Connect with us

People

తారకరాముని రాజకీయ ప్రవేశం, పరిపాలన, కీలక అంశాలు; డాక్టర్ వాసు గోరంట్ల ప్రత్యక్ష పరిశీలన

Published

on

మన తెలుగు జాతి గౌరవాన్ని భారతదేశమంతటా చాటి చెప్పిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పౌరాణిక నటబ్రహ్మ, పద్మశ్రీ  డాక్టర్ నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి సందర్భంగా, అన్నగారి రాజకీయ సంస్కరణలను ప్రత్యక్షంగా పరిశీలించిన నా అనుభవంతో ఈ విషయాలను తెలుగు ప్రజల దృష్టికి తెలియజేస్తున్నారు డాక్టర్ వాసు గోరంట్ల.

అన్న తారకరాముని రాజకీయ ప్రవేశం సమయంలో చెప్పిన మాటలు:-

మీరు రాజకీయప్రవేశం ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్నకు అన్నగారి సమాధానం:-  ఒక సామాన్య రైతు కుటుంబం లో పుట్టిన, ఒక సాధారణ వ్యక్తి ని నేను. అలాంటి సామాన్యుడినైన నన్ను చలన చిత్రరంగంలో ఉన్నత శిఖరాన నిలబెట్టి, నన్ను ఆదరించి, ఎంతో అభిమానించి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు లాంటి అవతారపురుషులను నాలో చూచుకొని, నాకు  దైవత్వాన్ని ఆపాదించిన, నా తెలుగు ప్రజలకు సేవ చెయ్యాలని, నా మిగిలిన జీవితాన్ని తెలుగు ప్రజల సేవకు అంకితం చెయ్యాలనే తలంపుతో రాజకీయప్రవేశం చేస్తున్నాని చెప్పారు.

మీకు అసలు రాజకీయ అనుభవమే లేదు, మీరు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించి ప్రజలకు సేవ చేస్తారని అన్న ప్రశ్నకు:- నేను సుమారు 300 చిత్రాలలో నటించాను. కొన్ని వందల రకాల పాత్రలను పోషించాను. సమాజం లో ఉన్న అన్ని రకాల పాత్రలను పోషించాను. నేను సినిమా లో ఏదైనా పాత్రలో నటించే ముందు సమాజం లో, ఆ పాత్రలకు సంబందించిన వారి వృత్తుల ప్రాధాన్యత, వారి జీవన విధానం, ఆర్ధిక స్థితిగతులు, సమాజం లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా అధ్యయనం చేస్తాను. అందువలన సమాజంలో ఉన్న అన్ని వర్గాలవారి సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ అనుభవం చాలు ప్రజాసేవ చెయ్యటానికి అని చెప్పారు.

రాజకీయమంటే (Politics) వ్యాపారం కాదు, సమాజసేవ. సామాన్య మానవుడికి తినటానికి తిండి, ఉండటానికి ఉనికి, కట్టటానికి బట్ట కల్పించటమే రాజకీయం.ఆ ఉద్దేశ్యంతోనే పేదప్రజలకు 2 రూపాయలకు కిలో బియ్యం, నివాసం లేని పేద వర్గాలవారికి ఉచితంగా పక్కా ఇళ్ల నిర్మాణం, 50 శాతం ధరకే ప్రజలకు జనతా వస్త్రాలు, ధోవతులు అందచేయటం జరిగింది.

అన్న తారకరాముని రాజకీయ పరిపాలనలో లో కీలక అంశాలు:-

ఎన్టీఆర్ రాజకీయం, అప్పటి సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు అత్యంత నిరాడంబరంగా జరిగేవి.

Dr. Vasu Gorantla

ఫిరాయింపులకు, పార్టీ వలసలను ప్రోత్సహించడానికి అన్నగారు పూర్తిగా వ్యతిరేకం:- ఎవరైనా మా విధానాలు నచ్చి, ప్రజాసేవ చెయ్యటానికి మాతో కలిసి పనిచేయటం ఇష్టం ఉండి, మా పార్టీలోకి రావాలనుకుంటే ముందు గా, మీరు ఉన్న పార్టీలో మీకు ఉన్న అన్ని పార్టీ పదవులకు, ఆ పార్టీ ద్వారా మీకు వచ్చిన అన్ని ప్రభుత్వపదవులకు రాజీనామా చేస్తేనే, మా పార్టీలోకి ఆహ్వానిస్తాం అని చెప్పేవారు NTR.

1994 లో అధికారకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దీ నిముషాల వ్యవధిలోనే మద్యపాన నిషేధం మీద తొలిసంతకం చేసిన ఘనత అన్న తారకరాముని స్వంతం. అన్నగారి సమయంలో అత్యంత సాధారణ వ్యక్తులు కూడా రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి నాయకులుగా అన్నగారి నాయకత్వంలో ఎదగటం జరిగింది. ఆనాడు  ఎన్నికలలో అభ్యర్థులకు ఎన్నికల పెట్టుబడి ఏమిటంటే అన్నగారితో కలిసి ఒక ఫోటో దిగటం, ఆ ఫోటోనే ఎన్నికల ప్రచారంలో ఉపయోగించటం.

అన్నగారి పరిపాలనలో జరిగిన కొన్ని విప్లవాత్మక సంస్కరణలు:

ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో డొనేషన్ విధానాన్ని రద్దుచేయటం జరిగింది. మహిళలకు 30 శాతం కేటాయించటం వలన మన తెలుగింటి ఆడపడుచులు నేడు దేశ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ అన్నిరంగాలలో ముందంజలో ఉన్నారు. 1984 లోనే అన్నగారు డిజిటల్ తరగతుల ప్రాధాన్యత గురించి చెప్పటం జరిగింది. విద్యార్థులకు కష్టమైన, క్లిష్టమైన పాఠ్యంశాలు సులభంగా అవగాహన చేసుకోవటానికి దృశ్య శ్రవణ విద్యావిధానం ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. నేను 90 వ దశకం లో ఇంజనీరింగ్ విద్యావిధానంలో అవసరమైన సంస్కరణలు అన్న అంశం పై సమర్పించిన పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా పాత్రలలో డిజిటల్ తరగతుల ప్రాధాన్యత గురించి రాయటం జరిగింది.

క్రమశిక్షణకు మారుపేరు అన్నగారు: అన్నగారు 80 వ దశకం లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర పర్యటనలో రాత్రి బస విశాఖపట్నం. అన్నగారు 1 .30 కే నిద్రలేచి  కాలకృత్యాలు ముగించుకుని వేకువజామున  2 గంటల నుండి  పార్టీ నాయకులను అభిమానులను చూసేవారు. నేను అన్నగారు ఉన్నరాంధ్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఎప్పుడూ వేకువజామున 2  నుండి 2 30 మధ్యకాలం లోనే అన్నగారిని కలిసేవాడిని.

నిత్యం అన్నగారిని రాజకీయంగా వ్యతిరేకించిన ఆనాటి రాజకీయనాయకులందరూ కూడా రాజకీయాలలో అవినీతి మచ్చలేని నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పటం జరిగింది. అన్నగారి మీద ఉన్న అభిమానంతో నేను ఇంజనీరింగ్ లో చేసిన పరిశోధనలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం నాకు అందజేసిన పి.హెచ్. డి ని అన్న తారకరామునికి అంకితం చేయటం జరిగింది.

చరిత మరువని నేత ఎన్టీఆర్: మన తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన నేత అన్న తారకరాముడు.

డాక్టర్ వాసు గోరంట్ల

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected