Connect with us

People

కెనడాలో రాజకీయాల్లో, మంత్రి పదవిలో మన తెలుగు బిడ్డ

Published

on

గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగజాగర్లమూడిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఆయిల్, గ్యాస్‌ రంగ నిపుణుడిగా దేశం కాని దేశం కెనడా వెళ్లి అక్కడ రాజకీయాల్లో రాణించి ఇప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలుగుతున్న మన తెలుగు బిడ్డే శ్రీ పండా శివలింగ ప్రసాద్‌ గారు. విజయవాడలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసి హైదరాబాద్‌లో ఆల్విన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ స్కూటర్స్‌ లిమిటెడ్‌లో, ఆ తరువాత ముంబైలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 16 సంవత్సరాలు పనిచేశారు.

తదనంతరం కెనడాలోని సంతూర్‌ ఎనర్జీలో 16 సంవత్సరాలు పనిచేసి ఆల్బర్టా రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టారు. కెనడాలోని జామ్ నగర్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రతిపక్ష వైల్డ్‌ రోజ్‌ పార్టీలో చేరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ తరువాత కాల్గరీ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉంటూ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్, ట్రేడ్‌కు షాడో మంత్రిగా వ్యవహరించారు. 2019 ఏప్రిల్‌ 16న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాల్గరీ–ఎడ్మాంటన్‌ నుంచి గెలుపొందిన ప్రసాద్‌ గారు ఏకంగా మౌలిక వసతుల మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ నియోజకవర్గంలో 75 శాతం ప్రజలు తెల్లవాళ్లు. 16 శాతం చైనీయులు. ఇండియా నుంచి రెండు శాతం కూడా ఉండరు. మంత్రిగా ఎన్నికైన తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఆల్బర్టాను అప్పుల బారినుంచి గట్టెక్కించడమేనని ప్రసాద్ గారుఅంటున్నారు.

ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రసాద్‌, తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, వెంకట సుబ్బయ్య గార్ల జ్ఞాపకార్ధం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఏర్పాటైన ఈ శిబిరంలో కాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా తను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరాన్ని అందునా స్థానిక బంధువులు, మిత్రుల సమక్షంలో ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇండియా ట్రిప్ లో భాగంగా ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ గారిని కలవడం విశేషం.

ETV Andhra Pradesh: https://youtu.be/GvrfeI_4qI8

ETV Telangana: https://youtu.be/OhGrpvcTLUM


error: NRI2NRI.COM copyright content is protected