Dallas, Texas: వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గోపాల్ పోణంగి ఆధ్వర్యలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో ఈ సాహిత్య సంపుటాలను ప్రచురించడానికి సహాయ సహకారాలు అందించిన వారిలో హాజరైన డా. బుచ్చిబాబు పైడిపాటి, శ్రీ చంద్రహాస్ మద్దుకూరి, శ్రీ చంద్రశేఖర్ రెంటచింతల, శ్రీ గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, శ్రీ మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, శ్రీ రామకృష్ణ పొక్కునూరి, శ్రీ రావు కల్వల, డా. సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, శ్రీ విజయసారధి జీడిగుంట, శ్రీ వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు.
వేటూరిగారితో సుదీర్ఘకాలం సాహిత్య ప్రయాణంచేసిన ప్రముఖ సినీగీత రచయిత, దర్శకులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో (Jonnavithula Ramalingeswara Rao) డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thorakura) నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో పాత్రికేయునిగాఉన్న వేటూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR) గారి వత్తిడిమేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చెయ్యడం గురించి మాట్లాడారు.
ఆ తర్వాత సినీపరిశ్రమలో ఒక ముఖ్యభాగం అవడం, కవిపండితులుగా వేటూరి (Veturi Sundararama Murthy) కవితావైభవం, వారి కలంనుంచి అప్రయత్నంగా వేగంగా వెలువడే గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం, ఆయనకున్న తెలుగు భాషాభిమానం, పాత్రికేయునిగా, సంపాదకునిగా ఆయన రచనాశైలి, కేవలం వేలకొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్ హుడ్’, ‘సిరికాకొలను చిన్నది’, ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ లాంటి విశిష్ట రచనలు, వేటూరి వారి జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలు ఇంకా వివిధ అంశాలపై ప్రసాద్ తోటకూర జొన్నవిత్తుల గార్ల మధ్య దాదాపు గంటసేపు సాగిన చర్చా కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయించి మంచి ప్రేక్షాకాదరణ పొందింది.
విశిష్టఅతిథిగా హాజరైన ఈనాడు (Eenadu) దినపత్రిక సంపాదకులు శ్రీ ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “వేటూరి వారు వ్రాసిన పాటలలో గొప్ప పాటలు ఏవి? ఆని ChatGPT ని అడిగితే – వారు వ్రాసిన వేలాది పాటలలలో కొన్ని గొప్ప పాటలను ఎంపిక చెయ్యడం కష్టం అనే సమాధానం వచ్చింది. దాన్నిబట్టి వేటూరి ప్రతిభ ఏమిటో మనం అర్ధం చేసుకోవచ్చు అన్నారు.
18 సంవత్సరాల పాటు పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి (Veturi Sundararama Murthy) వారిని ఈనాడు జర్నలిజం స్కూల్ కు ఆహ్వానించి అక్కడి విద్యార్థులతో మాట్లాడించే అవకాశం కల్గిందని, ఆయన జ్ఞాపకశక్తి అమోఘమని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రును ఇంటర్వూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ వేటూరి అని, ప్రేమ, విరహం, భక్తి, తాత్వికత, శృంగారం, వేదన, ప్రకృతి, సామాజిక చైతన్యం ఇలా ఏ రకపు పాటనైనా అక్షరాలలో ఆవిష్కరించగల దిట్ట అని, “రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే” అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సాహిత్యం జ్ఞానపీఠ పురస్కారానికి నూటికి నూరు శాతం అర్హనీయమైనదన్నారు.
వేటూరి పాటలు తెలుగుభాష ఉన్నంతవరకు చిరస్థాయిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి అంటూ ఘన నివాళులర్పించారు. ప్రత్యేకఅతిథిగా హాజరైన వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ “డా. ప్రసాద్ తోటకూర గారి నిర్వహణలో గత జనవరిలో హైదరాబాద్ లో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Muppavarapu Venkaiah Naidu) గారి చేతులమీదుగా కన్నుల పండుగగా జరిగిన ఈ గ్రంధాల ఆవిష్కరణ సభలోను, మరలా ఇప్పడు ఇక్కడ డాలస్ లో అత్యంత వైభవంగా జరిగినసభ రెండింటిలోనూ పాల్గొనడం తన అదృష్టం అన్నారు”.
ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ సంగీతగురు డా. కొమండూరి రామాచారి వేటూరి (Veturi Sundararama Murthy) వారితో తనకున్న అనుభందాన్ని, వారి గీత రచనా శైలిని ప్రశంసిస్తూ, కొన్ని పల్లవులను మధురంగా గానంచేసి వేటూరికి స్వరనీరాజనాలర్పించారు. ప్రముఖ గాయకులు, సంగీతదర్శకులు శ్రీ రాజశేఖర్ సూరిభొట్ల నిర్వహణలో సాగిన సంగీత విభావరిలో స్థానిక గాయనీ గాయకులు సంతోష్ ఖమ్మంఖర్, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, జానకి శంకర్, శ్రేయస్ సూరిభొట్ల, సాహితి కోటంరాజు లు పాడిన పాటలు అందరినీ అలరించాయి.
రాజశేఖర్ కీబోర్డ్ పైన, ముద్దు పాయ్ కీబోర్డు మరియు గిటార్ పైన, రాం యామిజాల, నీవ్ యామిజాలలు పెర్కషన్ వాయిద్యాల పైన, సౌండ్ ఇంజనీర్ గా రవి మాచ, రవి రావు భట్టిప్రోలు అందించిన సాంకేతిక సహకారం ఈ సంగీత విభావరికి మరింత శోభను చేకూర్చాయి. వేటూరి (Veturi Sundararama Murthy) వ్రాసిన అసంఖ్యాక అద్బుత గీతాలలో ఒక పద్నాలుగు పాటలను ఈ సంగీత విభావరిలో గానంచేశారు. వాటిలో “ఓం నమః శివాయ” (సాగర సంగమం) అనే గీతానికి గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ గురు మంజు హేమమాలిని చావ శిష్యులు దేవినేని వైడూర్య, సాహితి వేముల, సింధు వేముల, తేజశ్రీ అబ్బూరు అద్భుతంగా నృత్యం చేశారు.
“జగతి సిగలో జాబిలమ్మకు” (పరదేశి) గీతానికి రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ & యోగా గురు సింధుజ ఘట్టమనేని శిష్యులు గ్రీష్మా అశోక్, నందిత దినేష్, సహస్ర తటవర్తి, రుషిక కాళ్ళ లు చేసిన నృత్యం కనువిందు చేసింది. “నెమలికి నేర్పిన నడకలివి” (సప్తపది) అనే పాటకు నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీలత సూరి శిష్యులు ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, స్వప్నిక వడాలి, అంజిత నాయర్ ల నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత “మధుర మధురతర” (అర్జున్) అనే గీతానికి సాయి నృత్య అకాడమీ కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీదేవి యడ్లపాటి శిష్యులు పల్లవి తూములూరు, సంజన కల్వకొలను ల నృత్యం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకఅతిథులగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబెర్ మాట్ షాహీన్, ఫ్రిస్కో నగర మేయర్ (Mayor) మార్క్ హిల్, కౌన్సిల్ మెంబెర్ యాన్ యాన్దర్సన్ లను గోపాల్ పోణంగి (Gopal Ponangi), డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు.
ఇదే కార్యక్రమంలో ఇటీవల కొలంబియా దేశంలో 8 సంవత్సరాల వయస్సులోపు పిల్లకు జరిగిన చదరంగం (Chess) పోటీలలో అమెరికానుండి పాల్గొని, పాన్ అమెరికన్ చాంపియన్ గా నిలిచి బంగారు పతకం సాధించిన సరయు తలపనేని ని టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబెర్ మాట్ షాహీన్ ఘనంగా సత్కరించి సరయ తల్లిదండ్రులు సందీప్, శ్రీలక్ష్మిలను అభినందించారు.
ఈ కార్యక్రమం మొత్తాన్ని MC లు గా అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించిన అనీషా పోణంగి, అభినుత మద్దుకూరి లకు, కార్యక్రమ విజయానికి తోడ్పడిన శుభం ఫౌండేషన్ కార్యవర్గసభ్యులకు, కార్యకర్తలు కిశోర్ నారె (Kishore Nare), పావని నున్న, నాగరాజు నలజల (Nagaraju Nalajala), నేలకొండ రాజు, పద్మ ముప్పిడి, శాస్త్రి అనిపిండి లకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, స్కూల్ యాజమాన్యానికి గోపాల్ పోణంగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.