Connect with us

Amaravati

గుండెలు పిక్కటిల్లేలా అమరావతికి మద్దతుగా నినదించిన అట్లాంటా వాసులు, హైకింగ్ విజయవంతం

Published

on

. 200 మంది వరకు పాల్గొన్న వైనం
. గుండెలు పిక్కటిల్లేలా అమరావతి నినాదాలు
. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లైవ్లో ఫోన్ ద్వారా అభినందన
. అరసవల్లి పాదయాత్రను లైవ్లో ఫోన్ ద్వారా వివరించిన అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి సభ్యులు
. ముక్తకంఠంతో అన్ని జిల్లాల ప్రవాసుల సంఘీభావం

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేస్తున్న ప్రజా మహా పాదయాత్రకి సంఘీభావంగా అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలో అక్టోబర్ 16న హైకింగ్ ద్వారా సుమారు నాలుగు మైళ్ళు పాదయాత్ర చేశారు. సుమారు 200 మంది పెద్దలు, మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక సానీ మౌంటైన్ (Sawnee Mountain) ఇండియన్ సీట్స్ ట్రైల్ లో అమరావతికి మద్దతుగా మాది ఆంధ్రప్రదేశ్ మా రాజధాని అమరావతి అంటూ నినదించారు. ఈ సందర్భంగా అమరావతి పాదయాత్ర టీ షర్టులు, కండువాలు ధరించారు.

జై అమరావతి జయహో అమరావతి, వన్ స్టేట్ వన్ క్యాపిటల్, బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ గుండెలు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని మారు మ్రోగించారు. ఇండియా నుంచి లైవ్లో ఫోన్ ద్వారా పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఈ రోజు హైకింగ్ లో పాల్గొన్నవారిని అభినందించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించారు, కోర్టు తీర్పులు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉన్నాయన్నారు.

అలాగే అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి (Amaravati Capital Joint Action Committee) సభ్యులు స్వరాజ్యరావు మరియు రామారావు ప్రస్తుతం అరసవల్లి పాదయాత్ర జరుగుతున్న తీరు, సంయమనం పాటిస్తూ తాము పోరాడుతున్న విధానం ఇలా పలు విషయాలపై లైవ్లో ఫోన్ ద్వారా వివరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు, పిల్లలూ పాల్గొనడం గర్వించదగిన విషయం. ఇన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ లేకుండా అమరావతిపై విష ప్రచారం చేయడం రాష్ట్ర అభివృద్ధికి, భావి తరాలకు చాలా నష్టం అంటూ పలువురు ఆవేదన చెందారు.

నాది విశాఖపట్నం నా రాజధాని అమరావతి, నాది అనంతపురం నా రాజధాని అమరావతి, నాది కడప నా రాజధాని అమరావతి, నాది శ్రీకాకుళం నా రాజధాని అమరావతి, నాది తూర్పు గోదావరి జిల్లా నా రాజధాని అమరావతి అంటూ 13 ఉమ్మడి జిల్లాల వాసులు ఈ కార్యక్రమంలో ముక్తకంఠంతో నినదించడం అభినందనీయం.

ఈ రోజు ఈ కార్యక్రమ నిర్వహణ మరియు వేల ఎకరాల భూమిని తృణప్రాయంగా రాష్ట్ర రాజధాని కోసం రికార్డ్ స్థాయిలో ఇచ్చిన అమరావతి రైతులు పడుతున్న కష్టాలను గురించి హేమ మరియు యశ్వంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అందరూ వారిరువురిని అభినందించారు.

అట్లాంటా వాసులు గతంలో అమరావతి రైతులకి మద్దతుగా ర్యాలీ, అలాగే 14 లక్షల 96 వేల 16 రూపాయల ఆర్థిక సహాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు అట్లాంటా (Atlanta) వాసులు అమరావతికి తోడ్పాటు అందిస్తూనే ఉన్నారంటూ అభినందించారు.

సుమారు నాలుగు మైళ్ళ హైకింగ్ అనంతరం ముందు ముందు కూడా అమరావతికి మద్దతుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మాకు కూడా మళ్ళీ తెలియపరచండి అంటూ హైకింగ్ (Hiking) కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected