Connect with us

Literary

తెలుగు సాహిత్య వనాన పద్య పరిమళం విజయవంతం: TANTEX @ Dallas Fort Worth

Published

on

ఫిబ్రవరి 18 వ తేదీ  ఆదివారము జరిగిన డల్లాస్ ఫోర్ట్ వర్త్ (Dallas Fort Worth), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, TANTEX ”నెల నెలా తెలుగు వెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక  199 వ సాహిత్య సదస్సులో ”తెలుగు సాహిత్య వనాన పద్య పరిమళం”అంశంపై నిర్వహించిన సదస్సు ఎంతో  బాగా జరిగింది. పలువురు సాహితీప్రియులు అంతర్జాలములో పాల్గొనడం ద్వారా జరిగిన  ”నెలనెలా తెలుగు వెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక ప్రారంభ సూచికగా భక్తి గీతము  ”మరుగేలరా…..ఓ రాఘవా !” అనే త్యాగరాజ కీర్తననుచిరంజీవి సమన్విత మాడా, రాగయుక్తంగా వీనుల విందుగా పాడి  సాహితీ ప్రియుల మనసులను దోచుకొన్నది.. తన మధుర కంఠంతో  కార్యక్రమ ప్రారంభాన్ని శోభాయమానం చేసిన చిరంజీవి సమన్విత ను పలువురు సాహితీ ప్రియులు  అభినందించడం జరిగింది. సంస్థ సమన్వయ కర్త  శ్రీ లక్ష్మినరసింహ పోపూరి గారి సహకారముతో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థకార్యక్రమాల  సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గారు నేటి సాహితీ సదస్సు (Literary Event) అంతర్జాల ప్రసార ఏర్పాట్లను  స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.

సాహితీ సదస్సు లో పాల్గొంటున్నటువంటి కార్వేటినగరం డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ గా  సేవలందించి  రిటైరయిన, గర్భ కవిత్వంలో అనేక రచనలు చేసిన కవి, మావిళ్ల వెంకట రంగయ్య గారి లోకనాధంగారు మాట్లాడుతూ తాను గర్భ కవిత్వంలో అనేక రచనలు చేసినట్లు పేర్కొన్నారు. ఒక పద్యము లో మరొక పద్యమును వ్రాయుటను గర్భ కవిత్వము అంటారనీ అలాగ ఒకే పద్యములో 3, 4 పద్యములు కూడా వ్రాయవచ్చుననీ కూడా పేర్కొన్నారు.  కంద పద్యములను కొన్ని వృత్తములలో గర్భితము చేయుటకు వీలవుతుందని కూడా పేర్కొన్నారు. అనంతరం స్టేట్ బాంక్ లో పనిచేసి రిటైర్ అయి న శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ సాహిత్యం పై మక్కువతో మన తెలుగు భాషపై తాను వ్రాసిన రెండు కవితలను చదివి వినిపించారు.

ఆ తరువాత మన మధ్య ఉంటూనే తెలుగు సాహిత్యం (Telugu Literature) లోని మాధుర్యాన్ని వెలికితీసి మనకందించడంలో లోతైన కృషిచేస్తున్న ఆధునిక తెలుగు పదబంధ చక్రవర్తి డాక్టర్ ఎన్ ఆర్ యు గారు తాము 2018 నుండి నేటి వరకు సభకు హాజరవుతున్న వారినందరినీ భాగస్వాములను చేయాలన్న సత్సంకల్పముతో నెలనెలా నిర్వహిస్తున్న”మన తెలుగు సిరిసంపదలు” కార్యక్రమములో అర్ధ భేదముగల జంట పదాలు,చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు, జాతీయాలు, పొడుపుకథల మిళితమైన సంఖ్యా బోధకపదభ్రమకాలు, ఐదక్షరాల పదభ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను  తీవ్రముగా ఆలోచింపచేసివారినుండి సరియైన పదభ్రమక సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగించారు.ప్రహేళికలు, జాతీయాలు పొడుపు కథలతో సహా దాదాపు నలభై ప్రక్రియల సమాహారమే ”మన తెలుగు సిరిసంపదలు”… ఈ శీర్షికలోవైవిద్య భరితమైన తెలుగు భాషా ప్రయోగాలను సృష్టించడం ఎన్ ఆర్ యు గారి ప్రత్యేకత. సదస్సుకు హాజరైన వారందరి మెదడుకు మేత వేసి సాహితీ ప్రియులు అందరిలో ఎనలేని ఉత్సాహాన్నినింపిన  శ్రీ  ఊరుమిండి నరసింహారెడ్డి (NRU) గారు అందరి ప్రశంసలనందుకొన్నారు.

డాక్టర్ శ్రీమతి అరుణ జ్యోతి కోలా గారు తన ”మాసానికో మహనీయుడు” శీర్షికలో ఫిబ్రవరి మాసంలో జయంతి మరియు వర్ధంతి జరుపుకొంటున్న ప్రముఖులు మరియు రచయితల పేర్లను సేకరించి వారిని గుర్తుచేసుకొంటూ ప్రసంగించారు. ఈ సందర్భములో ప్రముఖ కవి రా రా రా గా ప్రశస్తి పొందిన రాచమల్లు రామచంద్ర రెడ్డి గారి జీవిత విశేషాల్ని ప్రస్తావించారు. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామంలో 1922, ఫిబ్రవరి 28 న జన్మించారనీ పులివెందులలోని డిస్ట్రిక్ట్ బోర్డు హైస్కూల్లో నూ, ఇంటర్మీడియేట్ అనంతపురంలోని కాలేజీలోచదివిన ఆయన చెన్నై లోని గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో చేరి చదువు ఆపివేసినట్లు పేర్కొన్నారు. 1950ల నుంచి మార్క్సిజమ్ పట్ల మొగ్గు చూపినరా రా రా.. 1968 లో సంవేదన పత్రిక నిర్వహించారనీ , 1970 లలో ఆరేళ్లపాటు మాస్కోలో అనువాదకుడిగా పనిచేసి తిరిగొచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు ఈనాడు పత్రికకు సంపాదకీయాలు రాశారనీ నవంబరు 25, 1988 వరకు జీవించారనీ తెలిపారు. ఆయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మరో ప్రసిద్ధ గ్రంథం ‘సారస్వత వివేచన’ కి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించిందని తెలిపారు. ప్రతి నెలాఅధిక శ్రమ కోర్చి ప్రముఖుల జీవిత విశేషాల్ని సేకరించి మన ముందుంచుతున్న డాక్టర్ అరుణ జ్యోతి కోలా గారి కృషిని అనేక మంది సాహితీ ప్రియులు ప్రశంసించడం జరిగింది.

అనంతరం సాహితీ విశ్లేషకులు డాక్టర్ లెనిన్  వేముల గారుమాట్లాడుతూ  ‘రాచమల్లు రామచంద్రా రెడ్డి గారి కవిత్వంలోని ప్రత్యేకతల్ని గుర్తుచేసుకున్నారు. చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, మహీధర రామమోహనరావు లాంటి రచయితలపై ఆయన చేసిన మూల్యాంకనం లోతైనదనీ ఆయన వాదోపవాదాల్లో దిట్టఅనీ  ఆయన్ను శ్రీశ్రీ ‘క్రూరుడైన విమర్శకుడు’ అన్నా నిజజీవితంలో రా రారా చాలా స్నేహశీలి అనీ  లెనిన్ వేముల గారు పేర్కొన్నారు. ఆతరువాత అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ ఏ రచయిత అయినా తన రచన విజయ0 సాధించడానికి తాను ఎంపికచేసుకొనే  వస్తువుపై ఆధారపడి ఉంటుందన్నారు.ఆంధ్ర  ప్రదేశ్ ప్రభుత్వం 2023  నవంబరు లో ”తెలుగు పరిమళం” అనే పుస్తుకంలో  తాను వ్రాసిన ”ఫ్లెమింగో”కవితా సంపుటిలోని యాభై రెండు లైన్ల కవితభాగాన్ని’కృష్ణ గీతికలు”శీర్షికతో  తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య అంశముగాప్రవేశపెట్టడం వెనుక  నెల్లూరు జిల్లా నేలపట్టు కు వచ్చే సైబీరియన్ పక్షుల జీవనానికి మన జీవితానికి గల పోలికలను తాను నిశితంగా గమనించి వ్రాయడమే ‘ఫ్లెమింగో” కవితల ఆవిర్భవానికి మూలకారణమన్నారు.తాను అద్భుతంగా వ్రాసిన ఆ ”ఫ్లెమింగో ” కవితా సంపుటిలోని యాభై రెండు లైన్ల కవితభాగాన్ని  చదివి వినిపించారు. శ్రీ లెనిన్ వేముల గారు ప్రతిసందిస్తూ డాక్టర్  పెరుగు రామకృష్ణ గారు ఫ్లెమింగో పక్షుల జీవన శైలిని చాలా కాలంపాటు  దగ్గరగా గమనించి వ్రాయడం వల్ల డాక్టర్  పెరుగు రామకృష్ణగారి  కవిత అద్భుతంగా ఉందని ప్రశంసించారు.క్షణం తీరికలేకుండా సాహిత్య సేవలో నిమగ్నులైవున్నప్పటికీ ఈ నెల నెలా తెలుగు వెన్నెల సాహితీ సదస్సు లో పాల్గొని తమ గళం వినిపించినందుకు డాక్టర్ పెరుగు రామకృష్ణ గారికి అందరి తరపున శ్రీ గోవర్ధనరావు నిడిగంటి కృతజ్ఞతలు తెలియ చేశారు.

ఆ తరువాత శ్రీ లెనిన్ వేముల గారు ”దిగంబర కవులు” గురించి అద్భుతంగా  ఉపన్యసించారు. దిగంబర కవులు ఆరుగురిలో ఇప్పటికీ జీవించి వున్న చెరబండరాజు గారు  వ్రాసిన ”వందేమాతరం” కవితను, నిఖిలేశ్వర్ గారు వ్రాసిన ”అగ్నిశ్వాశ” కవిత ను,నగ్నముని మానేపల్లి హృషీకేశరావు గారు వ్రాసిన కవితలను భావయుక్తంగాను రాగ యుక్తంగానూ చదివి  వినిపించినపుడు  సాహితీ ప్రియులంతా లెనిన్ గారి శ్రావ్యమైన  గళాన్నివిని ముగ్ధులైనారు. ఆ తరువాత డాక్టర్ సీతా లక్ష్మి గారు సమ్మక్క సారక్క వనదేవతల జాతర ను గుర్తుచేస్తూ ”మార్గదర్శకులు” శీర్షికతో  తాను వ్రాసిన కవితను చదివి వినిపించి సాహితీ ప్రియులను పరవశింప  చేశారు. అనంతరం TANTEX బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థకార్యక్రమాల సలహాదారుశ్రీ దయాకర్ మాడా గారు పద్య సాహిత్యపు వైశిష్ట్యాన్ని వివరిస్తూ పురాతన మరియు ఆధునిక కవులు వ్రాసిన రెండు పద్యాలను అద్భుతంగా చదివి విన్పించారు. ఆ తరువాత వారు నేటి ముఖ్య అతిథి ప్రముఖ శ్రీ పాతూరి కొండల్ రెడ్డి గారిని పరిచయం చేశారు.

ముఖ్య అతిథి శ్రీ కొండల్  రెడ్డి పాతూరి గారు ”ఓం నమో  శ్రీ మాత్రేన్నమః” అని తనకు ఇష్టదైవమైన దుర్గమ్మను తలచుకొని తన ”తెలుగు సాహితీ వనాన పద్య పరిమళం” ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ  సమాజంలో తమ  పేరు శాశ్వతంగా  నిలబడాలని కోరుకొంటారనీ. మంచి గుడి కట్టించినా లేక మంచి నీటి బావి త్రవ్వించినా, చెరువులు త్రవ్వించినా, వారి పేరు చిరస్థాయిగా పేరు నిలబడక పోవచ్చును కానీ,ఎన్నటికీ  చెడి పోనిది, మనపేరు శాశ్వతంగా  నిలబెట్టేది, మనసుకు ఆహ్లాదం కలిగించేది కేవలము  పద్యము మాత్రమేనని పేర్కొన్నారు. ఎంత పెద్ద విషయాన్నైనా నాలుగుపాదాల చిన్నపద్యంగా వ్రాయగల  అవకాశం ఒక్క తెలుగు భాష (Telugu Language) లోనే వున్నదని పేర్కొన్నారు.

అనర్గళంగా ఉపన్యసించిన శ్రీ కొండల్  రెడ్డి గారు, మహా భారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి నన్నయ ,మహా కవి తిక్కన తెనిగించిన  మహాభారతములోని అనేక  పద్యాలను, చాటు పద్యాల రారాజు, కవి సార్వభౌముడు శ్రీనాధ మహాకవి వ్రాసిన శృంగార నైషధములోని చాటు పద్యాలు, బమ్మెర పోతన వ్రాసిన భాగతమునందలి ”గజేంద్ర మోక్షము” వంటిపురాణాలలోని  ముఖ్యమైన పద్యాలు, వేమన వ్రాసిన నీతి పద్యాలు, పాల్కురికి  సోమనాధ విరచిత ”పండితారాధ్య చరిత్ర”లోని పద్యాలు,ఆధునిక కవులైన కరుణశ్రీ, దాశరధి, జాషువా, దువ్వూరు వారు, బొగ్గవరపుపెద్ద పాపారాజు వంటి కవులను  స్మరిస్తూ వారు వ్రాసిన పద్యాలు,అంతే గాక తాను స్వయముగా వ్రాసిన సమస్యా పూరణ పద్యాలు  రాగయుక్తంగా పాడి శ్రోతల మనసులకు ఆహ్లాదం కలిగించారు. పద్యాలు పాడేసమయంలో వారు ఆయా కాలానుగుణ సందర్భ సహిత వ్యాఖ్యలను  అందరికీ అర్ధమయ్యే సులభ మైన శైలిలో చెప్పడం శ్రీ  కొండల్ రెడ్డి గారి ప్రత్యేకత. మిత్రుల ప్రోత్సాహముతో ”పద్యపరిమళం” అనే యు ట్యూబు ఛానెల్ ను  నిర్వహిస్తున్నామని, మన తెలుగు భాష తియ్యదనం మరింత మందికి చేరువ చేయడానికి తనవంతు కృషి చేయడం  తన జీవిత ధ్యేయమని శ్రీ కొండల్ రెడ్డి గారు పేర్కొనడం చూస్తే వారికి తెలుగు భాష పట్ల గల మక్కువ ద్యోతకమౌతుంది.

సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు మాట్లాడుతూ శ్రీ కొండల్ రెడ్డి గారి ప్రయత్నానికి తమ సహాయ సహకారాలు  ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు.  ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం (TANTEX) పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు నేటి ముఖ్య అతిథి,పద్యానికి పట్టాభిషేకం చేస్తున్న శ్రీ కొండల్ రెడ్డి పాతూరి గారిని ”పద్యకోకిల” బిరుదుతో ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మానగ్రహీత శ్రీ కొండల్ రెడ్డి పాతూరి గారు  తన ముగింపు ఉపన్యాసంలో ఒకింత ఉద్వేగానికి లోనయి  మాట్లాడుతూ అమెరికాదేశం లో ఉన్నప్పటికీ తెలుగు పద్యం విశిష్టతను గుర్తించి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు, టాంటెక్స్ (Telugu Association of North Texas) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థ కార్యక్రమాల సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గారు, మిగిలిన సాహితీ ప్రియులు ఇంతమంది తనను సన్మానించి  ప్రోత్సహించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

తనను ఇంతగా ఆదరించిన టాంటెక్స్ (Telugu Association of North Texas) సాహితీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు, డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గారు, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్ గారు, డాక్టర్ అరుణ జ్యోతి కోలా గారు, శ్రీమతి రామ్ సీతా మూర్తి గారు శ్రీ నవీన్ గొడవర్తి గారు, శ్రీ  లెనిన్ వేముల గారు, డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, డాక్టర్ చీదెళ్ల సీతా లక్ష్మి గారు, శ్రీ హనుమంత రావు కరవది గారు, శ్రీ ఎం.వీ.లోకనాధం గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు అనేకమంది అంతర్జాలంద్వారా హాజరవడంతో  సదస్సు విజయవంతమైంది. తమ వంతు కృషి చేసి ఈ సదస్సును విజయ వంతం చేసిన డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు  శ్రీ సతీష్ బండారు గారు, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థ కార్యక్రమాల  సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గారు, సంస్థ సమన్వయ కర్త శ్రీ లక్ష్మి నరసింహ పోపూరి గారు మరియు టాంటెక్స్ పాలకమండలి సభ్యులు అభినందనీయులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected