Connect with us

Associations

14 ఏళ్ళ తానా సేవానుభందంతో ఫౌండేషన్ ఛైర్మన్ స్థాయికి యార్లగడ్డ వెంకట రమణ

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ గా 2021-23 కాలానికి యార్లగడ్డ వెంకట రమణ ఎన్నికయ్యారు. నిన్న జరిగిన మీటింగులో తానా ఫౌండేషన్ సభ్యులు యార్లగడ్డ వెంకట రమణ ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక గత 20 రోజులుగా నానుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో యార్లగడ్డ అటు పాత ఇటు కొత్త ఫౌండేషన్ సభ్యులతో చాకచక్యంగా వ్యవహరించి ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు.

యార్లగడ్డ నేపధ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా రేపల్లె మండలం వెనిగళ్లవారిపాలెంకు చెందిన యార్లగడ్డ 1988 లో రత్నకుమారితో వివాహం అనంతరం 2001 లో అమెరికా వచ్చారు. మొదట చికాగోలో ఉన్న యార్లగడ్డ ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ బోర్డు డైరెక్టర్ గా సేవలందించారు. వృత్తి రీత్యా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తూ, ప్రస్తుతం మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని మేడిసన్‌ నగరంలో స్థిరపడ్డారు. యార్లగడ్డ కి ఇద్దరు పిల్లలు, శశాంక్ మరియు చైతన్య. ఇద్దరూ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన తానా ఎన్నికలలో తర్వాతి తరం శశాంక్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గా విజయదుందుభి మ్రోగించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందారు.

ప్రాంతీయ ప్రతినిధి నుంచి ఫౌండేషన్ ఛైర్మన్ స్థాయికి

2005 లో తానా సభ్యత్వం తీసుకున్న యార్లగడ్డ 2007 నుంచి 2009 వరకు మిడ్వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధిగా, 2009 నుంచి 2013 వరకు ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్న యార్లగడ్డ 2009-11 కాలానికి ఫౌండేషన్ సెక్రెటరీగా సేవలందించారు. ఈ సమయంలోనే తానా ఫౌండేషన్ ఇండియా విభాగం ఏర్పడడం విశేషం. ఇందులో భాగంగా 2011 నుండి ఇప్పటివరకు కూడా ఇండియా విభాగం ఫౌండింగ్ ట్రస్టీగా సేవాకార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నారు. 2013 నుంచి 2019 వరకు మాతృభూమిలో చేపట్టిన కంటి శిబిరాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ అమెరికాలో బ్యాక్ ప్యాక్ డిస్ట్రిబ్యూషన్ తదితర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. కోవిడ్ టైంలో ఇండియాలో ఉన్న యార్లగడ్డ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. 2009 లో మిడ్వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధిగా చికాగోలో జరిగిన తానా మహాసభలలో చురుకైన పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగిన యార్లగడ్డ 2019-23 కాలానికి మళ్ళీ ఫౌండేషన్ ట్రస్టీగా ఎన్నికై ఈ వచ్చే రెండేళ్లకు ఫౌండేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఎన్నారై2ఎన్నారై.కామ్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ

తెలుగువారి గుండెచప్పుడు అయిన తానా కి ఫౌండేషన్ ఛైర్మన్ గా ఎన్నికవడం ఆనందంగా ఉందని అన్నారు. తన అనుభవాన్నంతటినీ ఉపయోగించి ఇటు అమెరికా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫౌండేషన్ కార్యక్రమాలను విస్తృతంగా నలుమూలలకి తీసుకెళ్తానని, ఫౌండేషన్ కార్యక్రమాలను మరింత పటిష్టం చేస్తానని అన్నారు. తన సేవాదృక్పధానికి వెన్నంటి ఉండి తమ సహాయసహకారాలను అందిస్తున్న భార్యాపిల్లలను కొనియాడారు. అలాగే తన సేవలను గుర్తించి తనమీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఫౌండేషన్ ఛైర్మన్ గా ఎన్నుకున్నందుకు సహచర ట్రస్టీ సభ్యులకు, అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మిత్రులు, శ్రేయోభిలాషులు, సోదరీమణులు ఇలా ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతఘ్నతలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected