Connect with us

Convention

మే 26,27,28 నాట్స్ సంబరాలకు ముమ్మర ఏర్పాట్లు, ఉవ్విళ్లూరుతున్న తెలుగువారు

Published

on

. అన్ని హంగులతో ముస్తాబవుతున్న న్యూ జెర్సీ కన్వెన్షన్ సెంటర్
. సంబరంలో సేవ, సంబరంతో సేవ అంటూ ముందడుగు
. తెలుగుదనం ఉట్టిపడేలా తుది కసరత్తు
. ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు
. తరలి వస్తున్న టాలీవుడ్ స్టార్స్
. మిరుమిట్లు గొలిపే సాంస్కృతిక కార్యక్రమాలు
. సినీ సంగీత ప్రవాహంతో లైవ్ కాన్సర్ట్స్
. విద్య, వ్యాపార, సాహిత్య, మహిళా, పూర్వ విద్యార్థుల సదస్సులు
. 25 శాతం విరాళాలు సేవా కార్యక్రమాలకు కేటాయింపు
. 7వ అమెరికా తెలుగు సంబరాలకు సన్నద్ధమైన నాట్స్

Sreedhar Appasani
Convener

న్యూ జెర్సీ, మే 23: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిపే అమెరికా తెలుగు సంబరాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ సర్వ సన్నద్ధమైంది. ఈ సారి న్యూజెర్సీ వేదికగా ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే ఈ తెలుగు సంబరాలను అద్భుతంగా జరిపేందుకు సంబరాల కమిటీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే తెలుగు సంబరాలకు వచ్చే తెలుగు అతిరథ మహరధుల జాబితాను విడుదల చేసింది.

తాజాగా నాట్స్ తెలుగు సంబరాల్లో నిర్వహించే ముఖ్య కార్యక్రమాలను ప్రకటించింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయలే ప్రధాన ఎజెండా రూపొందించిన తెలుగమ్మాయి కార్యక్రమం తుది పోటీలు సంబరాల వేదికపై జరగనున్నాయని నాట్స్ సంబరాల కమిటీ తెలిపింది. తెలుగు సినీ అతిరథ మహారథులైన ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలను నాట్స్ సంబరాల వేదికపై నిర్వహించనున్నట్టు ‘నాట్స్’ అమెరికా తెలుగు సంబరాల కమిటీ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని తెలిపారు.

సంబరాలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఆదిశేషగిరిరావు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కె.వి.రావు, రెయిన్ బో హాస్పిటల్స్ ఛైర్మన్ రమేశ్ కంచర్ల, ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ కొత్తపల్లి విచ్చేయనున్నారని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కో కన్వీనర్ రాజ్ అల్లాడ తెలిపారు. సంబరాల్లో తెలుగు సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు, సినీ సంగీత విభావరిలు, డ్యాన్స్ షోలు, సినీ కళాకారులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉండనున్నాయి.

Aruna Ganti
Chairman

వీటితో పాటు విద్య, వ్యాపార, మహిళా సదస్సులు నిర్వహించనున్నట్టు నాట్స్ తెలిపింది. సంబరాలకు గౌరవ అతిధులుగా సినీ ప్రముఖులు సాయికుమార్, కోదండరామిరెడ్డి. బి.గోపాల్, ఆలీ, చంద్రబోస్ తదితరులు విచ్చేయనున్నారు. సినీ సంగీత ప్రవాహంతో తెలుగు వారిని అలరించేందుకు ఎలిజియం బ్యాండ్, మణిశర్మ, థమన్, శివమణి, గీతామాధురి, శ్రీ కృష్ణ, పార్ధు నేమాని, సింహా తరలి రానున్నారు. సినీ రచనపై అవగాహన కలిగించేందుకు సంబరాల్లో నిర్వహించే వర్క్ షాప్‌కు ప్రముఖ దర్శకులు బీవీఎస్ రవి ప్రత్యేకంగా హాజరుకానున్నారు.

ఇంకా సినీ దర్శకులు గోపిచంద్ మలినేని, అవసరాల శ్రీనివాస్, యువ హీరోలు ఆది సాయికుమార్, సుధీర్ బాబు, సుశాంత్, డాన్స్ మాస్టర్ సత్య, హిరోయిన్లు సంయుక్త మీనన్, హెబ్బా పటేల్, నేహాశెట్టి, మన్ర చోప్రా, రుహాని శర్మ సంబరాల్లో సందడి చేయనున్నారని సంబరాల డిప్యూటీ కన్వీనర్ రాజ్ అల్లాడ తెలిపారు. బిగ్ బాస్ విన్నర్స్ సన్నీ, బిగ్ బాస్ 4 ఆర్టిస్టులు సోహైల్, హిమజ, శివజ్యోతి, జోర్ధార్ సుజాత, జబర్థస్త్ రాకేశ్, ముక్కు అవినాశ్, టీవీ ఆర్టిస్టులు ప్రియ, సోనియా చౌదరి, సాహిత్య, రజిత, జయలక్ష్మి, ప్రవీణ కడియాల, ప్రముఖ నటి మంజుభార్గవి, ప్రముఖ నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, నందమూరి సుహాసిని సంబరాలకు వస్తున్నారని నాట్స్ సంబరాల కమిటీ వివరించింది.

Bapu Nuthi
President

సాహిత్య, ఆధ్యాత్మిక రంగాల నుంచి కల్యాణి ద్విభాష్యం, కొండవీటి జ్యోతిర్మయి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, మీగడ రామలింగ స్వామి, గంగాధర శాస్త్రి, ఆకెళ్ల బాల భాను, వాడ్రేవు సుందరరావు, స్వర వీణాపాణి, ప్రభాకర్ గరికపాటి, సిరాశ్రీ తదితరులు సంబరాల్లో పాల్గొంటారని సంబరాల కమిటీ తెలిపింది.

తెలుగు సంబరాల్లో తెలుగు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతో పాటు అమ్మనాన్నకు సత్కారం పేరిట తల్లిదండ్రులను సంబరాల వేదికపై సత్కరించుకునే కార్యక్రమం ఉంటుంది. దీంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమాలు, సానా (SAANA) పూర్వ విద్యార్ధుల సమ్మేళనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంబరాల్లో ఉన్నాయని, అమెరికాలో ఉండే తెలుగు వారంతా సంబరాలకు తరలిరావాలని నాట్స్ సంబరాల కమిటీ పిలుపునిచ్చింది.

సంబరంలో సేవ, సంబరంతో సేవ: శ్రీధర్ అప్పసాని
అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా నాట్స్ సంబరంలో సేవ, సంబరంతో సేవ అనే ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. సంబరాలకు వచ్చే విరాళాల్లో 25 శాతం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తామని, పేదలు, అభాగ్యుల కోసం పని చేసే సేవా సంస్థలకు ఇస్తామని శ్రీధర్ అప్పసాని ప్రకటించారు.

సంబరాలు అంటే కేవలం ఆట, పాటలు మాత్రమే కాదు. సంబరాలతో సేవ కూడా చేయవచ్చని నాట్స్ నిరూపిస్తుందన్నారు. సంబరాల సంతోషాన్ని పంచడంతో పాటు సేవే గమ్యం అనే నాట్స్ నినాదాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్న సంస్థ నాట్స్ అనేది సంబరాలతో మరోసారి రుజువు కాబోతుందని శ్రీధర్ అప్పసాని తెలిపారు. నాట్స్ సంబరాల కోసం సంబరాల కమిటీ చేస్తున్న అవిశ్రాంత కృషిని నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిండెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి అభినందించారు.

సంబరంతో సేవను కూడా మిళితం చేసిన సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానిపై నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు ప్రశంసల వర్షం కురిపించారు. సంబరాల సందర్భంగా జరిగిన టెన్నిస్, వాలీబాల్ విజేతలకు ట్రోఫీలను, నగదు పురస్కారాలను అందచేయనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగమ్మాయి పోటీల్లో మూడు విభాగాల్లో (ముద్దుగుమ్మ, కావ్య నాయకి, కిన్నెరసాని) ఫైనల్స్‌కు చేరుకున్న 15 మంది తెలుగమ్మాయిల మధ్య జరిగే ఆసక్తికర పోటీ కి సర్వం సిద్ధమయ్యిందని ఈవెంట్ జాతీయ కోఆర్డినేటర్ కవిత తోటకూర తెలియచేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected