Connect with us

People

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్థంతి

Published

on

ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) 27వ వర్థంతి కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు సుధీర్ కొమ్మి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చి, వినూత్న సేవాసంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చారు. సామాన్యుడు, అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించారు. ఆయన చరిత్ర చెరిపేద్దామన్నా చెరిగిపోదు. పేరు తొలగించినా జనం మనస్సులో, మదిలో నుంచి ఆయన రూపును తుడిపివేయలేరన్నారు. తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో నందమూరి చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.

సాయి బొల్లినేని మాట్లాడుతూ… నందమూరి తారకరాముని ఆత్మగౌరవ నినాదం తెలుగుజాతి గుండెల్లో జాతీయగీతంలా ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుందన్నారు. ఆ మహానుభావుని స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు.

కిషోర్ కంచెర్ల మాట్లాడుతూ… సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందారని, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారన్నారు. రాముడు, కృష్ణుడంటే ఎన్టీఆర్ రూపే గుర్తుకు వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో అనిల్ ఉప్పలపాటి (Anil Uppalapati), కార్తీక్ కోమటి, రమేష్ గుత్తా, నాగ దేవినేని, రమేష్ అవిరినేని, జనార్థన్ ఇరువూరి, యశ్వంత్ గుంటూరి, లక్ష్మణ్ కుమార్ భాష్యం, హరీష్ చౌదరి బెల్లం, కల్యాణ్ యేలూరి, పవన్ కుమార్ పొట్లూరి, నందీప్ పొడపాటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected