Connect with us

Arts

Dallas, Texas: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’ కి సన్మానం – TANTEX, TANA

Published

on

డాలస్, టెక్సస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’  “విశ్వ విజయోత్సవ సభ” సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, సంగీత సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.

తానా కౌన్సిలర్-ఎట్-లార్జ్ ప్రతినిధి లోకేష్ నాయుడు సభ్యులు అందరికి స్వాగతం పలికి, సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలియజేసి,  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’ గారికి అభినందనలు తెలిపి సభను ప్రారంభించారు.

తానా కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ, కళాశాల ప్రారంభం నుంచి ఎంతోమంది నృత్య కళాకారులకు, కూచిపూడి నృత్యంలో పట్టభద్రులు అవ్వడానికి సహకారం అందించడంతో పాటు మన్ముందు ఆసక్తి గల విద్యార్థులకు ప్రోత్సాహం వుంటుంది అని అన్నారు. సంగీత గురువులు అయిన సమీరా శ్రీపాద “విఘ్నేశ్వర స్తుతి” ప్రార్ధనా గీతం తో సభను ప్రారంభించారు.

తానా తెలుగు భాషా పరివ్యాప్తి కమిటి చైర్మన్ చినసత్యం వీర్నపు స్వరవీణాపాణితో వున్న అనుబందాన్ని గుర్తు చేసి, 2018 వ సంవత్సరంలో వారితో ‘సప్తస్వర అష్టావధానం’ నిర్వహించడానికి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపి, డా. ప్రసాద్ తోటకూరను సాదరంగా వేదిక మీదికి ఆహ్వానించారు.

డాక్టర్ తోటకూర మాట్లాడుతూ ముందుగా భారత తెలుగు సినిమా పాటకు ఆస్కారు అవార్డు రావడం భారతీయులు అందరికీ గర్వకారణం అనీ, గీత రచయిత, సంగీత దర్శకుడు, చిత్ర దర్శకులు, నిర్మాత, నృత్య దర్శకులకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మనమధ్యలో నాకు అత్యంత సన్నిహిత మిత్రులు 2013 నుంచి పరిచయమై, ఎన్నో చలనచిత్రాలకు సంగీత దర్శకులుగా, గీత రచయితగా అద్భుతాలు సృష్టించి, అత్యంత ప్రతిభతో, అత్యంత తక్కవ సమయంలో 72 మేళకర్త రాగాల స్వరూపం మొత్తాన్ని ఒక సంక్షిప్త కీర్తనలో పొందుపరచి, 61 గంటలపైగా పాడి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును సొంతం చేసుకున్న స్వరవీణాపాణిని సభకు పరిచయం చేసి, కరతాళ ధ్వనులమధ్య వేదిక పైకి ఆహ్వానించారు.  వీణాపాణి గిన్నీస్ రికార్డు అందుకోవడం, తెలుగు జాతికి గర్వకారణం అని, సంగీత ప్రపంచం మొత్తం 72 మేళకర్త రాగాలలోనే నిబిడీకృతమై ఉంటుందని గుర్తు చేశారు.

ముఖ్య అతిథి స్వర వీణాపాణి గారు మాట్లాడుతూ.. తనకు డా. ప్రసాద్ తోటకూర ని  తనికెళ్ళ భరణి పరిచయం చేశారని, తరువాత వారితో అనుబంధం జీవితంలో మరువలేనిది అని అన్నారు. అలాగే వెన్నం ఫౌండేషన్ అధినేత మురళీ వెన్నం, డా. ప్రసాద్ తోటకూర కలసి తనకు వారు ఇచ్చిన  ప్రోత్సాహం, ఆదరాభిమానాలు తనను ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును అందుకునే వరకు కొనసాగాయని అన్నారు.

వారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత గా వారి ప్రస్థానం, అనుభవాలను సంగీత, సాహిత్య ప్రియులతో పంచుకొని, అందరి ఆదరాభిమానాలను పొందారు. తరువాత ‘లండన్ లో గిన్నిస్ రికార్డ్‌ల పర్యవేక్షణ అధికారిక బృందం దగ్గర ఆలపించిన ‘స్వర గాంధీజీ -72 మేళకర్తాల’ రాగాలను  మరియు స్వర కామాక్షి, స్వర బీజాక్షి కీర్తనలను వీనుల విందుగా ఆలపిస్తూ, తన సంగీత ప్రతిభతో అందరినీ మంత్రముగ్దులను చేశారు. వారికి తబలా సహకార వాయిద్యాన్ని అందించిన శ్రీనివాస్ ఇయ్యున్నినీ ప్రత్యేకంగాఅభినందించారు.

తరువాత డా. ప్రసాద్ తోటకూర మరియు మురళీ వెన్నం చేతులు మీదుగా వారికి కృతజ్ఞతగా పూర్వక అభిమానంతో మరియొక సారి తను లండన్‌లో అందుకున్న ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును అందుకున్నారు. తానా మరియు టాంటెక్స్ అధికార బృందం స్వరవీణాపాణి గారిని శాలువ మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

వీణాపాణి సభలో వున్న తన గురువర్యులు అయిన డా. జయకృష్ణ బాపూజీ జంధ్యాల గారికి పాదాభివందనం చేసి వారి దీవెనలు అందుకున్నారు. బాపూజీ జంధ్యాల తన శిష్యులు అయిన వీణాపాణిపై చక్కటి కవితను రాసి అందరికీ వినిపించి వారి ఎదుగుదలను కొనియాడారు.

లోకేష్ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. భానుమతి ఇవటూరి, లక్ష్మి పాలేటి, శరత్ యర్రం (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల, సుందరరావు బీరం, బాపూజీ జంధ్యాల మొదలైన పురప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు, హాలు ఇచ్చిన మైత్రి రెస్టారెంట్ వారిని, వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు మురళీ వెన్నం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected