Connect with us

Elections

ఎన్నికల సంస్కరణలపై వెంకయ్య నాయుడుకి గళం వినిపించిన వాషింగ్టన్ వాసి: Dr. Vasu Gorantla

Published

on

వాషింగ్టన్ వాసి డాక్టర్ గోరంట్ల వాసుబాబు గురించి తెలియనివారు ఉండరు. ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ గోరంట్ల వాసుబాబు ఒక పక్క సైలెంట్ గా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు బోధనా సామాగ్రి, సైన్స్ పరికరాలు వంటివి అందిస్తూ, మరో పక్క భారతదేశంలోని రాజకీయాలు, ఎన్నికల సంస్కరణలపై తొంభైల్లోనే తన గళాన్ని వినిపించారు. ఇప్పుడు మరోసారి ఆ సంస్కరణలను, సూచనలను భారత 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ఈ మధ్యనే అందించారు. అందరినీ ఆలోచింపజేసేలా ఉన్న ఆ వివరాలు NRI2NRI.COM పాఠకుల కోసం ఇవిగో.

ప్రస్తుతం భారతదేశంలో అవసరమైన ఎన్నికల సంస్కరణలు:-

గత 10 – 12  సంవత్సరాలుగా తెలుగు (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) రాష్ట్రాలలోను, భారతదేశం లోని వివిధ రాష్ట్రాలలోను మరియు భారతదేశ జాతీయ రాజకీయాలలోను జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే నేను ఏదో ఒక పార్టీనో, వ్యక్తినో ఉద్దేశించి వ్రాసానని అనుకోవచ్చు. కానీ నేను (డాక్టర్ గోరంట్ల వాసుబాబు)  1982 వ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ లోను మరియు దేశ రాజకీయాలలోను జరిగిన పలు సంఘటనలను, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల నియమ నిబంధనలలోను ఉన్న కొన్ని లోపాలను పరిశీలించి మే 1, 1998 న  (25 సంవత్సరాల క్రితం) కొన్ని సూచనలను కేంద్ర ప్రభుత్వానికి/ కేంద్ర ఎన్నికల సంఘంకు  పంపించటం జరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా పలు రాష్ట్రాలలోని శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయసభలకు చెందిన పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు గుర్తింపు పొందిన ఒకపార్టీ నుండి గెలిచి, తరువాత కొద్దిరోజులలోనే  వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం మరొక పార్టీలోకి మారటం జరుగుతుంది. అందువలన రాజకీయ అస్థిరత నెలకొంటుంది 

ప్రజాభిమానంతో గెలిచిన పార్టీ పూర్తికాలం అధికారంలో ఉంటుందన్న గ్యారంటీ లేదు. అధికారంలో ఉన్నవారు ప్రత్యర్థుల పార్టీలకు చెందిన శాసనసభ్యులు , పార్లమెంటు సభ్యులను సామ, దాన, భేద  దండోపాయాలు ద్వారా ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా అధికార పార్టీలోకి ఆహ్యానించి వారికి చట్టవిరుద్ధంగా ప్రభుత్వంలో కీలక (మంత్రి పదవులు, ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్షులు) పదవులను ఇవ్వటం జరుగుతుంది.

ప్రజలు మన దేశంలో జరిగిన ఎన్నికలలో ఏ పార్టీనైనా గెలిపిస్తే కేవలం ఆ పార్టీ మీద నమ్మకంతోనూ, ఆ పార్టీ నాయకుని మీద నమ్మకంతోనూ  గెలిపించినట్లుగా భావించాలి. కానీ  దురదృష్టం ఏమిటంటే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకులు వెంటనే చెప్పే మాటలు ఏమిటంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన పలువురు సభ్యులు మాతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించటం జరుగుతుంది. అంటే అధికారం వచ్చింది కాబట్టి వెంటనే ప్రత్యర్థి పార్టీ సభ్యులను కొనుగోలు  చెయ్యటానికి ప్రయత్నం చెయ్యటం జరుగుతుంది అన్నమాట. ఈ సంస్కృతి లో మార్పు రావలసిన అవసరం ఉంది.

అందువలన మన భారతదేశ ఎన్నికలలో  కొన్ని వేల, లక్షలమంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించవలసిన/వహిస్తున్న మన ప్రజాప్రతినిధులకు కొన్ని మార్గదర్శక సూత్రాలను (నియమాలను) ఏర్పాటుచేయవలసిన ఆవశ్యకత ను మీ ద్రుష్టి కి తీసుకు రావటం జరిగింది. మీరు ఈ విషయాలను ఒకసారి పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలను చేయవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇటీవల కాలంలో తరచూ పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు వస్తున్న  విషయం అందరికీ తెలిసిందే. ఈ రాజకీయ అస్థిరతకు ప్రధాన కారణం రాజకీయనాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉండటమే. వాళ్ళ ఇష్టానుసారం, స్వలాభం కోసం ఒక పార్టీ నుండి మరొక పార్టీ లోకి మారటం. ఇలాంటి ముఖ్యసమస్యలకు పరిష్కారం ఉండాలంటే ఈ రాజకీయనాయకులకు కొన్ని షరతులు విధించి తరచూ ఎన్నికలు వచ్చే అవకాశాలను పూర్తిగా నివారించి తద్వారా విలువైన సమయాన్ని,  ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడవచ్చు.

ఈ క్రింది సూచనలను పాటించటం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది:-

1 . ఒకసారి పార్లమెంటులో కానీ, శాసనసభ లో కానీ, ఏ ప్రభుత్వం అయినా బలనిరూపణ చేసుకున్న తరువాత తిరిగి కొంతకాలం వరకు ఎవరు మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం పడిపోకుండా ఉండాలి.

2 . మద్దతు ఇచ్చే సమయంలో ఆయా రాజకీయపార్టీల నాయకుల నుండి ఎలాంటి పరిస్థితులలోను  కనీసం 2 సంవత్సరాలు అయినా ఆ మద్దతు కొనసాగిస్తామని హామీని పొందాలి. తద్వారా వారు కోరే గొంతెమ్మ కోర్కెలకు భయపడాల్సిన అవసరం లేదు.

Dr. Vasubabu Gorantla

3. చట్టసభలలో బలనిరూపణ సమయంలో ఒక పార్టీ కి ఓటు వేసి గెలిపించిన వారు, కనీసం ఒక సంవత్సరం వరకు  బలనిరూపణ సమయంలో మరొక పార్టీకి ఓటు వేయరాదు. అందువలన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఎం.ఎల్.ఏ. లేదా ఎంపీ లను మరొక పార్టీ వారు ప్రలోభ పెట్టటానికి అవకాశం ఉండదు

4. గెలిచిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఒకపార్టీ తరుపున గెలిచి మరొక పార్టీ లోకి మారితే వారు కనీసం 6  నెలల పాటు తమ ఓటు ను శాసనసభ, పార్లమెంటు సభలలో వినియోగించుకోకుండా ఉండాలి. అంటే పార్టీ మారిన 6 నెలల లోపు వారి ఓటుకు చట్టసభలలో  విలువ ఉండకూడదు. అప్పుడు మైనారిటీ ప్రభుత్వాలు మరొక పార్టీ లోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేయటానికి వీలుండదు/ప్రయత్నించరు

5. అధికారం లో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంటు సభకు వేరే పదవికి పోటీ చెయ్యాలంటే , ఎన్నికలలో గెలిచిన తరువాత కాకుండా ముందుగానే తమ పదవికి రాజీనామా చెయ్యాలి. ఇలాంటి పరిస్థితి ఉంటే, MLA లు, MP గాను, MP లు MLA  గాను పోటీ చేయటం, రాష్ట్రమంత్రులు MP లు పోటీ చేయటం, వాళ్ళు గెలిచాక ఏర్పడే ఖాళీలకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించటం తగ్గుతుంది.

6. ఒక వ్యక్తి ఒక నియోజక వర్గం నుండి మాత్రమే పోటీ చేయాలి. కొన్ని సందర్భాలలో నాయకులు  2, 3 నియోజక వర్గాలనుండి పోటీ చేయటం, అన్నింటిలోనూ గెలిచిన తరువాత ఒక నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ, మిగిలిన చోట్ల రాజీనామా చేయటం ద్వారా మరలా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైతే చాలా సందర్భాలలో ఈ విధమైన ఉపఎన్నికలు నివారించవచ్చు

7 . గుర్తింపు పొందిన ఒక (జాతీయ / ప్రాంతీయ)  పార్టీ నుండి మరొక గుర్తింపు పొందిన ఒక (జాతీయ / ప్రాంతీయ)  పార్టీ లోకి మారినప్పుడు వారు కొత్తగా చేరిన పార్టీ తరుపున కనీసం 6 నెలల వరకు ఎన్నికలలో పోటీ చేసే అర్హత గానీ, ఎలాంటి ప్రభుత్వ పదవిని పొందటానికి వీలుండకూడదు

  • అందువలన ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో ఒక పార్టీలో ఎం.ఎల్.ఏ. లేదా ఎంపీ టికెట్ రానివారు మరొకపార్టీ లోకి చేరి పోటీచేసే అవకాశం ఉండదు. అందువలన కేవలం పదవుల కోసమే పార్టీ మారే వారెవరు  ప్రజాప్రతినిధులుగా వచ్చే అవకాశం ఉండదు.
  • పార్టీ నాయకులతోనూ, మరొకరితోనో, విభేదాలు వచ్చి ఎవరైనా తమ ఎం.ఎల్.ఏ. లేదా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే తిరిగి కొంతకాలం వరకు (కనీసం 6 నెలల పాటు) ఎన్నికలలో పోటీ చేయరాదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఎం.ఎల్.ఏ. లేదా ఎంపీ పదవులకు వారు రాజీనామా చేసి తద్వారా వచ్చిన ఉపఎన్నికలలో మళ్ళీ వాళ్ళే పోటీ చేసి గెలిసిన సందర్భాలు ఉన్నాయి. తిరిగి పోటీ చేయాలనే తలంపు ఉన్నప్పుడు రాజీనామా చేయటం, మరలా ఎన్నికలు జరిపించటం ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటున్నది. అందువలన ఎవరైనా స్వచ్చందంగా రాజీనామా చేసినప్పుడు తిరిగి ఉపఎన్నికలలో పాల్గొనే అవకాశం లేనప్పుడు ఎవరూ రాజీనామా చెయ్యరు
  • కొన్ని సందర్భాలలో ప్రతిపక్షం లో ఉన్న సభ్యులు రాజీనామా చేసి అధికార పార్టీ లో చేరి, ఎన్నికలలో పోటీ చేయకపోయినా అధికారం లో ఉన్న వారు, ఈ ఫిరాయింపు దారులకు ఎన్నికలతో ప్రమేయం లేకుండా మరొక కీలకమైన ప్రభుత్వ పదవిని ఇవ్వవచ్చు. అందువలన, గుర్తింపు పొందిన ఒక (జాతీయ / ప్రాంతీయ)  పార్టీ నుండి మరొక గుర్తింపు పొందిన ఒక (జాతీయ / ప్రాంతీయ)  పార్టీ లోకి మారినప్పుడుకొత్తగా చేరిన పార్టీ తరుపున సుమారు 6 నెలల వరకు ఎన్నికలలో పోటీ చేసే అర్హత గానీ, ఎలాంటి ప్రభుత్వ పదవిని పొందటానికి వీలుండకూడదు, అన్న నిబంధన ద్వారా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడవచ్చు
  • ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ లో ఉన్న విధానాలలోని లోపాలను రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నేతలు వారి వ్యక్తిగత, వ్యాపార, ఆర్ధిక ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేయటం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న విధానం వలన ఒక పార్టీ లో ఉన్న ఎం.ఎల్. ఏ  లు, ఎంపీ లు ఎన్నికల తరువాత అధికార పార్టీ లో చేరటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. కొంతమంది పార్టీ నేతలు వారు ఉన్న పదవికి రాజీనామా చేసి రావాలని తెలివిగా చెప్పటం జరుగుతుంది. కానీ వారు రాజీనామా చేసిన చోట వచ్చే ఉప ఎన్నికలలో తిరిగి వారే పోటీ చేయటం జరుగుతుంది. బలమైన అధికార  పార్టీ లో చేరారు కనుక  తిరిగి వారే ఎన్నికలలో గెలుస్తారు. ఇందువలన ఫలితం ఏమిటంటే వ్యకిగత ప్రయోజనాలకోసం రాజీనామా, తిరిగి పోటీ, మళ్ళీ వాళ్ళే ఎన్నిక కావటం జరుగుతుంది. ఈ విధమైన ఎన్నికల వలన వాళ్ళు రాజీనామా చేసి బలమైన పార్టీ నుండి మళ్ళీ పోటీ చేసి గెలిచి, వాళ్ళు చేసిన స్వార్ధ రాజకీయాలకు ప్రజల ఆమోదం ఉన్నది అని ప్రకటించుకోవడం జరుగుతుంది.
  • కొన్ని సందర్భాలలో వివిధ పార్టీల నేతలు వ్యక్తిగత ప్రతిష్ట కోసం దమ్ముంటే రాజీనామా చేయండి, మేము రాజీనామా చేసి మళ్ళీ  పోటీ చేస్తాము అని ప్రత్యర్థులకు సవాళ్లు విసరటం జరుగుతుంది. ఆ నేతల బలాబలాలు తేల్చుకోవడానికి ప్రజా ధనముతో  ఎన్నికలు నిర్వహించాలని వారు భావించటం సరికాదు. ఆయా ఎన్నికలలో ప్రత్యక్షంగా వ్యయం కొన్ని కోట్ల రూపాయలు అయితే పరోక్షంగా కొన్ని వందల కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. కొన్ని వందల/వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆ ఎన్నికలలో  విధులు నిర్వహించవలసి ఉంటుంది. అందువలన ఆ ఉద్యోగులు పని చేస్తున్న శాఖలలో వారు నిర్వహించవలసిన ప్రజలకు సంబంధించిన పనులలో జాప్యం జరుగుతుంది. ఎన్నికలలో జరిగే హింసాయుత సంఘటనలలో గాయపడే   అమాయక ప్రజలు ఇంకా ఎందరో చెప్పలేము. ఇదంతా కేవలం కొద్దిమంది రాజకీయ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు మూలంగా ప్రజాస్వామ్యానికి జరిగే నష్టమే.

దీనికి ఉన్న ఒకే ఒక పరిష్కారం: గుర్తింపు పొందిన ఒక (జాతీయ / ప్రాంతీయ)  పార్టీ నుండి మరొక గుర్తింపు పొందిన ఒక (జాతీయ / ప్రాంతీయ)  పార్టీ లోకి మారినప్పుడు వారు కొత్తగా చేరిన పార్టీ తరుపున సుమారు 6 నెలల వరకు ఎన్నికలలో పోటీ చేసే అర్హత గానీ, ఎలాంటి ప్రభుత్వ పదవిని పొందటానికి వీలుండకూడదు

8. ఒక పార్టీ నుండి మరొక పార్టీ లోకి  మూడింట రెండు వంతుల వారు అంటే 2 /3 సభ్యులు మరొకపార్టీ లో చేరటం చట్ట సమ్మతం. ఒక పార్టీ  లోని నూరు (100 %) శాతం సభ్యులు మరొక పార్టీ లో చేరితే వారు ఉన్న పార్టీని మరొక పార్టీలో విలీనం చేసినట్లే. కానీ ఈ విధానం లో ఉన్న లోపాలను కూడా అరికట్టాలి.

ఎందుకంటే ముగ్గురు శాసన/ పార్లమెంటు సభ్యులు ఉన్న పార్టీ నుండి ఇద్దరు మరొక పార్టీలోకి, పార్టీ అధ్యక్షుని నిర్ణయానికి వ్యతిరేకంగా మారితే ఇది చట్ట సమ్మతం అవుతుంది. కేవలం ఒక్క  శాసన/ పార్లమెంటు సభ్యులు ఉన్న పార్టీ నుండి, ఆ ఒక్కరూ ఆ పార్టీ అధ్యక్షుని నిర్ణయానికి వ్యతిరేకంగా మరొక పార్టీ లోకి మారితే ఆ ఒక్కరూ ఉన్న పార్టీ , ఆ పార్టీ అధ్యక్షుని నిర్ణయం తో నిమిత్తం లేకుండా మరొక పార్టీ లో విలీనం అయినట్లే.

అందువలన ఎవరైనా ఒక గుర్తింపు పొందిన జాతీయ/ప్రాంతీయ పార్టీ నుండి మరొక పార్టీ లోకి మారితే వారి సభ్యత్వం వెంటనే రద్దు చేసేలా విధానాలు ఉండాలి. ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రం లోను అధికారం లో ఉన్న పార్టీ నేతలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలి. కానీ ప్రస్తుతం అధికార పార్టీలన్నీ కేవలం ప్రతిపక్షం లో ఉన్న నేతలను ఆకర్షించించి ప్రత్యర్థులను బలహీన పరచటానికి అధికారాన్ని వినియోగిస్తున్నారు.

ఈ విధమైన లోపాలను సరిదిద్దటానికి కేంద్ర ఎన్నికల సంఘం వారు ఈ విధమైన నియమాలను ఎన్నికల ప్రక్రియ లో అనుసరించాలి. ఈ నియమాలు  ఏ  రాజకీయ పార్టీ కి,  ప్రాంతానికి,  వ్యక్తి కి వ్యతిరేకం కాదు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం అధికార దుర్వినియోగం కాకుండా, ప్రజాప్రతినిధులు కేవలం ప్రజా సమస్యల మీద మాత్రమే కృషి చేసేలా ఉండాలనే ఆకాంక్షతో మీ దృష్టికి ఈ విషయాలను తీసుకు వస్తున్నాను.

– గోరంట్ల వాసుబాబు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected