Connect with us

Education

హ్యూస్టన్‌ విద్యార్ధులలో సృజనాత్మకతను వెలికితీసిన నాట్స్ బాలల సంబరాలు

Published

on

విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ హ్యూస్టన్‌లో ఏప్రిల్ 3న బాలల సంబరాలను నిర్వహించింది. హ్యూస్టన్‌, గ్రేటర్ హ్యూస్టన్ లోని తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్, బాలల సంబరాల కోసం చిన్నారులకు మ్యాథ్స్ ఛాలెంజ్, తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ మరియు తెలుగు పాటల పోటీలు నిర్వహించింది.

నాలుగు విభాగాల్లో దాదాపు 150 మంది పిల్లలు ఇందులో తమ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించారు. అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారికి నాట్స్ బహుమతులు అందజేసింది. దాదాపు 300 మందికి పైగా తెలుగువారు పాల్గొని ఈ బాలల సంబరాలను జయప్రదం చేశారు. తక్కువ సమయంలో తమ పిలుపు అందుకుని మేము సైతం అని తమ సహాయ సహకారాలు అందించిన వాలంటీర్స్‌కు నాట్స్ సహ కోశాధికారి హేమంత్ కొల్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ఐ లెవెల్ లెర్నింగ్ సెంటర్, సిలికాన్ ఆంధ్ర మనబడి వారిని నాట్స్ బోర్డు సభ్యులు సుమిత్ అరిగపూడి అభినందించారు. దాదాపు నెల రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నాట్స్ వాలంటీర్లు విజయవంతం చేశారని నాట్స్ హ్యూస్టన్ కో-ఆర్డినేటర్ వీరూ కంకటాల అన్నారు. “భాషే రమ్యం, సేవే గమ్యం” అనే నాట్స్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో నాట్స్ హ్యూస్టన్ సభ్యులు చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

నాట్స్ హ్యూస్టన్ సాంస్కృతిక విభాగ సభ్యులు శైలజ గ్రంధి, సత్య దీవెన ల ఆధ్వర్యంలో జరిగిన పాటల పోటీలు, తెలుగులో పిల్లల ఉపన్యాసాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాట్స్ బోర్డు సభ్యులు సునీల్ పాలేరు, నాట్స్ సామాజిక మాధ్యమ విభాగాధిపతి శ్రీనివాస్ కాకుమాను, నాట్స్ కోర్ కమిటీ సభ్యులు చంద్ర తెర్లి, విజయ్ దొంతరాజు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తమ వంతు కృషి చేశారు.

హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక కమిటీ (టీసీఏ), తెలంగాణ గ్రేటర్ హౌస్టన్ సంఘం (టీఏజీహెచ్), తెలుగు భవనం సభ్యులు ఈ కార్యక్రమం కోసం తమ సహాయసహకారాలు అందజేసినందుకు నాట్స్ హ్యూస్టన్‌ విభాగం తమ ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపింది. నాట్స్ మినీ సంబరాలు జరుపుకుని వెనువెంటనే అతి తక్కువ వ్యవధి లో చక్కటి బాలల సంబరాలను జరుపుకున్న హ్యూస్టన్ చాప్టర్ లో ప్రతీ ఒక్కరినీ నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని ఫొటోల కొరకు ఈ NRI2NRI.COM లింక్ ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected