- భావితరాలకు అమ్మ భాషను చేరువ చేయాలనే దృక్పథం అందరిలోనూ ఉండాలి
- అమెరికాలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈనాడు సంపాదకులు మానుకొండ నాగేశ్వరరావు
- ఆయనను ఘనంగా సత్కరించిన ప్రవాసులు
అమెరికాలో ఉన్న లక్షలాది తెలుగు కుటుంబాల్లో ఈతరం చిన్నారులకు తెలుగు (Telugu) చదవడం, రాయడం, స్పష్టంగా మాట్లాడడం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఈనాడు సంపాదకులు (Nageswara Rao Manukonda) మానుకొండ నాగేశ్వరరావు Washington D.C లో అన్నారు. మాతృభాషను భావితరాలకు మరింత చేరువ చేయాలనే దృక్పథం అందరిలోనూ పెంపొందాలని పిలుపునిచ్చారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington D.C.) లో మానుకొండ నాగేశ్వరరావుతో తెలుగు భాషాభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. “మాతృభూమి – మాతృభాష – మన బాధ్యత” అనే అంశంపై వక్తలు, అతిథులు ప్రసంగించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభమైంది. తానా–పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
రామోజీరావుని ఆదర్శంగా తీసుకోవాలి
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగునాట పత్రికా రంగంలో శిఖర సమానులైన రామోజీరావు (Cherukuri Ramoji Rao) ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాగేశ్వరరావు అన్నారు. “పౌరులుగా సమాజాన్ని మరింత చైతన్యవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకోవడంలో పత్రికా స్వేచ్ఛ, యువతలో ప్రజా చైతన్యం కీలక పాత్ర పోషిస్తాయి. యువత నైపుణ్యాభివృద్ధితో కూడిన ఉపాధి అవకాశాలు, స్వయం సమృద్ధి సాధించే దిశగా దృష్టి సారించాలి” అని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
సంస్కృతికి మూలం మాతృభాషే
గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ…. ఏ దేశంలో ఉన్నా వృత్తి, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న తెలుగు వారందరూ తమ పిల్లలకు తప్పనిసరిగా తెలుగు (Telugu Language) నేర్పించాలని అన్నారు. మాతృభాషను విస్మరించిన ఎన్నో జాతులు చరిత్రలో తమ ప్రత్యేకతను కోల్పోయాయని గుర్తుచేశారు.
ఉపాధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ, మన కుటుంబ బంధాలకు, సంస్కృతికి మూలం మాతృభాషేనని పేర్కొన్నారు. తెలుగు భాష (Telugu Language) పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న తానా (Telugu Association of North America – TANA) పాఠశాలను ఆయన అభినందించారు.
తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Dr. Naren Kodali), GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) మాట్లాడుతూ…. ప్రతి సందర్భంలోనూ మన మాతృభాష తెలుగు, తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తమ సంస్థల కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతాయని తెలిపారు. తానా–పాఠశాల (TANA Patasala) వేదికను ప్రతి తెలుగు ఇంటి చిన్నారులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని వివరించారు. మాతృభాష పరిరక్షణ కోసం కట్టుబడి నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
శ్రీకృష్ణదేవరాయల నానుడిని సార్థకం చేద్దాం
తానా–పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) మాట్లాడుతూ…. “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న శ్రీకృష్ణదేవరాయల (Sri Krishnadevaraya) వారి నానుడిని సార్థకం చేస్తూ, మన ఘన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అది మాతృభాష తెలుగు పరిరక్షణ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అనంతరం పెద్దలు, విద్యార్థులు (Students), తల్లిదండ్రులు (Parents) కలిసి ముఖ్య అతిథి మానుకొండ నాగేశ్వరరావు (Nageswara Rao Manukonda) ను ఘనంగా సత్కరించారు. సన్మాన పత్రాన్ని చదివి, వారి జీవితంలోని పలు విశిష్ట పార్శ్వాలను సభికులకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఒక చక్కని, ఆలోచనాత్మక సమావేశంలో పాల్గొన్నామనే తృప్తి కలిగిందని తానా కల్చరల్ కోఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు (Saisudha Paladugu), పారుపల్లి కోదండరామయ్య, సీతారామారావు ఎండూరి, తదితర సభికులు అభిప్రాయపడ్డారు. మాతృభాష తెలుగు ఆవశ్యకతను, దాని పరిరక్షణ బాధ్యతను ప్రతి తెలుగు ఇంటికీ తీసుకెళ్లాలని, ఈ దిశగా తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.