Connect with us

Convention

దేవి శ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్ తో నాటా కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association) ‘నాటా’ మూడు రోజుల కన్వెన్షన్ ఆదివారంతో ఘనంగా ముగిసింది. నాటా నాయకుల ఏర్పాట్లకు తగ్గట్టుగానే మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్, రెండవరోజు తమన్ షో ఆహతులను ఆకట్టుకున్నాయి.

అలాగే చివరి రోజైన ఆదివారం, తెలుగు సినీ రాక్ స్టార్ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ తో నాటా కన్వెన్షన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. వీటికి ధీటుగా వివిధ ఎక్సిబిట్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి.

జులై రెండు ఆదివారం ఉదయాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కల్యాణంతో ఆహ్వానితులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. తిరుపతి నుంచి వచ్చిన పండితులు శాస్త్రోక్తంగా శ్రీనివాస కల్యాణం పూర్తి చేశారు. అలాగే 108 మందితో అష్టోత్తరనామార్చన గావించారు. అందరూ ప్రసాదం అందుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల ఆలంనై మీట్స్ వివిధ రూమ్స్ లో నిర్వహించారు. ఎస్టేట్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, DRDO ఛైర్మన్ సతీష్ రెడ్డి తో ముఖాముఖీ, స్టార్ట్అప్స్, పొలిటికల్ డిబేట్స్, సదస్సులు సమాంతరంగా సాగాయి.

అలాగే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో రాముఇజం, తెలుగువారి సొంతమైన అవధానం కూడగలిపిన సాహితీ ప్రక్రియలు, షార్ట్ ఫిలిమ్స్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రపై సదస్సు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

వివిధ నగరాలలో గెలిచిన నాటా బ్యూటీ పాజెంట్ విజేతలకు ఫైనల్స్ పోటీలు దాదాపు రోజంతా కొనసాగాయి. విజేతలకు మెయిన్ స్టేజ్ పై క్రౌన్ అందించారు. ఆర్ట్స్ ప్రదర్శన, సొగసు చూడతరమా అంటూ మహిళా సదస్సు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కూడా జరిగాయి.

సాయంత్రం మెయిన్ స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం 50కే, 100కే మరియు ఆపైన సమర్పించిన స్పాన్సర్స్ ని, నాటా కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను, కన్వెన్షన్ (Convention) వివిధ కమిటీల ఛైర్స్, కో-ఛైర్స్ లను వేదికమీదకు పిలిచి అభినందించారు.

నాటా సర్వీస్ అవార్డ్ ని నాటా మాజీ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసాల కి నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి (Dr. Prem Sagar Reddy) చేతులమీదుగా అందించారు. అనంతరం వైసీపీ పార్టీ (YSR Congress Party) సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ ని వేదిక పైకి ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రికార్డెడ్ మెసేజ్ ని స్క్రీన్ పై ప్రదర్శించారు. నాటా బ్యూటీ పాజెంట్ ఫైనల్స్ విజేతలను ప్రకటించగా టీన్, మిస్, మిసెస్ కేటగిరీస్ లో విజేతలకు తెలుగు సినీ నటి తమన్నా క్రౌన్ అందించారు.

తదనంతరం సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju), దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఇండియా నుంచి విచ్చేసిన ఎంపీలు, మంత్రులకు సన్మానం గావించారు. నాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (NATA Lifetime Achievement Award) ని నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి కి ప్రజంట్ చేయడం విశేషం.

అలాగే నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Sridhar Reddy Korsapati) ని సతీసమేతంగా సన్మానించారు. సుమారు 30 మంది కలిసి చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. చివరిగా రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కాన్సర్ట్ ప్రారంభించారు.

దేవి శ్రీ ప్రసాద్ ట్రూప్ క్లాసికల్ పాటతో మొదలుపెట్టి మంచి బీట్ ఉన్న పాటలతో, అలాగే తన డాన్సులతో వేదిక ప్రాంగణాన్ని అదరగొట్టారు. దీంతో నాటా 3 రోజుల కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు పలికినట్టైంది. నాటా కన్వెన్షన్ ని విజయవంతం చేసినందుకు ఆహూతులకు, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected