Connect with us

Education

విద్యాలయాలే ఆలయాలంటూ పాఠశాలల వృద్ధికి గోరంట్ల వాసు ఎనలేని కృషి

Published

on

బాపట్ల జిల్లా, పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ గోరంట్ల వాసుబాబు గత 10 సంవత్సరములలో ఆంధ్రప్రదేశ్ లోని (అల్లూరి సీతారామరాజు, అనంతపూర్, అన్నమయ్య, బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణ, కర్నూల్, ఎన్టీఆర్, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, రేపల్లె, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం) 19 జిల్లాలలోను, తెలంగాణ లో (భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ) 5 జిల్లాలలోను మొత్తం 270 ప్రభుత్వ (జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, సరస్వతి శిశుమందిర్ పాఠశాలలు) పాఠశాలలలో సైన్స్ ప్రయోగశాల పరికరాలు మరియు బోధనా సామాగ్రిని ఉచితంగా అందజేయటం జరిగింది. ఈ 24 జిల్లాలలో ఇప్పటికి 270 పాఠశాలల్లో ఈ విధమైన సౌకర్యాలు తన స్వంత డబ్బు తో (సుమారు 1 కోటి 50 లక్షలు రూపాయలు పైగా ) గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్వచ్చందంగా అందించటం జరిగింది.

డాక్టర్ గోరంట్ల వాసు బాబు వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు: ఈ గోరంట్ల వాసుబాబు ప్రాధమిక విధ్యాబ్యాసం పర్చూరు మండలం లోని వీరన్నపాలెం, ఇనగల్లు పాఠశాలలలోను, ఉన్నత విధ్యాబ్యాసం పర్చూరు యార్లగడ్డ రామన్న ఉన్నత పాఠశాలలోనూ, ఇంటర్మీడియట్ కారంచేడు YVCRCSP జూనియర్ కళాశాలలోనూ జరిగింది. ఆ తరువాత విశాఖపట్నం, ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ (BE), ఎం.టెక్ మరియు పి హెచ్ డి (డాక్టరేట్ డిగ్రీ) చేశారు.

దివంగత నేత నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న అభిమానం తో ఆంధ్ర విశ్వ విద్యాలయం లో విద్యార్థి దశలోనే తెలుగుదేశం పార్టీ లో చురుకుగా తిరుగుతూ పలు విద్యార్థి సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు. వారి పి హెచ్ డి (డాక్టరేట్ డిగ్రీ) ని ఎన్టీఆర్ గారికి (May 28th, 1994) అంకితమివ్వటం జరిగింది.

డాక్టర్ వాసుబాబు ఇంజనీరింగ్ విధ్యా విధానం పైననూ, సివిల్ ఇంజనీరింగ్ లోను సుమారు 100 (నూరు) పరిశోధనా పత్రాలను పలు జాతీయ అంతర్జాతీయ సదస్సలకు సమర్పించారు. 1997 నుండి 2002 మధ్య కాలంలో సింగపూర్, మలేషియా, మకావ్ దేశాలలో సివిల్ ఇంజనీరింగ్ మరియు నిర్మాణ రంగం పై జరిగిన 20 అంతర్జాతీయ సదస్సులకు కార్యనిర్వాహక సభ్యునిగాను, అంతర్జాతీయ సలహా దారునిగాను వ్యవహరించటం జరిగింది

ఈ సందర్భం లో ఎన్నో విశ్వవిద్యాలయాలలో జరిగిన జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని ప్రసంగించారు. అదే సమయం లో ఆయా విశ్వవిద్యాలయాలలో ఉన్న ప్రయోగశాలలు పరిశీలించటం జరిగింది. అప్పటివరకు అర్ధం కాని కొన్ని విషయాలు ఆయా ప్రయోగశాలలు పరిశీలించాక సులభంగా అవగహన కావటం జరిగింది. డాక్టర్ గోరంట్ల వాసు బాబు గత 10 సంవత్సరములలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోని 270 పాఠశాలలలో సైన్స్ ప్రయోగశాల పరికరాలు మరియు బోధనా సామాగ్రిని ఉచితంగా అందజేయటం వెనుక వారి అభిప్రాయాలను ఇక్కడ ఇవ్వటం జరిగింది.

మనం ఏదయినా విషయాన్ని చెవులతో విన్నదాని కన్నా కళ్ళతో చూసినదాన్ని ఎక్కువగా గుర్తించుకోగలము మరియు సులభంగా అవగాహన చెసుకోగలము. అందుకే పాఠశాల స్థాయిలో దృశ్య శ్రవణ విద్యా విధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నందమూరి తారక రామారావు గారు 1984 వ సంవత్సరం లోనే చెప్పారు.

కొంతమంది విద్యార్థి దశలో ఉన్నప్పుడు గ్లోబు, ఆంధ్రప్రదేశ్ పటము, ఫిల్టర్ పేపర్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా చుడలేదు. ఎందుకంటే ఆ రోజులలో సౌకర్యాలు అంతంత మాత్రమే అన్న విషయం అందరికి తెలిసినదే. కానీ అలాంటి చిన్న చిన్న పరికరాలు విద్యార్థి దశలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్నతనం లో అందరం చందమామ, బొమ్మరిల్లు లాంటి బొమ్మల కథల పుస్తకాలు చదువుతాము. అందులో బొమ్మలు ఉంటాయి కాబట్టే మనకు ఆ పుస్తకాల పైన చదవాలనే మక్కువ ఉంటుంది. అదే విధంగా మ్యాప్స్, ఛార్ట్స్ లాంటి చిత్ర పటములు ఉంటే చిన్న పిల్లలకు వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది.

సైన్స్ లో పరికరాలు, ప్రయోగాలు గురించి తరగతి గది లో చెప్పటమే కాకుండా వాటిని చూపించి చెప్తే విద్యార్థులు ఎలాంటి కష్టమైన అంశాలనైనా సులభంగా అవగాహన చేసుకోగలుగుతారు. అందుకే ప్రతి ప్రాధమిక పాఠశాలలోను, ఉన్నత పాఠశాల లోను మ్యాప్స్, ఛార్ట్స్ లాంటి చిత్ర పటములు, సైన్స్ ప్రయోగశాలలో ఉండవలసిన పరికరములు, గణిత శాస్త్రంలో ఉండవలసిన వృత్తము, చతురస్రం లాంటి నమూనాలు, సాంఘిక శాస్త్రం లలో ఉండవలసిన వివిధ మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశముల నైసర్గిక స్వరూపము, నదులు, పర్వతాలు, సముద్రాలు, సరస్సులు, దేశ సరిహద్దులు మొదలైన వాటిని సూచించే పటములు విద్యార్ధులకి ఎంతో ఉపయోగపడతాయి అని నా అభిప్రాయం.

మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన, ప్రాణాలు త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, సమాజంలో ఉన్న ఎన్నో దురాచారాలను రూపుమాపిన సంఘసంస్కర్తలు, ఎంతోమంది చరిత్రకారులు, కవులు, గాయకులు, దేశాధినేతలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో పరిశోధనలు చేసి ఆ ఫలితాలను మనకు అందచేసిన శాస్త్రవేత్తలు మొదలగు వారి చిత్రపటాలు, వారి జీవిత చరిత్రలని తెలియచేసే చిత్రపటములు, చారిత్రాత్మక కట్టడాలు, మన పూర్వికుల జీవన విధానాన్ని తెలియచేసే చిత్రపటములు, వివిధ దేశాల రాజధానులు, జాతీయపతాకాలు, భాషలు, కరెన్సీ మొదలైన మ్యాప్స్, ఛార్ట్స్ కూడా పాఠశాలలో ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే నేను ప్రతి పాఠశాలకు ఇలాంటి బోధనాభ్యసన పరికరాలను అందజేయటం జరిగింది.

ప్రాధమిక పాఠశాలలోని విద్యార్థుల వయస్సుని దృష్టిలో పెట్టుకుని వారికి చూడగానే అర్ధం అయ్యేలా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలకు చెందిన భాషాభాగాలు, గ్రామర్ మొదలగు ఛార్ట్స్, వివిధ రకాల వృత్తులు, వాహనాలు, వైద్యపరికరాలు, ఆరోగ్యసూత్రాలు, వివిధ రకాల నిర్మాణాలు, నీతికథలు మొదలగునవి సులభంగా అర్ధం అయ్యేలా అవసరమైన మ్యాప్స్ ని అందజేయటం జరిగింది. ఈ చార్టులని ఉపయోగించి విద్యార్థులకు పాఠాలు నేర్పటం ఉపాద్యాయులకి, విద్యార్ధులకి కూడా ఎంతో సులభంగా ఉంటుంది. ఇదే విషయాన్ని నేను బోధనా సామాగ్రి ని అందచేసిన పలు పాఠశాలల నుండి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మరియు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నా ద్రుష్టి కి తీసుకురావటం జరిగింది.

ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల ప్రయోజనం కొరకు సైన్స్ పాఠ్యంశాలు సులభంగా అర్ధం అయ్యేలా సహాయపడే మానవ అస్థిపంజరం, మానవ ప్రసరణ వ్యవస్థ, మానవ శ్వాసకోశ వ్యవస్థ, మానవ జీర్ణ వ్యవస్థ, 3D నమూనాలు ఉన్నాయి. మానవ చెవి, మానవ మూత్రపిండము, మానవ నాడీ వ్యవస్థ, మైక్రోస్కోప్, మైక్రోస్కోపిక్ స్లయిడ్‌లు, రెయిన్ గేజ్, ఎనిమోమీటర్, పెరిస్కోప్, గ్రాఫ్ రోలింగ్ బోర్డ్, బ్యాటరీ ఎలిమినేటర్, త్రాసు, గ్లోబ్, కెమికల్స్ మరియు గ్లాస్‌వేర్, స్ప్రింగ్ బ్యాలెన్స్, వోల్ట్‌మీటర్, అమ్మీటరు, గాల్వనోమీటర్, డైస్సెక్షన్ బాక్స్, రసాయనాలు మొదలైన పరికరాలు, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాంఘికశాస్త్రం, గణితశాస్త్రంల లోని అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రపటములను అందజేయటం జరిగింది

ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి బాగా లేని విద్యార్థులు, ప్రభుత్వ వసతి గృహములలో నివసించే పేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకి వస్తున్నారన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే అలాంటి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ విధమైన కార్యక్రం చేపట్టాను. ఇది నేను ఒక్కడినే నా స్వంత ధనం తో ఏర్పాటు చేస్తున్నాను

నేను వ్యాపారవేత్తనో, పారిశ్రామికవేత్తనో కాదు. అమెరికా లో ఒక జాబ్ చేస్తున్నాను. కానీ నాకున్న దాంట్లోనే కొంత ఇలాంటి వాటికి వినియోగించటం వలన ఎంతోమంది పేద విద్యార్థులకి ప్రయోజనం చేకూరుతుందని విశ్వసిస్తూ వివిధ పాఠశాలలకు ఇలాంటి సైన్స్ ప్రయోగశాలలో ఉండవలసిన పరికరములు మరియు బోధనా సామాగ్రి ని అందచేస్తున్నాను.

నేను అందచేసిన పాఠశాలల్లో వీరన్నపాలెం మరియు పర్చూరు పాఠశాలలు మాత్రమే నేను చదువుకున్న పాఠశాలలు. మిగిలిన పాఠశాలలు ఎక్కడ ఉన్నాయో, అక్కడ ఉపాధ్యాయులు ఎవరో, విద్యార్థులు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ అక్కడ చదివే విద్యార్థులలో చాలా మంది బాగా వెనుకబడిన, ఆర్ధిక స్తోమత అంత బాగాలేని వారే. అందుకే వారికి కొంత చేయూత ఇవ్వాలని ఇన్ని పాఠశాలలకు నేను ఇవన్నీ అందజేసాను . సుమారు 1 కోటి రూపాయలకు పైగా ఇందుకు నేను వినియోగించటం జరిగింది. వాస్తవంగా ఇది నా స్థోమత కి మించినదే అయినా ఎంతోమంది విద్యార్ధులకి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తూ ఇంత డబ్బు నేను వినియోగించటం జరిగింది.

మనకు కొన్ని నీతి సూక్తులు ఉన్నాయి. బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసం బ్రతకకూడదు అంటారు పెద్దలు. అదే విధంగా మనం బ్రతకటం కోసం కొంత సంపాదించుకోవాలి, కానీ సంపాదించుకోవడం కోసమే బ్రతక కూడదు అని నా వ్యక్తిగత అభిప్రాయం.

నేను చదివిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయము అన్నీ ప్రభుత్వ విద్యాలయాలే. నేను నా జీవితం లో ప్రాధమిక, ఉన్నత విద్యాభ్యాసం, కళాశాల, విశ్వవిద్యాలయము లలో నేను డాక్టరేట్ పట్టా పొందటం వరకు నేను చెల్లించిన ఫీజుల మొత్తం 2000 (రెండు వేలు) కూడా ఉండదు. ప్రభుత్వ వ్యయంతో చదుకున్న నేను కొంతైనా ఇలా కొన్ని పాఠశాలలోనైనా విద్యార్థుల అభివృద్ధికి కృషిచేయటం నా బాధ్యత గా భావిస్తున్నాను.

పాఠశాలలో ఎన్నో సౌకర్యాలు ఉండాలి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తూ, ఎంత కష్టమైన పాఠ్యంశాలనైనా సులభంగా అవగాహనా చేసుకునేలా, పాఠ్యంశాలు వారి మనసులో ముద్రపడేలా ఉపయోగపడే సరైన భోధనాభ్యసన సామాగ్రి.

పాఠశాల స్థాయిలో విద్యాబోధన పూర్తిగా భోధనాభ్యసన సామాగ్రి ద్వారా విద్యార్థులకు నేర్పించటం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. ఈ భోధనాభ్యసన సామాగ్రి ద్వారా కష్టమైన పాఠ్యంశాలను ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు సులభంగా అవగాహనా అయ్యేలా నేర్పించటం, ఉపాధ్యాయులకు సులభతరం అవ్వటం వలన నూతన విద్యావిధానానికి పునాది వేయటం జరిగింది.

వాసుబాబు ఈ కార్యక్రమాన్ని కేవలం బోధనాభ్యసన సామాగ్రిని మరియు సైన్స్ ప్రయోగశాల పరికరాలను ఉచితంగా అందజేసే కార్యక్రమంగా మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు, ఆయా పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులకు, అమెరికాలో ఉంటున్న పలువురు ప్రవాసాంధ్రులకు ప్రేరణ కలిగేలా ఒక యజ్ఞంలాగా చెయ్యటం జరిగింది.

బోధనా సామగ్రి/సైన్స్ ప్రయోగశాల పరికరాలను అందజేయటానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలలను ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా ఎంచుకున్నాడు:

  1. బాలికలు, పేద, అనాథ విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలు.
  2. గ్రామీణ/వెనుకబడిన/గిరిజన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలు.
  3. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు
  4. వ్యవసాయ కూలీలు, సంచార జాతులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో పాఠశాలలు

గత 20 సంవత్సరాలుగా అమెరికాలో నివాసముంటున్నా కూడా, స్వదేశాన్ని మరువకుండా గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో వాసుబాబు అందించిన విద్యా పరికరాల ద్వారా సుమారు 1,00,000 మంది పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. అన్ని ఆలయాలకన్నా విద్యాలయం గొప్పది. మసీదు కు ఒక మతం వాళ్ళు, చర్చి కు ఒక మతం వాళ్ళు, దేవాలయానికి ఒక మతం వాళ్ళు వెళతారు. కానీ అన్ని కులాల వారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళేది, వెళ్ళవలసిన ఆలయం విద్యాలయం. అందువలన విద్యాలయాల అభివృద్ధికి కులం, మతం, ప్రాంతం, పార్టీ లతో నిమిత్తం లేకుండా అందరం సమిష్టి గా కృషిచేయాలన్నది నా అభిప్రాయం.

– డా. గోరంట్ల వాసుబాబు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected