిష్టాపన ఏర్పాట్లు

Published

on

భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల రూపకర్త, ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకే ఒక్క తెలుగు బిడ్డ, బహుభాషావేత్త పీవీ న‌ర‌సింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అసాధారణ ప్రతిభాశాలి అయిన పీవీ మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని ఆకాంక్షించారు. ఈ మధ్యనే శ‌త జ‌యంతి సందర్భంగా ప్ర‌పంచ నలుమూలలా ఉత్స‌వాలు నిర్వహించారు.

ఈ ఉత్స‌వాలలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలను స్థాపించాలని నిర్ణ‌యించినట్లు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు బిగాల మ‌హేశ్ అట్లాంటా సమావేశంలో అన్నారు. ఈ క్ర‌మంలో అమెరికాలోని అట్లాంటా మహానగరంలో విగ్రహ స్థాపన చేయనున్నట్లు, స్థ‌ల ప‌రిశీల‌న కూడా పూర్తి అయ్యిందని, నవంబర్‌లో విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమానికి పీవీ కుటుంబ సభ్యుల‌ను, తెలంగాణ నుంచి వివిధరంగాల ప్రముఖుల్ని, అమెరికా సెనేటర్స్, ఇండియన్ డయాస్పోరా నుంచి ముఖ్యంగా తెలుగు ప్రముఖుల్ని ఆహ్వానిస్తామని చెప్పారు. అందరి కోరిక మేరకు పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ ఫౌండింగ్ మెంబర్ డాక్టర్ పాడి శర్మ ఆధ్వ‌ర్యంలో గత సోమవారం ఆగష్టు 16న స్థానిక మద్రాస్ చెట్టినాడ్ రెస్టారెంట్లో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు బిగాల మ‌హేశ్ ముఖ్య అతిధిగా, అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు అక్కినేని చాంద్, ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా చైర్మన్ సావిలి సునీల్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నారై సలహాదారు రామడుగు శివకుమార్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా నుంచి రామిశెట్టి శ్రీనివాసులు, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ నుంచి చైర్మన్ పబ్బ చిట్టారి, సెక్రటరీ పన్నెల జనార్దన్, గుండ్ల సందీప్, చకిలం కీర్తిదర్ గౌడ్, ఎన్నారై వాసవి అసోసియేషన్ నుంచి కసం గణేష్ తదితరులు హయారయ్యారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected