Austin, Texas: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (Telangana Development Forum – TDF) ఆధ్వర్యంలో స్థానిక రియో ర్యాంచ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 5,000 మందికి పైగా ప్రవాస భారతీయులు తరలివచ్చి ఘనంగా జరుపుకున్నారు.
తెలంగాణ (Telangana) సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన, మహిళలకు అత్యంత ముఖ్యమైన బతుకమ్మ (Bathukamma) పండుగను స్థానిక ప్రవాస మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను (Bathukamma) పెద్ద ఎత్తున గ్రౌండ్‌కు తీసుకువచ్చి, సాంప్రదాయ దుస్తుల్లో మహిళలంతా (Women) చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ ఆడిన బతుకమ్మ ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అన్ని రాష్ట్రాల వారి భాగస్వామ్యం
ఈ వేడుకల్లో కేవలం తెలంగాణ ప్రాంతం వారే కాకుండా.. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు సహా పలు ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను కనులారా వీక్షించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వాన్ని (Unity in Diversity) చాటాయి.
ప్రత్యేక స్టాళ్లు – ఉచిత భోజనాలు
పండుగను పురస్కరించుకుని గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నోరూరించే వంటకాలు, ప్రత్యేక హైదరాబాదీ స్వీట్ పాన్, మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బట్టలు, జ్యువెలరీ స్టాళ్లకు విశేష స్పందన లభించింది. స్థానిక ‘దేశీ సర్కిల్’, ‘పులావ్ కంపెనీ’ వారి సౌజన్యంతో వచ్చిన భక్తులందరికీ (Devotees) ఉచిత భోజన వసతి కల్పించారు.
ముందు తరాలకు స్ఫూర్తి
భారతదేశం నుండి వచ్చిన సీనియర్ సిటిజన్లు, ఇక్కడ స్థిరపడిన ఐటీ ఉద్యోగులు, మహిళలతో పాటు చిన్నారులు కూడా ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం (Program) ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది.
ఈ సంబరాలకు (Celebrations) స్థానిక మహిళా జడ్జ్ ముఖ్య అతిథిగా హాజరై, ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రవాస భారతీయులందరికీ బతుకమ్మ (Bathukamma) శుభాకాంక్షలు తెలిపారు.
దాదాపు నెల రోజుల పాటు శ్రమించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఫోరం నాయకులు, వాలంటీర్లను (Volunteers) హాజరైన వారంతా అభినందించారు. ఈ వేడుకల విజయవంతంలో శీతల్, ప్రణతి, శ్రావణి తదితరులు కీలక పాత్ర పోషించి, ముందుండి నడిపించారు.