Connect with us

Birthday Celebrations

కాలిఫోర్నియాలో వైవిధ్యంగా డా. హనిమిరెడ్డి 80వ జన్మదిన వేడుకలు, ‘సిలికానాంధ్ర శ్రీకర’ బిరుదు ప్రదానం

Published

on

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం డా. లకిరెడ్డి హనిమిరెడ్డి (Dr. Lakireddy Hanimireddy) 80వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ జనరల్ (Indian Consulate General) గౌరవనీయులు డా. టి . వి. నాగేంద్రప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరై డా. హనిమిరెడ్డి గారు చేసిన, చేస్తున్న ప్రజోపకరమైన కార్యక్రమాలు, వారి వితరణ ప్రవాస భారతీయులందరికీ ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఒక భారతీయుడిగానే కాకుండా, సాటి తెలుగువాడిగా కూడా తనకెంతో గర్వంగా ఉన్నదని, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియచేశారు.

ఉదయం సిలికానాంధ్ర (Silicon Andhra) కార్యవర్గం డా. హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను వారి విడిది నుంచి గుఱ్ఱపు బగ్గీలో విశ్వవిద్యాలయానికి వేడుకగా తీసుకురాగా, అక్కడనించి పల్లకీలో, పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా భవనంలోకి తీసుకువచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధిపతి డా. కూచిభొట్ల ఆనంద్, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ చమర్తి రాజు వారిని సాదరంగా భవనంలోకి ఆహ్వానించారు.

భారత కాన్సులేట్ జనరల్ డా. టి . వి. నాగేంద్రప్రసాద్, డా. హనిమిరెడ్డి గారి విగ్రహాన్నీ, లోహ ఫలకాన్ని ఆవిష్కరించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ సరిగ్గా 6 సంవత్సారాల క్రితం ఇదే రోజున విశ్వవిద్యాలయ భవనం గృహప్రవేశం జరిగిందని, డా. హనిమిరెడ్డి గారి దాతృత్వం వల్లనే ఆ రోజున ఈ భవనం కొనుగోలు సాధ్యపడిందని సభికులకు గుర్తు చేశారు.

తొలుత సభ వేదపండితుల వేదాశీర్వచనాలతో ప్రారంభమయ్యింది. లివర్ మోర్ లోని శివ విష్ణు దేవాలయ ప్రధాన అర్చకస్వామి, మిల్ పిటాస్ లోని సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు తమ, తమ దేవాలయాలకు డా.హనిమిరెడ్డి కుటుంబం చేసిన సేవలను కొనియాడారు. ఆ తరువాత కుమారి. తనుగుల ఈష ప్రార్ధనా గీతం పాడగా, కుమారి. అయ్యగారి అనఘ వయలిన్ వాద్య కచేరి చేసింది.

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు మాధవపెద్ది మూర్తి గారు చేసిన నృత్యం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం డా.హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను వేదిక మీదకు ఆహ్వానించి, వారికి ఘనసన్మానం చేసి, డా.హనిమిరెడ్డి గారికి “సిలికానాంధ్ర శ్రీకర” అనే బిరుదు ప్రదానం చేశారు. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేకంగా చేయించిన కేక్ కోయించి, సభికులందరికీ అందజేశారు.

కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికైన కాంగ్రెస్ మాన్ రో ఖన్నా, కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా, కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ సభ్యుడు డేవ్ కార్టజ్ లు వారికి తమ కార్యాలయాల ద్వారా శుభాకాంక్షలు మరియు వారి దాతృత్వానికి ప్రశంసాపత్రాలు పంపారు. అలానే సభకు హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డా. రఘునాథ్ రెడ్డి, కిరణ్ ప్రభ, కొండిపర్తి దిలీప్ ప్రభృతులు వారితో తమ అనుబంధాన్ని పంచుకుంటూ వారి నుంచి ముఖ్యంగా అందరూ నేర్చుకోవాల్సినది సమాజం పట్ల బాధ్యత, వితరణశీలత అని పేర్కొన్నారు.

డా.హనిమిరెడ్డి గారికి మరెందరో పుర ప్రముఖులు స్వయంగా, మరియు సందేశాలు పంపి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సిలికానాంధ్ర కార్యకర్తలు వారి కుటుంబసభ్యుల సహకారంతో సేకరించిన చిత్రాలతో, వీడియోలతో డా. హనిమిరెడ్డి గారి 80 ఏళ్ళ జీవన యానంలో ముఖ్య మైలురాళ్ళను చూపిస్తూ ప్రదర్శించిన AV సభికులను అలరించింది.

డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తనకు చెప్పడానికి మాటలు రావట్లేదని, అందరూ తనపై చూపిన ప్రేమ, అభిమానం తానెప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. చదువు అన్న మూడక్షరాలే ఎక్కడో భారతదేశంలోని ఒక పల్లెటూరులో పుట్టిన తనను ఇంతగా ఎదిగే అవకాశం కల్పించిందని, ఆ చదువు అందరికీ అందుబాటులోకి తేవడానికే, తాను ఎన్నో విద్యాసంస్థలకు దానధర్మాలు చేస్తూ తనవంతు సహాయం అందిస్తున్నానని సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు.

ఈ సభ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యకర్తలు కందుల సాయి, కోట్ని శ్రీరాం, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, తనారి గిరి లకు డా.హనిమిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సభానంతరం అతిధులకు విందు భోజనం అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected