Connect with us

Language

తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర అతిథిగా తెలుగు భాషా దినోత్సవం @ Guntur Women’s College

Published

on

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో గిడుగురామ మూర్తి పంతులు గారి 160వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రత్యేక అతిథిగా హాజరైన‌ “తానా” పూర్వపు అధ్యక్షులు, ప్రస్తుత “తానా భాష, సాహిత్య, సాంస్కృతిక విభాగం నిర్వాహకులు ప్రవాసాంధ్రులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తెలుగు భాషవల్ల ఉపయోగ మేమిటన్నవితండ వాదాన్ని తిప్పికొట్టి, మన మాతృ భాషను ఆదరించాలని పిలుపునిచ్చారు.

మాతృభాష పట్ల అవగాహనరక్తిని, అనురక్తి,ఆసక్తిని ఇనుమడింపజేయాలి. అది తొలుత మన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. చంద్రయాన్ రూపకర్తల్లో తెలుగు మూలాలున్న శాస్త్రజ్ఞులు కూడా వున్నారు. తెలుగు మీడియంలోచదువుకొన్న వారూ వున్నారు. కలామ్, సత్యనాదెండ్ల లాంటి ప్రముఖులు కూడా తమ మాతృబాషలో చదువుకున్నవారే అన్నారు.‌ తెలుగు చదువుకుంటే లాభం లేదన్న అపోహ కలిగిస్తున్నారు. నిజానికిది తప్పు. ఇంగ్లీషులో చదువుకుంటేనే గొప్ప వారవుతారన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. చిత్రమేమంటే.‌. మన తెలుగవారే ఈ రకమైన అపోహలు కలిగిస్తుండటం దురదృష్టకరమన్నారు.

పండితులకు మాత్రమే పరిమితమైన పండిత భాషను వాడుకభాషగా ప్రజలవద్దకు చేర్చిన భాషా సంస్కర్త ‘గిడుగు రామ మూర్తి’ అన్నారు. ఓ సామాన్య కుటుంబంనుంచి వచ్చిన గిడుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్థానిక భాషల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రచారం చేశారన్నారు. సవర భాషకు వ్యాకరణాన్ని రచించి, ఆ భాషకు పునర్జన్మ కలిగించారన్నారు. అలాగే శాసనాలను పరిష్కరించి, తెలుగు, భాషా సాహిత్యాలకు విశేషమైన కృషిచేశారని చెప్పారు. తెలుగువారి కోసం, తెలుగుభాష కోసం ఆయన నిరంతరం పాటుపడ్డారని చెప్పారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు తెలుగును‌ మరిచి పోకుండా అక్కడ పాఠశాలను ఏర్పాటు‌ చేసి, పిల్లలకు భాషా, సాహిత్యాలు, కళ, సంస్కృతిని నేర్పుతున్నట్లు చెప్పారు‌ ప్రసాద్ తోటకూర.

డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..‌”నేను ఫలానా కులం వాడ్ని, నేను ఫలానా మతం వాడ్ని, నేను ఫలానా ప్రాంతం వాడ్నిఅని చెప్పుకునే కంటే ఫలానా భాష వాడ్నిఅనే చెప్పుకుంటే గౌరవమన్నారు.‌ భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనే అత్యంత సంగీతాత్మకమైన (లిరికల్) భాష మన తెలుగుభాష. మాట్లాడే విధానంలో, తెలిసిమాట్లాడాలే కానీ, ఒకానొక లయాత్మకమైన కాకువు తెలుగు భాషలోనే బోధ పడుతుంది. అందుకే తెలుగురాని వాగ్గేయకారులు సైతం తెలుగు నేర్చుకొని, తెలుగులో వాగ్గేయ రచన చేశారని తెలిపారు.

కళాశాల లెక్చరర్ పివిజయలక్ష్మి గారు సభకు స్వాగతం పలికారు. అమ్మను ఎంతగా ప్రేమిస్తే అమ్మభాషను కూడా ప్రేమించాలన్నారు. తెలుగు చదువుకుంటే ఏమొస్తొందని ఈమధ్య చాలామంది అడుగుతున్నారు. తెలుగు చదువు కుంటే బతకడం నేర్పిస్తుందని ఆమె అన్నారు. అమ్మలానే అమ్మభాషనూ మనందరం ప్రేమించాలన్నారు.‌

దీప ప్రజ్వలనం, ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది.‌ విద్యార్థినులు ప్రార్ధనాగీతం ఆలపించారు. శంకరంబాండి రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతాన్ని విద్యార్ధినులు శ్రుతిమధురంగా పాడారు. సభకు వుమెన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిడుగు రామ మూర్తి వాడుక భాషను వేడుక చేశారు. ప్రజల భాషలో రచనలు చేయడానికి‌ కృషిచేశారన్నారు. గిరిజన భాష సవర భాషకు వ్యాకరణం తెచ్చి స్థానిక భాషకు పెద్దపీట వేశారన్నారు.

ఉమెన్స్ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్.వి.భవాని గారు తెలుగు భాష ప్రాభవాన్ని, అవసరాన్ని వివరించారు. అతిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సాహితీ విమర్శకుడు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ‌.. నిజంగా ఈరోజు‌పండగ దినం, గిడుగు జయంతి తెలుగు భాషోత్సవం కావడం ముదావహమన్నారు. ఇంగ్లీషు చదువుకుంటేనే గొప్పవారమవుతారన్న భ్రమలు వీడి, కనీసం ప్రాధమిక మాధ్యమం వరకైనా తెలుగులో చదువుకోవాలన్నారు‌‌. ఈరోజు గొప్పవాళ్ళలో చాలామంది మాతృభాషలో చదువుకున్న వారేనన్నారు.‌

డాక్టర్ ఎస్‌.జదివిజా దేవి బహుమతి ప్రదానం చేశారు. కళాశాల లెక్చరర్ డా.డి.ధాత్రికుమారి, డా.ఎస్.విజయలక్ష్మి అతిథులను సభకు పరిచయం చేశారు. తెలుగు భాషోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర సాహితీ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected