- London Borough of Sutton కౌన్సిలర్ గా ఆలపాటి చంద్ర
- లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరుపున ఎన్నిక
- ఎన్నికైన వెంటనే స్థానిక పాఠశాల విరాళాల కోసం 38 కి.మీ. పాదయాత్ర
తెలుగు వారంతా గర్వపడేలా లండన్ బరో ఆఫ్ సటన్ కౌన్సిలర్ గా ఆలపాటి చంద్ర (Alapati Chandra) ఎన్నికయ్యారు. ఆయన లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి (Liberal Democratic Party) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక తెలుగు వ్యక్తి ఈ ఘనత సాధించడంతో ఆ ప్రాంతంలోని తెలుగు వారంతా సంబరాలు జరుపుకున్నారు. అభినందనలతో ఆయనను ముంచెత్తారు.
ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే విద్యావ్యవస్థ (Education System) పట్ల ఆయన తన నిబద్ధత చాటుకున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి నిధుల సేకరణ కోసం 38 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆలపాటి చంద్ర స్ఫూర్తిగా నిలిచారు. సుమారు 7 గంటల పాటు నిరంతరాయంగా నడిచారు.
ఈ పాదయాత్ర ద్వారా విద్యా మౌలిక సదుపాయాల కల్పన పట్ల తన అంకితభావాన్ని చాటారు. ఇలా తాను సేకరించిన నిధులు… స్థానిక ప్రభుత్వ పాఠశాల అవసరాలకు, విద్యార్థుల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
చురుకైన నాయకుడిగా… సంక్షేమానికి కట్టుబడిన ప్రజాప్రతినిధిగా
సమాజంలో చురుకైన నాయకుడిగా, ప్రజల సంక్షేమానికి కట్టుబడిన ప్రజాప్రతినిధిగా (People’s Representative) చంద్ర చేసిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. స్థానిక పార్లమెంట్ సభ్యుడు, సటన్ మేయర్ (Mayor), పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఆయన్ను ప్రశంసించారు.
ఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం నాయకులు భాస్కరరావు అమ్మినేని మాట్లాడుతూ… “కౌన్సిలర్ ఆలపాటి చంద్ర చేపట్టిన ఈ పాదయాత్ర పిల్లల భవిష్యత్తు పట్ల, స్థానిక విద్యా వ్యవస్థ పట్ల వారికున్న నిబద్ధతకు ప్రతీక” అని అన్నారు. సమాజ సేవ, విద్యాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం (Public Welfare) కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషికి ఈ పాదయాత్ర ఒక బలమైన నిదర్శనమని ఆయన తెలిపారు. ఆయన చొరవ విద్యావ్యవస్థలో మంచి మార్పు తేనుందని కొనియాడారు.