Connect with us

Festivals

బోనమెత్తిన న్యూయార్క్, NYTTA ఆధ్వర్యంలో కన్నులపండుగగా బోనాల మహోత్సవం

Published

on

. పెద్దసంఖ్యలో హాజరై సంప్రదాయ బోనాల పండగ నిర్వహించిన NYTTA కార్యవర్గం
. అమెరికాలో తెలంగాణ పల్లె జానపదం వినిపించిన కవులు, కళాకారులు
. ఉత్సవాల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని మెచ్చుకున్న అమెరికన్ లెజిస్లేటర్

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్ (Eisenhower Park) లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

లాంగ్ ఐలాండ్ (Nassau County, Long Island, New York) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిధులుగా హాజరై, బోనాల పండగ చాలా ఉత్సాహభరితంగా ఉందని మెచ్చుకున్నారు.

ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ (Telangana) జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.

ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్ (Shyam Kasarla), జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా హాజరై తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా పద్మ కోడెల చేతుల మీదుగా ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణ, డెకొరేషన్, మహంకాళి గుడి, బోనాల తయారీ, చూపరులను మంత్రాముగదులు చేసినవి. పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy) దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి.

హాజరైన వారందరూ పసందైన తెలంగాణ వంటకాలతో విందు ఆరగించటంతో పాటు, అద్భుతంగా నిర్వహించిన నైటా (New York Telangana Telugu Association – NYTTA) కార్యవర్గాన్ని అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected