Edison, New Jersey: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ప్రవాస తెలుగువారి సంక్షేమం కోసం నిరంతరం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా’ఆస్క్ ఆన్ అటార్నీ’ పేరుతో ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించింది. ఇమ్మిగ్రేషన్ (Immigration), వీసా సంబంధిత క్లిష్టమైన సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సుమారు 50 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి కిరణ్ మందాడి (Kiran Mandadi) అనుసంధాకర్తగా వ్యవహరించి చర్చను సమర్థవంతంగా నడిపించారు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి (Bindu Yalamanchili) న్యూ జెర్సీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి తోడ్పాటుతో ఈ వెబినార్ మరింత ఉపయుక్తంగా సాగింది.
ప్రస్తుత మారుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనల గురించి ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను ఇలింద్ర (Bhanu Ilindra) సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యంగా ఈ నెల విడుదలైన వీసా బులెటిన్ (Visa Bulletin) లోని మార్పులను విశ్లేషించడంతో పాటు, రాబోయే 2026 హెచ్-1బి ఫైలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన కొత్త నిబంధనలపై ప్రవాసులకు స్పష్టతనిచ్చారు.
అనంతరం గంటకు పైగా సాగిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో అటార్నీ భాను గారు ఓపికగా సమాధానాలిచ్చారు. ఈబీ-5 గ్రీన్ కార్డ్ విధానం (EB-5 Green Card Program), స్టేటస్ మార్పు, వేతనాల వర్గీకరణ, అడ్వాన్స్ పెరోల్ ద్వారా ప్రయాణాలు, వీసా అపాయింట్‌మెంట్ స్లాట్ల లభ్యత, హెచ్-4 వీసా ఫైలింగ్ వంటి అనేక అంశాలపై ఉన్న స్పష్టమైన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందడి (Srihari Mandadi) ల మార్గదర్శకత్వంలో జరిగింది. నాట్స్ (North America Telugu Society – NATS) నాయకులు శ్రీకాంత్ పొనకాల,రాకేష్ వేలూరు, శ్రీనివాస్ మెంటా తదితరుల సమన్వయం ఈ సదస్సుకు బాగా దోహదపడింది.