Johns Creek, Atlanta, Georgia: అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) లో సహాయం చేస్తున్న డాక్టర్స్ కి అభినందన కార్యక్రమం ఫిబ్రవరి 22 ఆదివారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తామా ఫ్రీ క్లినిక్ డాక్టర్స్, వాలంటీర్స్, స్థానిక ప్రభుత్వ అధికారులు, తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
జాన్స్ క్రీక్ (Johns Creek, Georgia) లోని సంక్రాంతి రెస్టారెంట్ (Sankranti Restaurant) ఈవెంట్ హాల్ ఈ కార్యక్రమానికి వేదికైంది. తామా బోర్డు ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) అందరికీ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తామా (Telugu Association of Metro Atlanta – TAMA) ఫ్రీ క్లినిక్ కోఆర్డినేటర్ నగేష్ దొడ్డాక (Nagesh Doddaka) మరియు కమ్యూనిటీ సర్వీసెస్ సెక్రటరీ శ్రీనివాస్ రామనాధం (Srinivas Ramanadham) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తామా ఫ్రీ క్లినిక్ సేవలను వివరించారు.
అనంతరం ప్రతి ఒక్క డాక్టర్ ని వేదిక మీదకు ఆహ్వానించి స్థానిక ప్రభుత్వ అధికారుల చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ.. తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) సేవలను కొనియాడారు. అలాగే తామా 45 సంవత్సరాల సేవలను అభినందించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ నిర్వహించే సాంస్కృతిక, సాహిత్య, విద్య, సేవాకార్యక్రమాలు ఒక ఎత్తైతే, తామా ఫ్రీ క్లినిక్ మరొక ఎత్తు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (Georgia Department of Public Health – GADPH) అప్రూవల్ అండ్ లయబిలిటీతో నిర్వహిస్తున్న ఈ ఉచిత క్లినిక్ కి మూలస్తంభాలు డాక్టర్స్ మరియు వాలంటీర్స్ అంటూ ఆహ్వానితులు కొనియాడారు.
అట్లాంటా (Atlanta) తెలుగు సంఘం ‘తామా’ ఈ ఉచిత క్లినిక్ ని 2012 లో ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా కొనసాగించడాన్ని, ప్రత్యేకంగా కోవిడ్ (COVID-19) సమయంలో చేసిన సహాయాన్ని అభినందించారు.
ముఖ్యంగా ఇండియా (India) నుంచి తమ పిల్లలను చూద్దామని వచ్చే తల్లితండ్రులకు తామా ఫ్రీ క్లినిక్ ఒక సంజీవని లాంటిదని అన్నారు. ఇంకా వాలంటీర్స్ (Volunteers) మరియు డాక్టర్స్ (Doctors) కావాలని, తెలిసినవారు లేదా ఇంట్రెస్ట్ ఉన్నవారు తామా కార్యవర్గ సభ్యులను లేదా బోర్డు సభ్యులను సంప్రదించవలసిందిగా తామా అధ్యక్షులు సునీత పొట్నూరు (Suneetha Potnuru) కోరారు.
స్థానిక ప్రభుత్వ అధికారులను శాలువాతో ఘనంగా సత్కరించారు. అందరూ సందడిగా ఫోటోలు దిగారు. చివరిగా వందన సమర్పణతో అట్లాంటా (Atlanta, Georgia) తెలుగు సంఘం ‘తామా’ ఫ్రీ క్లినిక్ డాక్టర్స్ అప్ప్రీసియేషన్ డిన్నర్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.