Connect with us

Education

కులంపై థీసిస్‌, ఉత్తమ పరిశోధన అవార్డు: NRI ప్రణతి చరసాల

Published

on

అమెరికాలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి భారతదేశంలోని కుల వివక్షను ప్రత్యక్షంగా చూసింది. కాలేజీ చదువులో భాగంగా రిజర్వేషన్లపై థీసిస్‌ సమర్పించి ఉత్తమ పరిశోధన అవార్డు అందుకుంది. ఆ అమ్మాయి వాషింగ్టన్‌ డీసీకి చెందిన ప్రణతి చరసాల. ఆలస్యంగా మా దృష్టికి వచ్చిన ఈ వార్త మీకోసం.

‘‘మా సొంత ఊరు కడప జిల్లాలోని కల్పనాయిని చెరువు. మా నాన్న ప్రసాద్‌ చరసాల పాతికేళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. నేను పుట్టిందీ, పెరిగిందీ అమెరికాలోనే. రెండు, మూడేళ్ళకు ఒకసారి మా కుటుంబం స్వగ్రామానికి వెళుతూ ఉంటుంది. నాలుగేళ్ల కిందట ఇండియాకి వచ్చినప్పుడు మా నాన్న స్నేహితుడిని కలవడానికి మా ఊరిలోని దళితవాడకు నన్నూ, మా నాయనమ్మ ను తీసుకువెళ్ళారు. మమ్మల్ని దూరం నుంచి చూసిన నాన్న స్నేహితుడు లేచి నిలబడడం గమనించాను. ఆయన మాకు ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. కానీ వాళ్ళ ఇంటి లోపలికి మాత్రం మమ్మల్ని తీసుకెళ్లలేదు. వసారాలోని మంచం వాల్చి, కూర్చొమని మాకు మర్యాద చేశారు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు నేల మీదే కూర్చున్నారు. నేను వాళ్ల పక్కన కూర్చోబోయాను. మా నాయనమ్మ వద్దని వారించింది. ఆమె మాట వినకుండా, నేలమీద కూర్చున్నాను. అప్పుడు మా నాన్న ఫ్రెండ్‌, ఆయన కుటుంబ సభ్యులూ చాలా ఇబ్బంది పడ్డారు. అది నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది.

అదే సమయంలో, మా ఊర్లో దళితుల పట్ల అగ్రకులాలు చూపే అస్పృశ్యతను కళ్లారా చూశాను. ‘ఇదేం సంస్కృతి?’ అని మా నాయనమ్మను అడిగితే, ‘‘కుల వ్యత్యాసం అమ్మా! ఇక్కడ పద్ధతులు ఇలాగే ఉంటాయి. వాటిని బట్టే మనమూ నడుచుకోవాలి’’ అంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా, పుట్టుక ఆధారంగా గౌరవించడం నన్ను బాధించింది. కులవివక్షపై నావంతుగా పోరాడాలని అప్పుడే నిశ్చయించుకున్నాను.

ప్రస్తుతం నేను వాషింగ్టన్‌ డీసీకి కొంచెం దూరంలో ఉన్న గ్లెనెల్‌ హైస్కూల్లో పన్నెండో తరగతి చదువుతున్నాను. నా స్టడీలో ‘గిఫ్టెడ్‌ అండ్‌ టాలెంటెడ్‌ రీసెర్చ్‌’ అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. అందులో భాగంగా ఎవరికి నచ్చిన అంశం మీద వారు పరిశోధన చేసి, థీసీస్‌ సమర్పించాలి. ఉత్తమ పరిశోధనలను ఎంపికచేసి, విద్యార్థులకు ప్రత్యేక అవార్డు ఇస్తారు. నేను ‘అఫెర్మేటివ్‌ యాక్షన్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో రిజర్వేషన్ల వల్ల దళితులకు నిజంగానే లబ్ది చేకూరిందా?, ‘రిజర్వేషన్లు దేశాభివృద్ధికి అడ్డంకి’ అని ఓపెన్‌ కేటగిరీకి చెందిన కొందరి వాదనల్లో వాస్తవమెంత?’ అనే అంశాలపై పరిశోధన చేశాను. మేము నివసించే ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న సీనియర్‌ జర్నలిస్టు నరిసెట్టి గారిని నా పరిశోధనకు గైడ్‌ చేయమని కోరాను. అందుకు ఆయన అంగీకరించారు. అప్పటికే ఇంటర్నెట్‌లో ఈ అంశాలకు సంబంధించిన కొంత డేటాను సేకరించాను. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రాసిన వ్యాసాలు కొన్ని చదివాను.

క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఇండియాకి వచ్చి, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, రచయితలు ఇండస్‌ మార్టిన్‌, అరుణాంక్‌ లత తదితరులను కలిశాను. కరీంనగర్‌, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని దళితవాడలకు వెళ్లాను. అక్కడ కుల అహంకారానికి బలైన కొన్ని కుటుంబాలతో మాట్లాడాను. మామిడికాయలు దొంగిలించాడనే కారణంగా అగ్రకులస్థులు కొందరు కలిసి ఒక దళిత వ్యక్తిని చంపిన ఘటన వినగానే నాకు ఆగ్రహం వచ్చింది. కులానికి వేరు వేరు కోణాలు ఉంటాయని అప్పుడే అర్థమయింది.

కార్నెల్‌ యూనివర్సిటీ ప్రత్యేక పరిశోధన కోసం నాకు నాలుగువేల డాలర్లను ఉపకారవేతనంగా ప్రకటించింది. తద్వారా కులానికి సంబంధించిన కొత్త కోణంపై మరో పరిశోధన కొనసాగించే అవకాశం లభించింది. ఇలా నాకు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ కులనిర్మూలనా పోరాటానికి తోడ్పడేలా మలుచుకుంటాను.’’

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected